Wednesday, January 27, 2021

ఐకమత్యము - సంఘ బలము

చిన్నప్పుడు బడిలో నేర్పిన పాఠమును గుర్తు చేసుకుందాము. ఒక ఊరిలో ఒక కట్టెల వర్తకుడు నలుగురు కుమారులతో ఉన్నాడు.

యుక్త వయసు వచ్చినవారు వయసు ప్రభావంతో ఐకమత్యం లేక వారిలో వారు పోట్లాడుకునేవారు. బాధ పడిన తండ్రి ఒక ఉపాయం ఆలోచించాడు. తమ కుమారుల ఎదుట ఒక కట్టెలమోపు ఉంచి దానిని విప్పకుండా కట్టెలను విరవమని చెప్పాడు. కుమారులు ఆ విషయంలో ఓడిపోయినప్పుడు కట్టెలు విడివిడిగా తీసి విరిచి చూపించి ఐకమత్యము గొప్పదనమును వారికి తెలియ చెప్పాడు. అనగా కలసి ఉంటే కలదు సుఖం అనే నీతిని వారికి అర్థమయ్యే విధంగా తను చేస్తున్న వృత్తి ధర్మం ద్వారా పిల్లలకు తెలియజెప్పి వారికి జీవితంలో ఉపయోగపడే మంచి లక్షణాలను వారికి నేర్పి వారి ఆలోచనలు సరిదిద్దాడు. ఐకమత్యం లేకనే మన దేశం చాలాకాలం విదేశీయుల పాలనలో ఉందని చరిత్ర ద్వారా మనకు తెలిసిన సత్యము. మానవుడు సంఘజీవి. తను ఏ వృత్తి చేస్తున్నప్పటికీ అనేక అవసరముల దృష్ట్యా తోటివారితో కలిసి పోయి నడవవలసిన అవసరం ఉన్నది. కానీ ఈనాడు అలా జరుగుట లేదుతోటివారితో కలసి వారి కష్టసుఖములలో స్పందించేవారు తక్కువగా కనబడతారు. తను తన పక్క వారికి అన్యాయం చేస్తూ, ఇతరుల ద్వారా జరిగే అన్యాయములకు సూత్రధారిగా మిగిలిపోవడం జరుగుతుంది. దీనికి స్వార్థ గుణం ఎక్కువగా పనిచేస్తుంది.

ఈ సందర్భంలో నా దృష్టికి చిన్నప్పుడు జరిగిన యదార్థగాథ జ్ఞాపకం చేసుకుందాము. ఒక ఊరిలో ఊరి బయట సుమారు మూడు లేక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక కాలేజీ పెట్టారు. దానికి సంబంధించిన వారి రాకపోకల సౌకర్యం కొరకు ఒక సిటీ బస్సు మనుషులచే నడపబడే రిక్షాలను అందుబాటులోకి తెచ్చారు. సిటీ బస్సులు, రిక్షాలు ఒకేసారి వాడవలసిన సందర్భం వచ్చినప్పుడు ఎక్కువమంది వాడేది సిటీ బస్సు అని అందరికీ తెలుసు. ఈ నిజం అందరికీ తెలిసినా ఇది అందరూ పాటిస్తే రిక్షా వారికి బాడుగలు ఉండవు. ఈ సమస్యను దాటుటకు రిక్షావారు పాటించిన అనూహ్య నిర్ణయం వారి మనుగడను కాపాడింది. కష్టమైనా, ఆదాయం తగ్గినా వారి నిర్ణయము వారిని బతికించింది. సిటీ బస్సు ఛార్జీలతో సమానమైన రిక్షా చార్జీ ప్రయాణికుల నుండి వారు తీసుకొనుటకు నిర్ణయం తీసుకోగానే వారి రిక్షాలకు సరిపడా ప్రయాణికులు వారికి దొరికి వారి బ్రతుకు తెరువుకి మార్గము వారు మలచుకున్నారు. వృత్తిలో పోటీ తట్టుకోవడానికి వారు తీసుకున్న నిర్ణయం వారిని కాపాడిందని మనందరికీ ఈపాటికి అర్థమైంది అనుకుంటాను. సమయం ఎక్కువ పెరిగినా బస్సు కంటే రిక్షాల ఫ్రీక్వెన్సీ ఎక్కువ అని మనం గుర్తించాలి. ఈ  సంఘటన సంఘ బలముచే మనం ఎలా బాగు పడాలో అని ఆలోచించగలవారికి సహాయపడుతుందని నమ్మి వ్రాయటం జరిగింది.

ఈ సందర్భంలో అనేక కార్మిక సంఘముల పాత్ర కూడా చెప్పుకోవాలి. అనేక కర్మాగారములలో మరియు సంస్థలలో పని చేయు కార్మికులు, ఉద్యోగస్తులు వారి ప్రయోజనములు కాపాడుకొనుటకు చేరిన సంఘములు వారి సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తున్నవని చెప్పాలి. 

ఒక గడ్డిపోచను ఎవరైనా తుంచగలరు గాని కానీ అదే గడ్డిపోచల సముదాయము ఒక బలమైన తాడుగా మలచినప్పుడు అడవికి రారాజైన ఏనుగును బంధిస్తుంది అని తెలుసా? అదే విధముగా చాలా చిన్న ప్రాణి అయిన చీమ దాని గుంపుల సామర్ధ్యంతో బలమైన సర్పమును చంపుతాయి. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ అనే వాక్యము సంఘ బలము, ఐకమత్యమును చెబుతుంది. చివరిగా ఐకమత్యమే సంఘ బలమని ఎన్నో సందర్భములలో రుజువయింది.

ఆశ: నా బలమే సంఘ బలమని గట్టిగా నమ్ముతూ దానిని దేశాభివృద్ధికి సక్రమముగా వినియోగించుట అందరి కర్తవ్యం కావాలి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.