Friday, January 29, 2021

మహా సంకల్పము

సంకల్పము అనగా మంచి ఆలోచనతో కూడి అమలు చేసే ప్రక్రియ అని అనుకోవచ్చు. సంకల్పము బలముగా ఉంటే దానిని వజ్ర సంకల్పంగా పేర్కొంటారు. 

దీనిని సాధించే పట్టుదలను ఒక విధముగా ఉడుంపట్టు అంటారు. ఉడుంపట్టు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉడుము అనేది ఒక జంతువు. దాని సహాయంతో నడుముకి తాడు కట్టి, ఎత్తైన కోట గోడలను అధిరోహించుటకు తేనె సహాయంతో ఉడుముని వదిలి శత్రువు గోడల లోపలకు ప్రవేశించే ప్రయత్నాన్ని ఉడుంపట్టుగా పేర్కొంటారు. ఎత్తయిన, దుర్భేద్యమైన కోట గోడలు ఎక్కి శత్రు విజయమునకు ప్రయత్నించే విధానములో సాయపడేది అతి చిన్న జంతువైన ఉడుము అంటే కొందరికి నమ్మశక్యం కాదేమో. ఇదే విధముగా రామ రావణ యుద్ధంలో లంకకు వెళ్ళటానికి సముద్రంపై వంతెన నిర్మించడంలో ఉడుత చేసిన చిరు సహాయము ఉడుత సహాయంగా రామునిచే గుర్తింపబడినది. మన చుట్టూ ఉన్న వారి మాటల ప్రభావం కొన్ని సందర్భములలో మనల్ని ఏమార్చి మన సంకల్పమును  నీరుగార్చవచ్చు. అప్పుడే దృఢ సంకల్పం అవసరం అవుతుంది. దృఢ సంకల్పం ఉన్నవారికి విజయావకాశాలు ఎక్కువగా ఉండి వారికి వచ్చే ఆటంకాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ముందుకు సాగాలి. దేశ రక్షణ లక్ష్యంగా ఎన్నో కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే సైనికుల సేవ మనకు ఆదర్శం కావాలి.

సంకల్పం మంచిదైతే దానికి దైవసహాయం లభిస్తుందనే బలమైన నమ్మకం ఉంది. సంకల్ప ప్రయాణం అమల్లో వచ్చు ఆటంకములు గుర్తించి ముందుకు పోయేవారుఆర్థిక వనరులు ఉన్నవారు, మాటల నేర్పు గలవారు. అధికారుల సహకారం ఉన్నవారు, తమ సంకల్ప ప్రణాళికను అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పగలవారు, అవి లేనివారి కంటే ముందుంటారని అనుకోవడం సహజమే. మన సంకల్పం మంచిదే అయినా దానిని బలపరిచే అదే అభిప్రాయము గల వారి సహాయ సహకారములు పొందుట మంచి పరిణామంగా భావించినప్పుడు ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ ఏ పనికైనా వెంటనే అందరి సహకారం లభించదు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనని గమనిస్తూ ఉన్నవారి తోడ్పాటు లభిస్తుందని తెలుసుకోవాలి. అంతవరకు దృఢ సంకల్పముతో ఒంటరి సంకల్ప ప్రయాణం తప్పనిసరి.

ఒక గడ్డిపోచ బలమైన తాడుగా మారి బలమైన ఏనుగుని బంధించ గలిగినప్పుడు మనందరి దృఢసంకల్పం బలమైన సంకల్పంగా మారి సమస్యను పరిష్కరించలేదా? దేశ అభివృద్ధి కొరకు మనము చేసే దృఢ సంకల్పములను మహా సంకల్పంగా పిలుచుకుందాం. మనకి మనము సహాయం చేసుకుందాము. స్వార్థం తగ్గించుకొని, మంచి ఆలోచనలతో తోటివారికి మనకున్న శక్తి పరిధిలో మంచి చేయుటకు ప్రయత్నిద్దాం. ఈ సంకల్పం  దృఢ సంకల్పముగా మారి నలుగురిలోకి వెళ్లినప్పుడు అదే మహాసంకల్పం అవుతుంది.

నాయకుడిగా ఆలోచించండి. కార్యకర్తగా పని చేయండి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.