Thursday, December 10, 2020

జీవితములో దేవుని చూడగలమా - 2

3. దైవం మానవ రూపంలో జన్మించి ప్రబోధము ద్వారా మానవ సేవ చేసిన మహనీయుల చరిత్ర మననం చేద్దాం.

వీరబ్రహ్మం

సాక్షాత్తూ విష్ణు స్వరూపునిగా భావించే ఈయన కడప జిల్లా బనగానపల్లిలో ఎక్కువ కాలం ఉండి అక్కడ సమాధి పొందారు. కాలజ్ఞానము అనే భవిష్య దర్శన గ్రంథము ద్వారా భవిష్యత్తులో జరిగే అన్ని విషయములు చెప్పి ఎందరికో మార్గదర్శకులైనారు. శరీరంలో గల షట్చక్రముల గూర్చి శిష్యులకు చెప్పినప్పుడు, కక్కయ్య అను శిష్యుడు అమాయకముగా ఆ చక్రములను స్వయంగా చూడదలచి తన భార్యను చంపినట్టు, స్వామి అనుగ్రహంతో ఆమె తిరిగి బ్రతికినట్లు మనము తెలుసుకుంటాము.

రాఘవేంద్ర స్వామి

కర్నూలు జిల్లాలో గల మంత్రాలయంలో ఈయన సమాధి కలదు. ప్రహ్లాదుని అవతారముగా భావించే ఈయన సామాన్య గృహస్తుగా జీవించి, ఎన్నో కష్టనష్టములు పడి, దైవ సాక్షాత్కారం పొంది భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షముగా భక్తుల నమ్మకం పొందారు. ఎందరో భక్తులు ఆయన ద్వారా తమ కోరికలు తీర్చుకుంటున్నారు. మంత్రాలయమునకు పది కిలోమీటర్ల దూరంలో గల పంచముఖిలో తపస్సు చేసి ఆంజనేయ స్వామి దర్శనం పొందినట్టు స్థలపురాణం చెబుతున్నది.

సాయిరాం

మహారాష్ట్రలోని షిరిడీలో ఈయన సమాధి ఉన్నది. ఈయన దర్శనం పొంది, కోరికలు తీరి మనశ్శాంతి పొందినవారు చాలామంది ఉన్నారు. ఈయన చెప్పిన ఒక ప్రబోధం వలన మనకు తొలగే సందేహము. ఒక భక్తుడు మామిడి చెట్టుకు పూసిన పూత అంతా కాయలు అవుతాయా అని అడిగాడు. పూత అంతా కాయ కాదని కొంత మాత్రమే అవుతుందని స్వామి చెప్పారు. అలానే మానవ జన్మ ఎత్తిన వారంతా పరిపక్వత చెందరని, కొందరు మాత్రమే జన్మ సాఫల్యం చెందుతారని సాయి మనకు చెప్పారు. సర్వ కార్య సిద్ధికి షిరిడి దర్శనం చేసి తరించండి.

కాశీనాయన

ఈయనకు కడప, కర్నూలు జిల్లాలలో  ఆశ్రమాలు కలవు. అచట అన్నదానం జరుగుతుంది. ఈయన సమాధి కడప జిల్లాలో గల పోరుమామిళ్లకు దగ్గరగా ఉన్న జ్యోతి క్షేత్రము అను చోట ఉన్నది. ఇచ్చట అన్నివేళలా నిత్యాన్నదాన వితరణ జరుగును.

వెంకయ్య స్వామి

నెల్లూరుకు 10 కిలోమీటర్ల దూరంలో గల గొలగమూడిలో వెంకయ్య స్వామి సమాధి ఉన్నది. ఆయన ఎంతో మంది భక్తులను సమస్యల నుండి కాపాడాడు. నెల్లూరు జిల్లాలో ఈయనని నమ్మిన భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

జిల్లెళ్ళమూడి అమ్మ

మాతృశ్రీ అనసూయాదేవి అనే జిల్లెళ్ళమూడి అమ్మ ఎక్కువ కాలము జిల్లెళ్ళమూడిలో ఉండి, సమాధి చెందారు. గుంటూరు జిల్లాలో బాపట్లకు దగ్గరగా 27 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. నిత్యాన్నదానం జరుగుతుంది. ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీర్చిన అమ్మ. ఎందరో భక్తుల కోరికలు తీర్చి కష్టములు తొలగించింది.

రమణ మహర్షి

పంచ భౌతిక లింగములలో ఒకటైన అరుణాచలం (తమిళనాడు) లో ఈయన చాలా కాలం ఉండి సమాధి చెందారు. ఈయన ప్రబోధములు ఆధ్యాత్మిక జీవితములో సాధనముగా బాగా ఉపయోగపడతాయి.

రామానుజులు

తమిళనాడుకు చెందిన ఈయన వైష్ణవ సిద్ధాంతకర్త. తన గురువు చెప్పిన మంత్రమును బహిర్గతము చేసినచో మరణిస్తారని చెప్పినా విశ్వ శ్రేయస్సు కొరకు బయటపెట్టిన సందర్భము విశేషము. దీనిలో ఆయన గొప్పతనం, నిస్వార్థ మనస్తత్వము తెలుస్తున్నాయి.

సత్య సాయిబాబా

విశ్వ మానవ ప్రేమ, మానవ సేవ, పరోపకారమునకు ప్రత్యక్ష సేవల ద్వారా అర్థం చెప్పిన ఈయన అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామంలో సమాధి చెందారు. జీవిత కాలంలో ఆయన చేసిన మంచి పనులు పరోపకారం అనే మాటకు నిర్వచనముగా చెప్పవచ్చు. తన జీవిత కాలంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న అయనపై వచ్చిన విమర్శల జోలికి పోకుండా, మనము ఆయన చేసిన మంచి పనులను గూర్చి చెప్పుకుందాం. తనకు భక్తుల ద్వారా వచ్చిన వేల కోట్ల ఆదాయమును ప్రభుత్వము ద్వారా ప్రజోపయోగకరమైన తాగునీటి వసతి, ఆరోగ్య సంరక్షణ పనులకు అందజేసిన కీర్తి ఆయనకు దక్కింది. లక్షలలో గల ఈయన భక్తులచే దైవ స్వరూపూడిగా కీర్తించబడే ఈయన మానవ సేవకు ప్రత్యక్ష అర్థము చెప్పినారు. దండం పెట్టే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న బోధన ఎంతోమంది హృదయములకు చేరి, వారిలోని సేవా భావం బయటికి వచ్చి, చాలామందికి మేలు జరిగింది. దేశం అంతటా కల ఆయన  సేవా సంస్థలు తమ సేవల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఎంతోమంది ధనవంతులకు ఆయన ప్రబోధము అంది మానవ సేవ జరుగుతున్నది.  

                                                                                                                      (సశేషం)

1 comment:



  1. ఇంత మంది చూసినది సత్యమైతే మనమూ చూడగలుగుతాము



    జిలేబి

    ReplyDelete

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.