Sunday, January 10, 2021

ద్వంద్వ భావములు – దొంగతనం, శత్రునాశనం

దొంగతనం అనగా అవతలవారి సంపదకు తాను యజమాని కానప్పటికీ, అసలు యజమానికి తెలిసిగాని లేక తెలియక గాని స్వాధీనం చేసుకొనుటగా చెప్పుకోవచ్చు. బలవంతంగా స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ దొంగతనమును ముద్దుగా దొరతనం అని పిలుచుకోవచ్చు.

దొంగతనం 64 ప్రాముఖ్యమైన కళల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనిలో చాలా రకములు గలవు. వస్తు చౌర్యం, సమాచార చౌర్యం మొదలుగునవి. అవతలి దేశ రహస్యములు గ్రహించి విజయము పొందినప్పుడు, దానిని దేశభక్తి వీరోచిత చర్యగా భావిస్తాము. దేశమును శత్రువుల నుండి కాపాడుకొనుటకు ఈ గూఢచర్యము అత్యవసరముగా భావిస్తారు. దొంగతనములు అమావాస్య రోజున ఎక్కువగా జరుగుతాయని ఒక విశ్లేషణ ఉంది. దొంగతనము చేయుటలో ఎన్ని ఆధునిక పద్ధతులు అనుసరించినప్పటికీ, దానికి దీటుగా ఆధునిక పరిశోధనల ద్వారా అభివృద్ధి పరిచిన పద్ధతులను అనుసరించి, దొంగల్ని గుర్తించుటలో నేరపరిశోధక శాఖ పాత్ర చాలా గొప్పది.

వెన్న పాలదొంగ కృష్ణుడిని నవనీతచోరునిగా భక్తితో కొలుస్తాము. గోపికల మనసు దోచుకున్న కృష్ణుని భక్తితో గోపిక మానస చోరా అని పిలుస్తాం. వయసులో ఉన్న యువతీ యువకులు తమ హృదయములను అవతలి వారు దొంగలించారు అని ఆనందంగా చెప్పుకుంటారు. భక్తి భావంలో దొంగతనం పాత్ర ఉంటుంది. భగవంతునికి మనం మనలోని చెడు గుణములు దొంగలించి తీసుకెళ్ళమని లేదా మనతో చెప్పకుండానే తీసుకు వెళ్ళమని కోరవచ్చు. దొంగతనమునకు విరుగుడుగా, రుసుము చెల్లించి ఆ వస్తువుకు యజమాని అవ్వడము ఒక పద్ధతి. ధనిక, దారిద్ర్య అసమానతలతో దొంగతనం జరుగుచున్నది.

దొంగతనమునకు గురి అయిన వ్యక్తికి, దొంగతనం చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే అతనిని శత్రువుగా చూస్తాడు. అప్పుడు దాని శత్రు భావంగా చెప్పుకుంటారు. కొందరికైతే తమ తప్పు లేకుండా అవతలివారు వీరిని శత్రువుగా చూస్తారు. దీనికి వీరిపై గల ఈర్ష్య, అసూయ కారణం కావచ్చు. జీవితంలో తెలిసో, తెలియకో శత్రువులు పెరుగుతారు. శత్రువులు లేక శత్రు భావం నాశనం అవుటకు మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో పార్వతి దేవి అవతారంలో ఒకటైన దుర్గాదేవి ఆరాధన శత్రు భావన నాశనమునకు ఒక మార్గంగా చెప్పారు. దుర్గాదేవి ఆరాధన ద్వారా రాహు గ్రహ దోష పరిహారం జరుగుతుంది.

మహా మహిమాన్విత మైన 32 నామాలతో కూడిన దుర్గా స్తోత్రం మీ ముందు ఉంచుతాను. ఈ దుర్గా స్తోత్రం శ్రద్ధ, నమ్మకంతో పఠించుట ద్వారా శత్రువుల నాశనం కాదు, కానీ శత్రు భావ నాశనము జరిగి మనశ్శాంతితో సుఖంగా ఉండండి.

దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా
ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ
నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః

గమనిక:  మీ అన్యాయపు ప్రవర్తన వలన శత్రువులు ఏర్పడితే దాన్ని సవరించుటకు మీరే ప్రయత్నించాలని గుర్తుంచుకోండి.

శత్రువు భావ నాశనమునకు ఇంటర్నెట్ లో దొరికే రెండు పేజీలు ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం కూడా పనిచేస్తుంది.

ద్వంద్వ భావములు

ఈ భావాలు సమయ సందర్భాలను బట్టి బయటికి వస్తాయి. అన్ని రోగ లక్షణాలు శరీరంలోనే ఉండి, మనస్సు, శరీరం బలహీనపడినప్పుడు బయటికి వస్తాయి. దబాయింపుతో కూడిన అమాయకత్వపు మాటలకు సీసీ కెమెరా పర్యవేక్షణతో అడ్డుకట్ట వేయబడతుంది. వ్యక్తులు అజాగ్రత్తతో కానీ, మతిమరుపుతో కానీ వస్తువులు పోగొట్టుకున్నప్పుడు అది తన ప్రయత్నం లేకుండా దొరికినవారు సంతోషపడితే, పోగొట్టుకున్నవారు బాధపడతారువేదాంతము లేదా మతవిశ్వాసం నమ్మినవారు ఋణానుబంధంగా భావిస్తారు. ద్వంద్వ భావముల విషయంలో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతకర్తలు మతపరమైన విశ్లేషణలు మన ముందుంచారు. వారికి గల అనుయాయుల ద్వారా సిద్ధాంతములు బహుళ ప్రచారం పొందినవి. మానసిక ప్రవర్తనకు సంబంధించిన కొన్ని ద్వంద్వ భావముల ఉదాహరణ -  శతృత్వము - మిత్రత్వం, ద్వేషం - ఆదరణ, అసూయ - ప్రేమ, కోపం - శాంతం, హింస - అహింస, సంతోషం - దుఃఖం, నవ్వు - ఏడుపు, అమాయకత్వం - జ్ఞానత్వము, మంచి - చెడు.

జీవిత సత్యం

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించడం కంటే ప్రతివారు మంచి పుస్తకాలను చదవి జ్ఞానం పెంచుకోండి. మీకు నచ్చిన మార్గంలో ముందుకి పోండి. ఎవరి ప్రగతికి అయినా కృషి ముఖ్యమని తెలుసుకోండి. కాలమునకు పక్షపాతం లేదు. విధి లేదా కాలమునకు ఎంతటి వారైనా తలవంచవలసిందే. జీవిత కాలంలో జరిగే సంఘటనలకు మానవ న్యాయము, దైవ న్యాయములో తేడా మనము అనుభవంతో గమనిస్తాము. ప్రతి సంఘటనలో మానవుల ఆలోచన స్వార్థంతో కూడిన మనసు కలిసి ఉండడం కూడా కారణం కావచ్చు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...