Tuesday, December 8, 2020

జీవితములో దేవుని చూడగలమా

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.

సకల దేవతా స్వరూపమైన గురుదేవునికి నమస్కరిస్తూ ఈ వ్యాసం చదువండి.

జీవితములో దేవుని చూడగలమా -  ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. దైవము అనునది ఒక బలమైన నమ్మకం. నమ్మినవారు కొందరు. నమ్మనివారు ఆధారం కావాలంటారు.  దేవుడు ఉన్నాడని మనం గట్టిగా నమ్మితే, తప్పక దేవుని చూడవచ్చు. దేవునికి రూపం ఉందని కొందరు, లేదని కొందరు అభిప్రాయపడతారు. వివిధ రకమైన పూజలు, స్తోత్రాలు, హోమాలు, దైవ దర్శనం ద్వారా మన కోరికల కొరకు దేవుని ఆరాధించేవారు ఎక్కువగా ఉంటారు. దైవమును ప్రత్యక్షంగా చూడాలని కోరుకునేవారు తక్కువగా ఉంటారు. మన కోరికలు తీరినప్పుడు, దానిని భగవంతుని లీలలకు ఒక స్మరణగా భావించాలి. దేవుని చూడాలని  గాఢంగా అనుకునేవాళ్ళు, ఈక్రింది పద్ధతులు ఒకమారు చదువుకుని దానిని భగవంతుని దర్శన మార్గంలో ఒక భాగంగా అనుకోవాలి.

చరిత్రలో జ్ఞానము సంపాదించి, అందరికీ జ్ఞానమార్గం చూపేవారి కంటే ఏమీ చదువుకోని పామరులు దైవ దర్శనం లేదా దైవానుభూతి పొందిన సందర్భాలు ఉన్నాయి.

బీహార్లోని రాంచీలో ఉన్న యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, పరమహంస యోగానంద స్వామి వ్రాసిన ఆత్మకథ, ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే పుస్తకం ద్వారా ఆయన ప్రపంచ పర్యటనలలో దర్శించిన కొందరు మహానుభావులైనవారు చేస్తున్న పనులు దైవానుభూతి లేక దైవ దర్శనము ద్వారా నడిపించే కొంతమంది వివరములు మనము తెలుసుకుంటాము.

1. ప్రశ్నలు, జాతకములు చెప్పేవారు

భవిష్యత్తుపై ఆశలతో ఎంతోమంది ప్రశ్నలు జాతకం చెప్పేవారిని కలుస్తారు. వీరిలో కొందరికి వాక్శుద్ధి, మాటల చాతుర్యము ఉంటుంది. వారు చెప్పే విషయాలలో కొన్ని నిజం అవుతాయి. కొన్ని జరగవు. వారు చెప్పే పరిహారములు కొన్ని ఖరీదైనవైతే, పని జరుగనప్పుడు ఆర్థిక ఇబ్బంది. అప్పు చేసి కార్యక్రమములు జరిపితే మరీ ఇబ్బంది. మీరు  ఎక్కడికి వెళ్ళినా మీ విచక్షణ ఉపయోగించండి. ఎవరు మంచివారో, ఎవరు మోసకారులో చెప్పలేని పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త.

2. భక్తి

భక్తిని రెండుగా విభజిస్తే, ఒకటి మూఢ భక్తి, రెండోది గాఢ భక్తి.

మూఢభక్తి:

తిన్నడి కథ తెలుసుకుందాం. ఆటవిక నాయకుడైన తిన్నడు అనబడే కన్నప్ప తన భక్తితో శివునికి కళ్ళు సమర్పించి దైవదర్శనం ద్వారా అనుగ్రహం పొందినట్టు తెలుసుకున్నాము.

ఇంకొక భక్తుని కథ పేపర్లో చదివినది. చిదంబరం నటరాజ స్వామిని దర్శించిన ఒక భక్తుడు స్వామిని నృత్య భంగిమలో చూసి అమాయకంగా వంకరగా ఉన్నాడని రోగంతో బాధ పడుతున్నాడని భావించాడు. స్వామికి నూనె రాస్తే తగ్గుతుందని, అక్కడివారు చెప్పగా ఆ పని చేసిన తర్వాత తగ్గలేదని బాధ పడుతూ ఉండగా, స్వామి అతనికి దర్శనం కలగజేసినట్లు చదివి దైవ దర్శనం అనుభూతి పొందాను.

గాఢ భక్తి:

ఈ భక్తి కలిగిన పుణ్యాత్ములకు దైవదర్శనం లభిస్తుంది. కాని తేలికగా కాదు,  పరీక్షల తర్వాత ఆయన దర్శన భాగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.                                                                     

                                                                                                                        (సశేషం)

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.