Tuesday, January 19, 2021

మనసు

మనసు శరీరంలో ఉండే జ్ఞానభాగము అని మనకి తెలుసు. శరీరంలో అన్ని భాగముల పరీక్ష నిర్ధారణకు ఉపయోగపడే ఉపకరణాలు మనసు రోగ నిర్ధారణకు కూడా పనికొస్తాయి.

జంతువులకు లేదని ఎక్కువమంది భావించే మనసు మానవ శరీరంలో అత్యుత్తమ భాగముగా నిర్ణయింపబడి జీవించుటకు కావాల్సిన సూచనలకు సంబంధించిన అవయవముల ద్వారా అందజేస్తుంది. పూర్తి జీవిత కాలంలో జరిగే అన్ని మంచి చెడులకు మనసే కారణం అని మనకు తెలుసు. చెడు వినవద్దు, చెడు కనవద్దు, మాట్లాడవద్దు అని దేశమునకు స్వాతంత్ర్యము తెచ్చిన గాంధీ మహాత్ముని మాటలకు ఎంతో అర్థం ఉంది. మనసు పనిచేయక శరీర భాగములు పనిచేయని నిద్రాణ స్థితి అనే కోమాలోకి వెళ్లిన మనిషిని మెదడు చచ్చిన వాడిగా నిర్ణయించి బ్రతికి ఉన్నా, చచ్చిపోయిన వ్యక్తిగా భావిస్తారు. అలానే ఎక్కువకాలం కోమాలో ఉండి మామూలు స్థితికి వచ్చిన వారిని అదృష్టవంతులుగా గుర్తించి, వైద్య రంగంలో అద్భుతం జరిగినట్లు చెప్పుకుంటారు. మనసును అదుపులో ఉంచుకున్నవారు విజేత అవుతారు. అలాగే అదుపులేని మనసు గల వారి జీవితమును పగ్గాలు లేక కళ్లెం లేని గుర్రపు సవారీతో పోలుస్తారు. హింసకైనా అహింసకైనా మనసులోని ఆలోచనల తీవ్రత ప్రధానముగా కనిపిస్తుంది. మనస్సు, శరీరము, జీవ శక్తి లేక ప్రాణశక్తి ఒకే ప్యాకేజీ అయినందున మనస్సు ఆలోచనల ద్వారా శరీరం చేసే అన్ని తప్పులు చట్టవ్యతిరేక పరిధిలోకి వెళ్తే శరీరమునకు శిక్ష పడుతుంది. మనసు పూర్తిగా అదుపులో లేక చెడు ఆలోచనలతో మనం చేసే పనులు పలు నేరములకు కారణమవుతాయి.

మనము ఒక నోరూరించే పళ్లతోట పక్కగా వెళ్తున్నప్పుడు దానికి రక్షణ లేకపోతే మనస్సు ఆలోచనల ప్రకారం నేరుగా తోట లోకి వెళ్లి  పళ్ళు కోస్తాము. దానికి బలమైన రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ, మనస్సులోని ఆలోచన లేక కోరిక బలమైనదైతే ప్రమాదకరం అని తెలిసినా కొందరు ప్రయత్నిస్తారు. ఈ విషయమును శివరాత్రి సందర్భంలో గుంటూరు నుండి నరసరావుపేట వెళ్లే రైలు బోగీలపై కూర్చుని చేసే ప్రమాదంతో కూడిన ప్రయాణంతో పోల్చుకోవచ్చు. మనసు చెప్పిన అసాంఘిక ప్రయోజనములు కొరకు చేసిన శారీరక విన్యాసములు శిక్షను ఆహ్వానిస్తాయి. పూర్వజన్మని నమ్మేవారు గత జన్మల పరంపరలో చేసుకున్న మంచి ఆలోచనతో కూడుకున్న పనులు వారిని సన్మార్గంలో నడిపిస్తాయి. ఎన్నో మంచి ఆలోచనల ద్వారా వారు చేసిన మంచి పనులు కొన్ని చెడు కాలంలో చేసిన చెడ్డ పనులు వారిని శిక్షర్హులుగా నిలబెడతాయి.  ఒకవేళ వారు భూలోక శిక్షలు తప్పించుకున్నప్పటికీ, ఇతర లోకములు ఉన్నవని నమ్మేవారు ఆ లోక శిక్షలు తప్పవని భావిస్తారు. అదేపనిగా తప్పులు చేసే కొందరు భూలోక శిక్షలు తప్పించుకునే నైపుణ్యం సంపాదిస్తారు. పాపభీతి, దైవభీతి కలవారి మనసు తప్పు పనులు చేసినప్పుడు కొంత ఒత్తిడికి లోనవుతుంది. పాపభీతి, పుణ్య సంపాదన మనిషిని చాలా సందర్భములలో చెడు ఆలోచనల నుండి  కాపాడుతుంది. ఇందులో కీర్తి కాంక్ష పాత్ర ఉంటుంది.

జీవితంలో అడ్డదారుల ద్వారా ప్రయాణము అందరికీ కలిసిరాదు. ప్రమాదములు పొంచి ఉంటాయి. దీనిని రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళుటకు కాలి వంతెన బాట ఉన్నా, దానిని వాడకుండా ఎప్పుడు బయలుదేరుతుందో తెలియని పట్టాల మీద ఆగి ఉన్న గూడ్స్ బండి కింద నుండి బయటకు వెళ్లాలని ప్రయత్నించడంతో సమానముగా చెప్పుకోవచ్చు. అవగాహన కలిగిన వారికి దానిలో పొంచి ఉన్న ప్రమాదం తెలుస్తుంది. కొందరు తమ తోటివారితో వారి ఆలోచనలలో లోపం ఉన్నదని గ్రహించి చెప్పినా, వారు నా మనసు నా మాట వినుటలేదు అని అంటారు. మనసు మన మాట వినాలి, తప్పదు. ఇందుకు మన పెద్దవారు చెప్పిన మంచి మాటల ఆలోచన మందుగా పని చేస్తుంది. మనసు మన మాట విననప్పుడు మన చుట్టుపక్కల ఉండేవారు ఇదే ఆలోచనలతో అమలు చేసి, పడిన ఇబ్బందులు గమనించి, మన ఆలోచనలు సవరించుకొనుట కూడా విచక్షణలో ఒక భాగమని గుర్తుంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుటకు వైరాగ్యంలో సన్యాసం పుచ్చుకునే చివరి అంచు వరకు వెళ్లే మానసిక స్థితి కొంత ఉపయోగపడుతుంది. అనగా సన్యాసం పుచ్చుకొనుట కాదు. అవతల వారి మానసిక స్థితిని మనము అంచనా వేయలేము. కనక వైరాగ్య వంతులుగా మనము భావించే వారి మనసు వారి స్వాధీనములో పూర్తిగా ఉందని భావించలేము. రెండు గడ కర్రలపైన కట్టిన సన్న వైరు తాడు మీద పడిపోకుండా నడిచేటప్పుడు, ఏకాగ్రత దృష్టి తగ్గినా, నడకలో ఎక్కడ క్రింద పడతాడో తెలియని విధము ఇందుకు కారణముగా చెప్పుకోవచ్చు. మనకు అందుబాటులో గల అనేక రకముల ఆకర్షణలు దీనికి కారణం అని చెప్పుకోవాలి. మనసు స్వాధీనం అన్నది తేలిక కాదు అని మనకు అనిపించవచ్చు కానీ ప్రయత్నించే వారికి విజయం సాధ్యమే.

మనసు స్వాధీనములో ఉంచుకొనుటకు పెద్దల మాటలు, మత విశ్వాసం ద్వారా తెలుసుకున్న విషయముల నుండి మన విచక్షణ సక్రమముగా ఉపయోగించటం ముఖ్యం. అన్ని సమస్యలకు మూలకారణమైన  మనసు స్వాధీన ప్రక్రియలో విచక్షణ అన్నది ముఖ్య ఆయుధమని మరువరాదు. విచక్షణకు జ్ఞానము పెంచుకోవాలి, జ్ఞానము పెంచుకోవాలంటే మంచి పుస్తకములు చదవాలి.

నీతి: అవతలివారి మంచి గుణములు మీరు గుర్తించినప్పుడు, వాటిని మీరు పాటించాలంటే దానికి వారు పాటించిన సాధనా పద్ధతులు కూడా పాటించాలి. ఆ గుణములు మీకు లేవని నిరాశా నిస్పృహలకు లోనవ్వవద్దు ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉండండి. వారినే విజయం వరిస్తుందని నమ్మండి.

కరోనా కష్ట కాలంలో మంచి మనసుతో బాధితులకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...