Monday, January 4, 2021

జీవితంలో సిఫార్సులు - అహంకారము

మనిషి జీవితంలో పెరిగిన తర్వాత జీవిత కాలంలో కావలసిన పనుల లబ్ది కొరకు సిఫార్సుల మీద ఆధార పడతారు. సిఫార్సులు పరిచయస్తుల ద్వారా లేక అమ్మకం చేయగల వివిధ వ్యక్తుల సహాయం ద్వారా సంపాదిస్తారు. 

ఈ సిఫార్సులలో డబ్బు పాత్ర లేదని పూర్తిగా చెప్పలేము. కొన్ని ప్రముఖ దేవాలయములలో దర్శనమునకు కూడా అనేకమంది వరుస సంఖ్యలో ఉన్న సందర్భంలో త్వరిత దర్శనం కొరకు సిఫార్సులపై ఆధారపడే ప్రయత్నం జరుగుతుంది. వీరిలో కొందరు దర్శనము లేదా పూజ టికెట్ కొని త్వరిత దర్శనం చేసుకుంటారు. వెనుక ఒక దేవాలయ దర్శనమునకు వెళ్లి దర్శనం టికెట్ కొని, దానికంటే ఉచిత దర్శనము తొందరగా జరిగిందని గమనించాను.

ఒక ప్రముఖ దేవాలయమునకు సంబంధించిన వ్యక్తి మాటల్లో ఈ దేవాలయమునకు వచ్చు అన్ని రాష్ట్రాల భక్తులు వారికి అందుబాటులో గల అన్ని పద్ధతులకు తమ తెలివితేటల్ని కలిపి సఫల ప్రయత్నం చేస్తారు. ఇక్కడ గమనించవలసినది దేవుని దర్శనము లేక ఇతర సౌకర్యములకు చేసే ప్రయత్నము దేవస్థానమునకు సంబంధించిన అధికారులకు మంచి ఒత్తిడి కలగజేస్తుంది. దైవ దర్శనము చేయాలంటే ఆయన అనుగ్రహంతోనే రాగలరు. వెనకటికి ఒక దేవాలయ దర్శనమునకు సిఫార్సులు అందుతాయని ఆశతో బయలుదేరి సకాలములో సిఫార్సు అందక,  ఫలితం లేక, డబ్బు ఖర్చు పెట్టి వృధా ప్రయాణముగా భావించిన నిరాశ మిగిలింది.

ఏ సందర్భంలో అయినా క్యూ లైన్లో ఎక్కువ నిలబడలేనప్పుడు, ఉద్యోగ, వ్యాపార సంబంధ, విద్యా సీట్లు, ఇతర విషయముల నిమిత్తం స్వయముగా  ప్రయత్నములు చేసుకోలేనప్పుడు కొంతమంది మధ్యవర్తుల సహాయము అవసరమవుతుంది. కొందరు ఓర్పు అను ఆయుధం కలవారు. నేర్పరితనముతో తమకు కావాల్సిన పనులు సాధించుకుంటారు. వీరికి అర్హత తోడైనప్పుడు, దానిని గుర్తించిన వారి ద్వారా పనులు కొంత సులభంగా అవుతాయి.

చిన్న ఉదాహరణ:

ఒక ఊరిలో గల ప్రముఖ దేవాలయము దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కొంత దూరం బస్సులో వెళ్లి అక్కడి నుండి ఇంకొక బస్సు కొరకు వేచి ఉండగా, ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మీరు రెండు చక్రాల బండి నడపగలరా అని అడిగాడు. ఎందుకనగా అతని వద్ద రెండు చక్రాల బండ్లు ఉన్నాయని, 30 కిలోమీటర్ల దగ్గర గల పెద్ద ఊరికి వెళ్లాలి అని  అడిగాడు. మేము రెండవ బండిమీద ఆ పెద్ద ఊరికి చేరి అక్కడ నుండి వేరొక బస్సు ద్వారా గమ్యస్థానము చేరాము.

ఇక్కడ అర్హత అమలులో ఉన్న బండి లైసెన్స్ తో పాటు బండి నడపగలగడమే అని భావించాలి. దేనికైనా సిఫార్సులతో తగిన అర్హత లేకున్నా పని సాధించుకున్న వారు జీవితంలో సౌకర్యములు పొందుటలో ముందుంటారు. లేనివారు జీవితం అనే క్యూలో వెనకబడి ఉంటారు. అలా అని  మనను మనం చిన్న చూపు చూసుకోరాదు. ఎవరికైనా సిఫార్సులు ఉన్నా కూడా అర్హత పాత్ర తీసివేయలేనిది. అర్హతలతో కూడిన ఆత్మ విశ్వాసము మనకు జయము కలిగిస్తుంది. మనిషికి అహంకారం మనసులో ఉన్న అజ్ఞానం లేక పరిపక్వత లేని మానసిక లక్షణము. అది మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా బయటపడినప్పుడు అహంకార ముద్ర పడుతుంది. కొన్ని ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగిన ఒక కక్షిదారుడు న్యాయవాది కంటే ఎక్కువ తెలుసు  అని అనుకుంటే లేదా వైద్యుల దగ్గర చాలాకాలం వైద్యం చేయించుకున్న తీవ్ర రోగి వైద్యుని కంటే తనకు ఎక్కువ తెలుసు అనుకుంటే తప్పులేదు, కానీ కొన్ని సందర్భాలలో రోగి వైద్యుని దగ్గర, కక్షిదారు న్యాయవాది దగ్గర కొన్ని సలహాలు చెప్పుట ప్రారంభిస్తే అవతలి వారు వీరిని అహంకారంతో కూడిన మాటలుగా భావిస్తారు. అలానే కొందరు తమకు కల వివిధ పనుల నిమిత్తం ఆ వృత్తుల వారిని కలిసినప్పుడు వారి వృత్తుల్లో గల సాధకబాధకాలు, మెలుకువలు కొందరు తెలివిగలవారు గమనించి అవతలవారి వృత్తికి సంబంధించిన మాటల గారడీ లేదా మాయమాటలకు అడ్డుకట్టలు వేసే  మాటలు చెప్తారు. ఇవి సూటిగా ఉండి, అవతలి వారి వృత్తి మనుగడకు ఆటంకం కలిగినప్పుడు ఇవతల వారిని గర్వము లేదా అహంభావంగా పేర్కొంటారు.  వైద్యుడు, న్యాయవాది, ఇతర వృత్తులవారు వారు చేయు వృత్తికి సంబంధించిన విద్య నేర్చుకున్నారని గమనించాలి. ఇలాంటి సందర్భములలో లౌక్యము లేక మౌనము ఇవతలి వారిని కాపాడుతుంది.

కొందరు ఉదారులైన ధనవంతులు దేవాలయములకు, కొన్ని ప్రత్యేక సంస్థలకు ఆర్థిక విరాళములు ఇచ్చినప్పుడు దేవాలయాలు లేక ప్రత్యేక సంస్థల దర్శనమునకు వచ్చినప్పుడు కోరుకునే గుర్తింపు, సౌకర్యములు లభించు క్రమములో అహంకారము, గర్వము పెరిగిన సందర్భములు కొందరు అనుభవిస్తారు. దీనిని భూలోక న్యాయం ప్రకారం చట్టబద్ధమైన పదవుల్లో అధికారము సంపాదించినవారికి లభించే సౌకర్యములతో పోల్చుకొని అది సహజ గౌరవంగా భావించి సర్ది చెప్పుకున్నప్పుడు గర్వము, అహంకారము అదుపులో ఉంటాయి. డబ్బు సంపాదించిన వారే ఏదో ఒక కారణంతో  దాన ధర్మముల ద్వారా తమ సేవా నిరతిని చాటగలరు. స్థూలంగా ఆలోచిస్తే ఈ విరాళములలో అంతర్లీనమైన త్యాగము, వైరాగ్యము కూడా కలిసి ఉంటాయి.

లోక నీతి: ధనవంతులు వారి అవసరములు తీరిన తర్వాత, తమ ఆదాయంలో 3 నుండి 5 శాతము విరాళం ఇచ్చినచో సమాజ అసమానతలను తగ్గించుటకు సహాయపడును.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.