జీవితం ఎదుగుదలలో వీటి పాత్ర చాలా ముఖ్యమైనది. మనిషి తన మీద ఆధారపడిన వారికి కనీస సౌకర్యాలు కల్పించడానికి మరియు వారి భవిష్యత్తు రక్షణకు సంపాదన ఉండాలి.
ఆసుపత్రిలో
చేరిన ఒక రోగితో వైద్య సిబ్బంది మీ పేరిట ఆస్తి ఉంటే ఎవరైనా చూడడానికి వస్తారని, లేకపోతే రారని చెప్పటం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అనగా కష్టసుఖములలో పలకరించు ఆత్మీయులకు రోగుల పేరు మీద గల ఆస్తి ముఖ్యంగా ఉంటుంది.
ఎందుకనగా ఈ కాలంలో బంధువులు, ప్రేమ, ఆత్మీయతలు కాక ధనమే తన పాత్ర
పోషిస్తుందని అర్థమవుతుంది. ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసిన
తల్లిదండ్రులు పిల్లలకు సంపాదించగలిగిన వయసులో ఆ సంపాదన ఏర్పడినప్పుడు కొంత ఆర్థిక
భరోసాతో ఉంటారు. సంపాదించే పిల్లలు ఆర్థిక క్రమశిక్షణ అనగా సరైన రీతిలో ఆదాయమును
వినియోగించినప్పుడు వారిని మనసులో తప్పకుండా మెచ్చుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే
ఖర్చులు పోను సంపాదించిన ఆదాయమును భవిష్యత్ అవసరాలకు, పొదుపు
ప్రణాళిక ప్రకారం సక్రమంగా ఉపయోగించటం. అంటే ఆదాయం మొత్తం ఖర్చు పెట్టకుండా తప్పనిసరిగా కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయటం.
భూమి మీద జన్మించిన వారికి ఎవరికైనా దైవభక్తితో పాటు, సంపాదన కూడా అవసరము. సంపాదన లేనిదే ఈ భూమి మీద ఎవరికీ గౌరవం కానీ, మనుగడ కానీ లేదు. మనకు గల కనీస అవసరాలు మరియు అందుబాటులో గల అన్ని సౌకర్యములు అనుభవించుటకు సంపాదన ఉండాలి. ఈ భూమిపై సౌకర్యములు ఉచితముగా లభించవు. అరకొర ఆదాయం వస్తున్నవారిని మినహాయించి, ఖర్చు పెట్టే అనేక పద్ధతుల ద్వారా మిగిలే ఆదాయమును, వారి సాంఘిక శక్తి నిర్ణయిస్తుంది. మిగులు ఆదాయం కంటే, ఖర్చులు ఎక్కువ ఉన్నవారికి అనేక ఇబ్బందులు వస్తాయి. వారికి మనశ్శాంతి ఉండదు. అనేకమంది ఏదైనా కొనుగోలు నిమిత్తం పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు, అక్కడ అనేక వస్తువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, దానిని క్రెడిట్ కార్డు ద్వారా కొని, ఆ తర్వాత వాయిదాలు కట్టినప్పుడు ఇబ్బంది పడతారు.
దీనికి పరిష్కారంగా చేసే ప్రతి ఖర్చు ఒక చోట రాసినప్పుడు, కొంతకాలం తర్వాత దానిని పరిశీలిస్తే, చేసిన ఖర్చులోని లోపము గ్రహించి, ఆ ఖర్చు అవసరమా కాదా అని అవగాహన వస్తుంది అని కొందరి ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఇది పాటించిన వారికి ఖర్చులపై అవగాహన వచ్చి మేలు జరుగుతుంది. మరికొందరు అప్పుచేసి ఆర్బాటంగా కార్యక్రమములు చేసి, ఆ తర్వాత చెల్లింపు సమయములో ఇబ్బంది పడతారు.
సంపాదనతో పాటు ఖర్చు పరిమితంగా తన స్థాయికి తగినట్లు చేయగలవారు తెలివి గల వారి కోవలోకి వస్తారు. చేసే ఖర్చులలో బయటి ఆహార ఖర్చులు, వినోద కార్యక్రమముల నిమిత్తం చేయు ఖర్చులు కొందరికి ఎక్కువగా ఉంటాయి. కరోనా సమయములో కొన్ని రకముల ఖర్చులు తగ్గి, పొదుపు పాత్ర పెరిగినట్టు మనం గమనిస్తాం. అనుకోకుండా ప్రమాదములు, రోగాలు బారిన పడేవారు వాటి రక్షణ నిమిత్తం వైద్య బీమా చేసుకున్నవారి కుటుంబములలో ఆర్థిక ఆటుపోట్లు తక్కువగా ఉండి వారి ముందు చూపుని మెచ్చుకోవటం జరుగుతుంది. దైవభక్తి గలవారు ప్రమాదముల నివారణకు ఇంటర్నెట్ లో దొరికే ఐదు పేజీల నారాయణ కవచము అనే స్తోత్రం చదివి జాగ్రత్త పడవచ్చు. చాలా కుటుంబములలో సంపాదన బొటాబొటి ఖర్చులకు సరిపోతుంది. అలాంటి వారిని మినహాయించి కొన్ని ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించి దేశ సౌభాగ్యమునకు సహకరించు వారిని గూర్చి చెప్పుకుందాం. జీవితములో కూడు, గుడ్డ, నివాసము అవసరమైనందున వాటి చెల్లింపులు తప్పనిసరి. రవాణా సాధనమైన కారు, రెండు చక్రముల బండి, సొంత ఇల్లు కొరకు చెల్లింపుల స్తోమత కలిగినవారు వాయిదాల్లో వాటిని ఏర్పరుచుకోగల ప్రయత్నం చేస్తారు. కొన్ని వస్తువులు కొన్నప్పుడు వాటి రిపేరు కూడా అవసరమే. తద్వారా ఆ రిపేర్లకు సంబంధించిన రంగంలో చాలా మందికి ఉపాధి కలుగుతుంది.
దైవభక్తి కలిగినవారిలో కొందరు అధిక ఆదాయం ఉన్నవాళ్లు వారి సేవా భావంతో తోటివారికి చేసే ఉపయోగపడే పనుల వలన సమాజమునకు ఉపయోగం జరుగుతుంది. కొందరు ధనవంతులు వైరాగ్యము లేదా ఇతర కారణములచే తమ ఆస్తిని ధర్మ సంస్థలకు అందజేసి మానవ సేవ చేస్తున్నారు.
పొదుపు
వెనుకటికి ఒక ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి భావములో అందమైన భార్య, బొచ్చు కుక్కపిల్ల, కారు, ఇల్లు, పిల్లలు కనీస కోరికలుగా చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకుంటే భార్య, పిల్లలు కాకుండా మిగిలిన విషయములకు పొదుపు సహాయపడుతుంది. పొదుపు అంటే డబ్బు ఒక్కటే కాదు, ప్రకృతి ప్రసాదించిన ఖనిజములు, గాలి, నీరు మితముగా వాడుట కూడా పొదుపులో భాగమే. వ్యర్థ పదార్థములు సక్రమముగా వినియోగించుట, కళ్యాణము ఇతర కార్యక్రమాలలో ఆహార పదార్థములు వ్యర్థము కాకుండా చూచుట, కరెంటు, ఆయిల్ ఖర్చులపై అదుపు కూడా పొదుపులో భాగమే. తమ ఇంటిలో కరెంట్ పొదుపు చేసే కొందరు, తమ కార్యాలయంలో అవసరమైన విద్యుత్ నియంత్రణకు కృషి చేయకపోవడం మనం గమనిస్తాం.
ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం దేశ సంపదను వృద్ధి చేసే విధంగా అన్ని రంగములలో తగ్గించగల ఖర్చులతో సమగ్ర ప్రణాళికను తయారుచేసుకుని, దానిని హైస్కూల్ వ్యవస్థ నుండి పాఠ్యాంశముగా భావితరాలకు అందుబాటులోకి తేవాలి. కొన్నిచోట్ల రోడ్ల కూడలిని మూసివేసినందువలన, కిలోమీటర్ పైన రోడ్డు తిరుగుటకు వాహనదారులకు అయ్యే ఇంధనం ఖర్చు లెక్కించితే, దేశం మొత్తం మీద లక్షల రూపాయల దుబారా నుంచి కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మీ దగ్గర గల కష్టార్జితం అయిన డబ్బులు వడ్డీ తక్కువైనా అసలుకు డోకా లేని ప్రభుత్వ పథకంలో మాత్రమే పెట్టండి. బెల్లం చుట్టూ ఈగలు చేరతాయని ఆలోచిస్తే, మీ దగ్గర డబ్బు ఉన్న విషయం తెలిసిన బంధువులు, పరిచయస్తులు డబ్బులు అడిగితే వడ్డీ ఆశతో కానీ, మొహమాటంతో కానీ డబ్బు చేజార్చుకోవద్దు. లేకపోతే డబ్బు ఇచ్చి పగ అనే సామెత మీ విషయంలో నిజమవుతుంది. డబ్బు ఇచ్చిన తర్వాత అది వసూలు చేయుటకు ప్రత్యేక నేర్పరితనం ఉండాలి. అది ఉంటే మీరు ముందుకు పొండి. అలా అని కష్టములలో ఉన్నవారికి సహాయం చేయుటకు వెనకాడవద్దు. విచక్షణ ముఖ్యం. ఉద్యోగంలో చేరినప్పటి నుండి పొదుపు ప్రణాళిక పాటించిన వారికి, కొన్ని ఏళ్ళు గడిచిన తరువాత పొదుపు మొదలుపెట్టినవారికి రాబడిగా వచ్చిన ధనములో తేడా ఉంటుంది. పొదుపు చేయు విషయములో అశ్రద్ధ, బద్ధకము పనికిరాదు. సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవాలి. దైవభక్తి, సేవాభావం, పొదుపు ప్రతివారికి కనీస అలవాటుగా ఉండాలి.
ముఖ్య నీతి
మనకు ఎవరితో అయినా పని పడినప్పుడు పొగడలేక పోయినా పర్వాలేదు, కానీ అనవసరమైన ప్రసంగము చేయకుండా తక్కువ మాటలతో బయటపడాలి. కొందరు అదే పనిగా పొగుడుతూ పనులు చేయించుకోవాలని చూస్తారు. పూర్వకాలంలో రాజులు తమ ఆస్థానములలో పొగడుటకై వందిమాగధులను నియమించుకునేవారు. వ్యర్థ సంభాషణకు చిన్న ఉదాహరణ: ఒక వ్యక్తి ప్రశ్నలు చెప్పేవాడి వద్దకు వెళ్లి, అనవసరంగా తన చావు ఎప్పుడో చెప్పమని కోరాడు. అవతలి వ్యక్తి వారించినా వినకుండా ఒత్తిడి చేయటంతో, దానికి సమాధానముగా రెండు రోజుల్లో చస్తావని చెప్పడం జరిగింది. తర్వాత ఆవ్యక్తి ఆయుర్దాయం తీరినదో, లేక వాక్శుద్ధి వలన జరిగిందో అతను మరణించి కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చాడు. వ్యర్థ సంభాషణలకు మౌనమే పరిష్కారము. మౌనము మనలను అన్ని విధములా జాగ్రత్త చేస్తుంది. అధిక ప్రసంగం చేసి తప్పులు మాట్లాడటం కన్నా మౌనము మంచిది.
ప్రస్తుత నీతి
రిటైరైన తర్వాత పొదుపుకి సంబంధించిన ఆర్థిక పుస్తకములు చదివి, దాని ప్రకారం నడవలేక వయస్సు ఆటంకంతో, జీవితంలో సక్రమమైన పొదుపు మార్గములో నడవలేదని, దైవముతో పాటు పొదుపు కూడా అవసరమని నాకు అర్థమైంది. దీనికి పరిష్కారంగా తల్లిదండ్రులు పాఠశాల స్థాయి నుండి, పాఠశాల యాజమాన్యం, ప్రభుత్వ సహకారంతో పొదుపు అవగాహన కార్యక్రమములు పాఠ్యాంశముగా అమలు చేస్తే భావి భారత పౌరులకు, తద్వారా దేశ సౌభాగ్యమునకు ఎంతో మేలు జరుగుతుందని అనుకుంటున్నాను.
No comments:
Post a Comment