Monday, January 11, 2021

నోరూరించే దైవ ప్రసాదములు

మన ఇంటికి అతిధి వచ్చినప్పుడు వారిని ఆహ్వానిస్తూ కాళ్లు  కడుగుకొనుటకు నీళ్ళిచ్చి, తర్వాత కాళ్లు చేతులు తుడుచుకొనుటకు పొడి వస్త్రం ఇచ్చి, కూర్చోబెట్టి మంచినీరు తాగుటకు ఇస్తాము. 

విశ్రాంతిగా కూర్చున్న తర్వాత విసనకర్రతో విసురుట వెనుకటి రోజుల్లో జరుగగా, ఆధునిక పద్ధతుల ప్రకారం పంకా వేస్తాము. ఆ సమయమును బట్టి అల్పాహారంతో కూడిన కాఫీ, టీ, ఇతర పానీయములు ఇచ్చుట లేక భోజన సమయం అయితే భోజనము ఏర్పాటు చేయుట చాలామంది గృహస్తులు ఒక ఆచార పద్ధతిగా పాటిస్తారు.

ఇదే విధముగా అనేక పూజా కార్యక్రమములతో దైవమును ఆరాధించిన తర్వాత, శాస్త్రములో చెప్పబడిన నైవేద్య పద్ధతులను అనుసరించి, భక్తులకు ప్రసాదం అందచేయబడుతుంది. ఎక్కువ యాత్రికులు దర్శించే దేవాలయములలో జిహ్వకు సరిపడే నైవేద్య ప్రసాదములు సమర్పించబడి అందుబాటులో ఉంటాయి. మనము వివిధ సంప్రదాయములు పాటించే దేవాలయముల దర్శనమునకు వెళ్ళినపుడు, అక్కడి పద్ధతుల ప్రకారం దైవమునకు సమర్పించిన నైవేద్యం, ప్రసాదములు ఉచితముగా అందినా లేక అమ్మకం ద్వారా దొరికినా తీసుకొని తినటం దైవ దర్శనంలో ఒక భాగం అయింది. ఈ ప్రసాదములలో అన్ని రకముల తీపి, కారములతో చేయబడిన శాకాహార, మాంసాహార వంటలు ఆ దేవాలయ ప్రాంతంలో గల ప్రాంతీయ ఆచారాలను అనుసరించి చేయబడి, నైవేద్యముగా సమర్పించిన తర్వాత భక్తులకు అందుబాటులో ఉంచుతారు. కొన్ని చోట్ల కొన్ని కొన్ని వంటలు ప్రత్యేకంగా ఉంటాయి.

గుంటూరు జిల్లాలో గల కోటప్ప కొండ శివాలయం నందు లభించే అరిసెలు, కర్నూలు జిల్లాలోని రాఘవేంద్ర స్వామి గుడిలో లభించే పరిమళ ప్రసాదము, తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో లభించే గోధుమ రవ్వతో తయారు చేయబడిన నిల్వ తక్కువగా ఉండే రవ్వ ప్రసాదం, కొద్ది కాలం నిల్వ ఉండే బంగీ ప్రసాదము, అదే జిల్లాలో మిగిలిన దేవాలయాల్లో లభించే రవ్వలడ్లు మచ్చుకి కొన్ని. ఎన్ని ప్రసాదములు నైవేద్యముగా సమర్పించినప్పటికీ జిహ్వచాపల్యం కలిగిన వారందరూ ఆదరించే పులిహోర, లడ్డూల పాత్రలను ఎవరూ మర్చిపోలేరు. భక్తి భావంతో దైవదర్శనం చేసిన తర్వాత కొంత మానసికముగా, శారీరకముగా అలసిపోయినప్పుడు ప్రసాదం స్వీకరణ దేవుని ఆశీర్వాదంగా భావించి, శరీరములోని ఆకలి దేవునికి అందజేయడం ద్వారా తృప్తి  చెందుతాము. జిహ్వచాపల్యంచే రకరకముల పిండివంటల నైవేద్యం ఆరగించిన వారికి కలిగిన ఆనందం చెప్పుకోదగినది. శరీరమే దేవాలయముగా భావించే వారికి పంచేంద్రియములలో ఒక అవయవమునకు గల జిహ్వచాపల్యం, తృప్తి కూడా అవసరమే.

శివ సంబంధమైన దేవాలయముల కంటే, వైష్ణవ సంప్రదాయమైన దేవాలయములలో ఎక్కువ ప్రసాదములు దొరుకుతాయి. ఇందుకు ఉదాహరణగా తమిళనాడు శ్రీరంగంలో గల రంగనాథస్వామి దేవాలయ ఆవరణలోని ప్రసాదముల దుకాణం మరియు తమిళనాడులో గల ఇతర దేవాలయములయందు గల దుకాణములను చెప్పుకోవచ్చు. దైవ దర్శనం తర్వాత మనం కోరిన నైవేద్యం కొనుక్కుని తినుట మనసుకి దైవదర్శనం తృప్తితో పాటు శరీరమునందు ఉండే ఆకలి దైవము లేక ఆత్మారాముని తృప్తి నిజమైన సేవలో భాగముగా భావిస్తే తప్పులేదు. ప్రసాదముల వినియోగంలో ధనుర్మాసం, నవరాత్రి వంటి ప్రత్యేక సందర్భములలో చేయు ప్రసాదములు అన్నీ నైవేద్యంలో ఒక భాగమై, పోషక విలువలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకునేవారికి ప్రసాద స్వీకరణ వలన తగినంత పోషక విలువలు  దొరుకునని ఆహార శాస్త్రవేత్తలు విశ్లేషించారు. పోషక విలువలు అందని బలహీనులకు ఇది సహాయకారి. దేవాలయంలో దర్శనం పూర్తి భక్తిభావంతో చేయకపోయినా, ఆ దేవాలయములో లభించే ప్రసాదములు భక్తులను ఆకర్షించి వారిలో ప్రత్యేక ముద్రలు వేస్తాయి. కేరళలో గల కొన్ని ప్రసిద్ధి దేవాలయములందు గల ప్రసాదములు భక్తులచే గుర్తింపు పొందినవి. గుంటూరు జిల్లాలో గల మంగళగిరి పానకాల స్వామి వారికి చేసే పానకము సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా గుర్తింపబడింది. మనము మానవులైనందున ఒకేమారు దైవము, ప్రసాదము ఎదురుగా ఉంటే, ఎక్కువ మంది నైవేద్య ప్రసాదమునకు ముందు ప్రాధాన్యమిచ్చి, తర్వాత దైవంపై దృష్టి పెట్టుట మానవ బలహీనతను గుర్తుచేసే సహజ ప్రక్రియగా భావించవచ్చు. దైవ దర్శనం తర్వాత కొన్ని దేవాలయముల ప్రసాదము కంటికి ఆనందము, నోటికి  జిహ్వచాపల్యం కలిగిస్తాయి. కొన్ని దేవాలయములలో ఆడవారు తమ నైపుణ్యములతో ప్రసాదముల తయారీలో పాలుపంచుకుంటే, కొన్ని సంప్రదాయ పద్ధతులు పాటించే దేవాలయములలో మగవారు ఆ తయారీ ప్రక్రియలో పాలు పంచుకుంటారు. కొందరు భక్తులు యాత్రలో నిల్వ ప్రసాదమును కొని, కొంతమంది భక్తులకు పంచి, అప్పుడే యాత్ర ఫలం దక్కినట్లు భావిస్తారు. కొన్ని దేవాలయములలో ప్రసాదముల తయారీ మొత్తం కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహింపబడుతుంది. దైవము లేదా నైవేద్య ప్రసాదములు రెండూ భిన్నమైనవి కాదు, ఒకటే. దైవము ప్రసాదించిన పదార్థములతో  చేయబడిన నైవేద్యములు ఆయనకు సమర్పించి, తిరిగి మనము అందుకున్న ప్రసాదమును మన కంటికి కనబడే దైవ ఆశీర్వచనముగా భావించాలి. నైవేద్య ప్రసాదముల తయారీ, వినియోగము దైవభక్తిలో ఒక భాగమైనది. నిల్వ నైవేద్య ప్రసాదములు కొన్ని పోస్టు ద్వారా దొరికినప్పటికీ, అవే పదార్థములు తినుబండారశాలలో లభించినప్పుడు చాలామంది దేవాలయ ప్రసాదము దైవానుగ్రహము, ఆశీర్వచనముతో పవిత్రమైనందున వాటిని దేవాలయమునందు స్వీకరించుటకు ఆసక్తి చూపుతారు.

జిహ్వచాపల్య ఫల సిద్ధిరస్తు -  దైవ దర్శన ప్రాప్తిరస్తు

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...