Friday, December 25, 2020

గ్రహ బాధలు - దైవానుగ్రహము

మానవ జన్మ ఎత్తిన ఎవరైనా కష్ట సుఖములు అనుభవించాల్సిందే. పూర్వ జన్మలను మనం నమ్మితే గత జన్మలలో చేసిన పాప పుణ్యములు ఈ జన్మలో కష్టసుఖములుగా అనుభవిస్తున్నాం.

గ్రహాల వల్ల అవి మన శరీరంలో అనుసంధానమైన భాగములకు రోగములు వచ్చి కానీ లేదా వాటి ప్రభావంతో కొన్ని ప్రాపంచిక కష్ట సుఖములు  అనుభవించటం కానీ జరుగుతుంది. గ్రహములు దైవంచే నిర్దేశింపబడిన విధముగా మానవులకు జరుగు కష్ట సుఖములు ఉంటాయి. కానీ కొన్ని కష్టముల తీవ్రత తగ్గడం కొరకు జ్యోతిష్యం చెప్పేవారిని కలిసి, వారు చెప్పిన గ్రహ పరిహారం జరిపించుకుని కొంత ఉపశమనం పొందుతారు. గ్రహముల కన్నా దైవము గొప్ప ఆయనకన్నా గురువు గొప్ప అని విశ్వాసం ద్వారా నమ్ముతాము. ఈకాలంలో సరైన గురువు దొరుకుట కష్టమైనందున సరైన గురువు తటస్థపడినప్పుడు, వారి సూచనలతో జీవితంలో అనేక రకముల ఇబ్బందులు తొలగిన వారు మనకు చాలా అరుదుగా కనపడతారు. దైవ స్వరూపమైన దేవీ దేవతలకు మండల దీక్షలు తీసుకుని కొందరు కోరికలు సాధించుకుంటారు. గ్రహముల సంచారం, దాని ప్రభావం జీవితకాలమంతా ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు పరిహారం కోసం ప్రయత్నం చేసినప్పటికీ, భక్తుడికి భగవంతునిపై గల భక్తి శ్రద్ధలు, విశ్వాసము అతని కష్టములలో ఓర్పు, సహనం పెంచి కాపాడతాయని భగవంతుని నమ్మేవారు విశ్వసిస్తారు.

సాయిబాబా జీవిత చరిత్ర ద్వారా చిన్న ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం. ఒక విద్యార్థి తల్లి సాయిబాబాతో "పిల్లవాడి గ్రహములు బాగోలేవని పరీక్షలో ఉత్తీర్ణులు కాలేడని భయపడుతున్నాడు" అని చెప్పగా భయపడవద్దని ధైర్యముగా పరీక్ష రాయమని చెప్పినట్లు, ఆ విద్యార్థి పరీక్ష రాసి ఉత్తీర్ణుడైనట్టు మనకి తెలుస్తుంది. కొందరు నవధాన్యములు సాయిబాబా గుడిలో గల ధునిలో వేసి అదే గ్రహ పరిహారంగా భావించి ఆయన అనుగ్రహంతో కోరికలు తీరిన వాళ్ళు ఉన్నారు.

కొందరు కొన్ని పనులు తంత్ర పరిహారం ద్వారా సాధిస్తారు. కొందరికి కొన్ని మొక్కులు, దైవ దర్శనం లేదా పూజా పద్ధతి ద్వారా తీరితే, కొందరు తీరని వాళ్లు కూడా ఉన్నారు. నాకు అర్థమైంది ఏమనగా కొన్ని మొక్కులు ఎప్పటికీ తీరక పోవచ్చు. దేవుడు సర్వశక్తిమంతుడు అయినప్పటికీ, కొన్నిసార్లు సరి అయిన సమయంలో మాత్రమే తీరుతాయి. ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది.

కార్యసిద్ధికై నాలుగు గంటలపాటు హనుమాన్ చాలీసా ఒకే ఆసనం మీద, ఒకే రోజులో 108మార్లు పఠించి విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు. అదే విధముగా రామాయణంలోని సుందరకాండ నియమముతో  పఠించి గ్రహ శాంతి, కోరికలపై విజయము పొందినవారు ఉన్నారు. దీని ఏడు రోజుల పాటు చేస్తారు. అనేక ఊళ్ళలో గల హనుమంతుని ఆలయంలో పూజలు జరిపించుకున్న వాళ్లు దుష్ట గ్రహ పీడ నుండి విముక్తి పొంది మరియు కోరికలు తీరిన వారు ఉన్నారు. ప్రపంచ సుఖములపై వెంపర్లాడిన తులసీదాసు భార్య సలహాతో మారిపోయి రచించిన హనుమాన్ చాలీసాను ఎక్కువ మంది ఆంజనేయ భక్తులు తమ కోరికల సాధనకు మరియు ఆంజనేయ స్వామిపై గల భక్తి భావమునకు గుర్తుగా భావించి చదువుతారు. సేవకు గుర్తుగా నిలిచిన ఆంజనేయస్వామి రామ నామము ఎక్కడ వినబడితే అక్కడ తను ఉంటానని భక్తులకు నిదర్శనము చూపుతూ చిరంజీవియై శివ, కేశవ భక్తులకు సమానముగా ఆరాధ్యుడయ్యాడు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే! 

రామా రామా రామా!  

శుభం

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.