Friday, January 15, 2021

జ్ఞాపకశక్తి మరియు క్షమా గుణము

జ్ఞాపకములు భద్ర పరచవలసింది మనసులో. మనసు పొరలలో ఎన్నో అనుభూతులు పదిలపరచి ఉంటాయి. పుట్టినప్పటినుండి జీవితంలో అనుభవించిన సుఖ దుఃఖముల అనుభూతులు మనసులో భద్రంగా ఉంటాయి.

సుఖానుభూతి ఆనందము కలుగజేస్తే, దుఃఖానుభూతులు మర్చిపోవడం చాలా ముఖ్యం. మరువ లేకపోతే మనసు నిరాశ, నిస్పృహల స్థితిలోకి నెట్టబడి ప్రతిబంధకంగా తయారవుతాయి. ఇలా మరచిపోవుట కొరకు మనసులో కల మతిమరుపు సహాయపడుతుంది. మతిమరుపు ఎక్కువైతే ఆ లక్షణములు మానసిక రోగంగా వ్యవహరిస్తారు.

మతిమరపు కొన్ని వృత్తులవారికి అత్యవసరము. ఉదాహరణకు ప్రజల కష్టములు వినే జ్యోతిష్యులు, ప్రశ్నలు చెప్పేవారు మొదలైన వారు. విద్యా విధానంలో ప్రస్తుతం ఉన్న ఆధునిక సౌకర్యములు అందుబాటులో లేనప్పుడు మౌఖికంగా అనగా ముఖతా విని వల్లె వేయుట ద్వారా జరిగేది. ఆనాటి కాలములో జ్ఞాపకం ఉంచుకొనుట అవసరమైన అర్హతగా భావించేవారు. ముసలితనములో అవతలివారిని గుర్తించలేక మనసులోని జ్ఞాపకములు మర్చిపోయి, ముదిరిపోయిన మతిమరుపును ముసలివారు జీవితంలో ఎదుర్కొనే ఒక తప్పని మానసిక రోగ పరిస్థితిగా గుర్తించారు.

జ్ఞాపక శక్తి తగ్గిన వారిని మందమతులుగా భావిస్తే, జ్ఞాపకశక్తి వరముగా భావించి దానిలోని ముఖ్యభాగమైన మతిమరుపును జీవితంలో ఒక భాగంగా ఆదరించాలిక్షమాగుణము మనిషిని ఉన్నతముగా నిలబెడుతుంది. క్షమాగుణము గల ఆడువారిని భూదేవితో పోలుస్తారు. వెనకటి రోజులలో చాలామంది ఆడవారు వారి క్షమాగుణముతో తమ సంసారములలో జరిగే ఎన్నో అవకతవకలని సరిదిద్దుకొని నిలుపుకున్నారు. అయితే ఆధునిక సంస్కృతి  ప్రభావంతో, కలుషిత వాతావరణం ప్రభావం ఎక్కువై వారి క్షమాగుణము శాతము చాలావరకు తగ్గినది. దాని ప్రభావమే ఈ కాలంలో మనము చూసే సంసార సమస్యలకు మూల కారణం అవుతోంది.

జీవితములో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అది మనసులోని జ్ఞాపకాలలో ఒక ముద్రగా ఏర్పడుతుంది. కొంతమంది అవతలి వారి వలన జరిగిన మంచి లేక ఇతర సహాయములు జ్ఞాపకం ఉంచుకుంటే, మరికొందరు జరిగిన చెడు లేక అవతలి వారి వల్ల పడిన ఇబ్బందులు గుర్తుంచుకుంటారు. చెడు జ్ఞాపకములు మరిచిపోయినప్పుడు అది అవతల వారిని క్షమించుటలో తన పాత్ర పోషిస్తూంది. క్షమాగుణము వలన సమాజములో హింస పాత్ర తగ్గుతుంది.

క్షమాగుణమును ఉపయోగించి అవతలి వారి వలన పడిన ఇబ్బందులను మర్చిపోయి క్షమించుట అన్నది మనకున్న విచక్షణ. అవతలవ్యక్తి మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడినప్పుడు మాత్రమే దానికి సార్ధకత వస్తుంది. మన ఆస్తులు అన్యాయంగా అనుభవిస్తూ, అనుభవించే ఆస్తిని ఏమాత్రం వదలకుండా కేవలం పశ్చాతాప పడినప్పుడు క్షమాగుణం ఎంతవరకు బయటికి వస్తుందో సందేహమే. క్షమాగుణం బయటికి రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. తప్పులు చేసుకుంటూ కేవలం అవతలివారి క్షమాగుణం ఆశిస్తే, ఆ క్షమాగుణమునకు అర్థం లేదు. అర్హతలేని వారిని క్షమిస్తే వారి దృష్టిలో వీరిని అసమర్ధులుగా చిత్రీకరిస్తారు.

30 ఏళ్ల క్రితం ఒక జాతీయ రహదారిపై పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక ప్రభుత్వ బస్సు డ్రైవర్ పై అదే రోడ్డులో వెళ్లే కారు చోదకుడు చేయి చేసుకున్నాడు. అదే విధముగా ఉత్తర భారతదేశంలో ఒక ప్రముఖ పుణ్య క్షేత్రము నందు ఒక రిక్షా డ్రైవర్ పై ద్విచక్ర వాహనదారుడు చేయి చేసుకున్నాడు. అలానే కొంతకాలం క్రితం ఒక నగరంలో ఆటో డ్రైవర్ తో ద్విచక్ర వాహనం పై వెళ్లే ముగ్గురు వాహనచోదకులు వాదించిన సందర్భములు కూడా ఉన్నాయి. ఈ సంఘటనలు జ్ఞాపకం వచ్చినప్పుడు, వారికి ప్రయాణంలో జరిగిన అసౌకర్యమే కోపంగా మారి హింస బయటికి వచ్చింది అని నేను భావిస్తున్నాను. ఇక్కడ బాధితులు జరిగిన దానిని రోజువారీ జరిగే కష్టంగా భావించారు. బాధితులు క్షమించకపోవడం, ఆ ప్రతిఘటించని వారి చర్య ఇవతలి వారికి ఏమీ బాధ కలిగించదు. బలహీనులు కోపంతో అరుస్తారు, బలవంతులు కోపంతో వాదిస్తారు  అని అనుకుంటే ఈ రెండిటికీ కోపం ముఖ్య కారణంగా కనిపిస్తుంది. ఆవేశం కొద్దిసేపు తర్వాత తగ్గి మామూలు స్థితికి వస్తుంది. కోపమునకు కారణము చుట్టూ ఉన్న వాతావరణం, తినే ఆహారము, జన్యువులు కూడా కారణం కావచ్చు. అవతలివారి చర్య వల్ల తక్కువ నష్టాలు కలిగినప్పుడు తాత్కాలిక కోపం, నష్టం ఎక్కువగా భావించినప్పుడు శాశ్వత కోపం కలుగుతుంది. తాత్కాలిక కోపం వెంటనే తగ్గిపోతుంది. కోపం, జరిగిన అవమానం మరచిపోవుట, పగ తగ్గనంతకాలం క్షమాగుణము బయటికి రాదు.

మతిమరుపుతో కలిసిన జ్ఞాపకశక్తి క్షమాగుణం. మనమున్న సమాజమునకు మేలు చేయగల లక్షణము. పనిలోపనిగా జ్ఞాపకశక్తి, క్షమాగుణములు ఆలోచనకు పదును పెట్టి దైవాన్వేషణలో తమ వంతు సహాయం చేస్తాయని తెలుసుకోవాలి. కొన్ని దేశములలో క్షమాగుణం ఆవశ్యకతను చట్టములో పొందుపరిచినందున ఆ దేశ పద్ధతుల ప్రకారం మనము చేసే తప్పుల వలన అవతల వారికి ప్రాణహాని, శరీర కష్టములు జరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఆ శిక్షలు తప్పిపోవుటకు లేదా తగ్గుటకు బాధితుల కుటుంబం నుండి క్షమాభిక్ష పత్రము అందుకోవాలి.

క్షమాగుణమునకు మారుపేరైన భూదేవిని స్మరిస్తూ జ్ఞాపకశక్తి, క్షమాగుణం వృద్ధిరస్తు అని మరొకమారు అనుకుందాము.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.