Sunday, December 6, 2020

జీవితంలో వ్యతిరేక శక్తులు - అసంతృప్తి

జీవితంలో అన్నీ సమకూరినప్పుడు మనిషి చాలా సంతృప్తిగా ఉంటాడు. కానీ, అందరికీ అన్నీ లభించవు. 

ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎంత డబ్బు ఉన్నవారైనా లోటు లేని జీవితం ఉండదు.  కానీ మనిషి తన చుట్టుపక్కల వారిని చూసి, వారందరూ ఏ లోటు లేకుండా సంతోషంగా ఉన్నారని, తాను ఒక్కడే లోటు జీవితం గడుపుతున్నాడని భావిస్తాడు. నిజంగా ఆలోచిస్తే అది తప్పు భావన.

మనిషి పుట్టినప్పటి నుండి విజయములతో పాటు ఓటమిని కూడా చవి చూస్తాడు. నిజానికి గెలుపోటములు కలిసే ఉంటాయి. ఒక  విజయంతో సంతృప్తి వస్తుందా అంటే పూర్తిగా రాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. విజయములో కూడా కనపడని అసంతృప్తి ఉంటుంది.

మనకు రావలసినది సరైన సమయంలో లభించనపుడు అసంతృప్తి మొదలవుతుంది. ఇటువంటి సంఘటనలు ఒకే సమయంలో మూడు లేక నాలుగు జరిగినప్పుడు నిరాశా నిస్పృహలు మనిషిని కృంగదీస్తాయి.

తీవ్ర నిరాశతో అసంతృప్తి పెరిగి వైరాగ్యం రావచ్చు. లేదా ఇతర సంబంధమైన మానసిక సమస్యలు రావచ్చు. అలాంటి అసంతృప్తి పెరిగిన సందర్భములలో, మనసు దిటవు చేసుకుని మనలోని ఇతర ప్రావీణ్యత వెలికితీసే విధంగా ప్రయత్నించి దానిలో విజయం సాధించి, అసంతృప్తిని బాగా తగ్గించుకోవాలి.

జీవితములో చాలా విషయములలో అసంతృప్తి రావచ్చు. ఉదాహరణకు భార్యాభర్తల సంబంధములో అయినా, పిల్లలకు ఆశించిన మార్కులు రాకపోవడం వలనైనా, కోరుకున్న చోట విద్యాసంస్థలలో ప్రవేశం దొరకకపోవడం, ఉద్యోగ విషయంలో అర్హత ఉన్నా ఆశించిన ఉన్నతి లభించకపోవడం, ఆదాయ వ్యయాల్లో తేడా - ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయములు మన జీవితంలో తటస్థ పడతాయి. ఈనాడు ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి మన ఇరుగు పొరుగువారితో పోల్చుకోవడం సాధారణమైపోయింది. వారికి ఉన్నది, మనకి లేనిది ఆలోచించి, మనము బాధ పడటం వలన  ఏమియు ప్రయోజనము ఉండదు.

దీనికి విరుగుడు:

1. ప్రతివారు తనలోని ప్రత్యేకతలను సమీక్షించుకుని వాటిని వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేయాలి. దాని ద్వారా కొంత ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకోవాలి. మెరుగైన ఆర్థిక పరిస్థితి సంతృప్తిని కలిగిస్తుంది. సక్రమమైన ప్రణాళికతో క్రమబద్ధమైన పెట్టుబడి మీద చక్కని ఆదాయము లభించేటట్లు ముందుకు పోవాలి. చాలా కుటుంబములు ఆదాయము తక్కువ, ఖర్చు ఎక్కువగా నడుస్తాయి.

2. మన అసంతృప్తికి కారణములు ఒక కాగితం మీద రాసి, విశ్లేషించుకుని మన లోటుపాట్లను సవరించుకోవాలి.

3. ఏ మనిషీ అన్ని రంగములలో ప్రావీణ్యుడు కాదు. మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఏ రంగంలో అయినా, మనకు తగిన పరిజ్ఞానం లేదని భావిస్తే దానికి సంబంధించిన నిపుణుల సలహాలు తీసుకోవడానికి ఆలోచించవద్దు. మనకు తెలియని విషయములు తెలుసుకొనుట, సలహాలు తీసుకొనుట తప్పుకాదు, అత్యవసరంగా భావించాలి.

ఒకవేళ ఎవరి సలహా అయినా తీసుకొనటానికి నిర్ణయించుకుంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

మనము ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వారు అనేక సలహాలు చెప్తారు. ఏ సలహా  అయినా వినవచ్చు. కానీ పాటించేటప్పుడు ఆలోచించి, మనకున్న జ్ఞానంతో మంచి చెడులు, లాభ నష్టములు లెక్కించుకుని పాటించటం తప్పనిసరని జ్ఞాపకం ఉంచుకోండి. లేకపోతే అనర్ధాలకు దారి తీస్తుంది. ఉదాహరణగా ఒక విషయం చెప్తాను. మా బంధువులలో ఒకావిడ కంటికి సంబంధించిన నీటి కాసుల వ్యాధితో బాధ పడుతున్నప్పుడు ఎవరో చెప్పిన సలహా విని కంటిలో జిల్లేడు పాలు పోసుకుని శాశ్వతముగా కంటి చూపు పోగొట్టుకుంది.

అయితే ఉపయోగపడే సలహాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, ఒంటరిగా ప్రయాణం  చేసేవారు ఏ వయసు వారైనా తనతో చిరునామా వెంట తీసుకుని వెళ్ళాలి అని చెప్తారు. ఇది మంచి సలహా, కనుక పాటిస్తే తప్పులేదు.

మనకు ఎవరైనా సలహాలు ఇచ్చినప్పుడు దానిలో ఒకటి మంచి లేక ఉత్తమ సలహాగా ఉండవచ్చు. దీనిని కొందరు దేవుని సలహాగా భావిస్తారు. అయితే మంచి సలహాలన్నీ దేవుడి సలహాలు కావని తెలుసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త.

అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.