Sunday, December 20, 2020

మానవ శరీరము - రోగ బాధల నివారణ - 2

చాలా వైద్య విధానాలు ఖర్చుతో కూడినవి. రోగగ్రస్తులైన వారి కుటుంబాలు వైద్య ఖర్చులతో చితికి పోతాయి.

కాలంలో ఆర్థిక వనరులే మనిషిని పూర్తిగా స్వాతంత్రంతో నిలబెడతాయి. ఈ మార్గంలో అందుబాటులోకి వచ్చిన పలు వైద్య బీమా పథకాలు రోగి కుటుంబమునకు పూర్తి ఆర్థిక ధైర్యము ఇస్తాయని మర్చిపోవద్దు. పలకరించే రోగాలకు వైద్య బీమా తప్పనిసరి. రోగి కుటుంబమునకు ఆర్థిక భరోసాతోపాటు, కావాల్సిన భరోసా ఇంకొకటి ఉన్నది. అది అతని కుటుంబ సభ్యులతో పాటు కనిపెట్టుకొని సేవ చేయగల మనుషులు. ఉమ్మడి కుటుంబములు కనుమరుగు అవుతున్న వేళ, రోగికి సేవ చేయగల మనుషుల లోటు కనిపిస్తుంది ఇందుకు కొన్ని సంస్థలు రుసుముల తీసుకొని మనుషులను కూడా ఏర్పాటు చేస్తాయి. అవి మధ్యతరగతివారికి అందుబాటులో లేనప్పటికీ, ఆర్థిక భారం భరించగల కొంతమందికి ఊరట కలిగిస్తాయి.

రోగ నిర్ధారణ మరియు చికిత్సకు ఇంగ్లీష్ వైద్యములో అనేక నిర్ధారణ పరీక్షలు కలవు. ఆ పరీక్షల వల్ల రోగ నిర్ధారణ సులువుగా జరిగి చికిత్స ప్రారంభించుటకు వీలు అగుచున్నది. గమనించాల్సిన విషయం ఏమనగా ఇతర వైద్యవిధానాలవారు కూడా ఈ రోగ నిర్ధారణ పరీక్షల మీద ఆధార పడుతున్నారు.

రోగ నివారణలో సానుభూతి, దైవ పూజలు, ఆహారము, ఇతర విషయముల పాత్ర ఉంది.

రోగగ్రస్తులైన వ్యక్తులు తన అస్వస్థతలో పరిచయస్తులు, దగ్గరివారినుండి సానుభూతిని కోరుకుంటారు. దానిద్వారా మానసిక ఉపశమనం పొందుతారు. దీనిని బట్టి రోగ నివారణలో పరామర్శ ద్వారా ఆత్మవిశ్వాసం పెంచే విధానము కూడా కొంచెం మేలు చేస్తుందని మనము నమ్ముతాము. దైవ ప్రార్ధన లేక భక్తి మార్గము ద్వారా రోగ నివారణను కొందరు నమ్ముతారు. కొన్ని తీవ్ర రోగముల నివారణ లేక వాటి తీవ్రత తగ్గుటకు కొందరు ప్రత్యేక పూజలు, విశేష హోమాలు శ్రద్ధగా నమ్మకంతో జరిపించుకుని ఫలితం సాధిస్తారు. మరికొందరు వాక్శుద్ధి కలిగిన దైవ భక్తులు, మంచి మనసు కలవారి ఆశీర్వాదములు పొంది తనలోని ఆత్మవిశ్వాసము, నమ్మకం పెంచుకొని లాభపడతారు. ఇందులో భాగంగా కొందరు మృత్యుంజయ హోమము లేక జపం ద్వారా తీర్థము పుచ్చుకుని స్వస్థత పొందుతారు. అయితే కొన్ని పద్ధతుల వలన వ్యతిరేక చర్య జరిగి, పని జరగని సందర్భాలు ఉండవచ్చు. ఇందుకు నా అనుభవం చెప్తాను.

20 ఏళ్ల క్రితం షుగర్ వ్యాధికి ఒక పూట ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునేవాడిని. ఒక ప్రకటన ద్వారా రేకి వైద్యం వైపు వెళ్ళి, కొన్ని రోజుల తర్వాత, రెండు పూటలా ఇంజక్షన్ చేసుకునే పరిస్థితి వచ్చింది.

జీవన విధానంలో ఆహారం పాత్ర ముఖ్యమైనది. సరైన ఆహార నియమాలు పాటించకపోవటం అనేక రోగాలకు దారితీస్తుంది. ఆహారంతోపాటు విశ్రాంతి మరియు తగిన శ్రమతో కూడిన జీవనశైలి చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు రోగములను పెంచితే, కొన్ని పదార్థాలు రోగాలను అదుపులో ఉంచి మనకు సహాయపడతాయి. అనగా రోగ నివారణకు ఆహార పథ్యం చాలా ముఖ్యమైనదని తెలుసుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాల్సిన వారు వ్యాయామం యోగా, ప్రాణాయామము లాంటివి ఎక్కువగా తన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారు, పిండివంటల్లో ఎక్కువగా శనగపిండి వాడడం వల్ల వాతం ద్వారా రోగ కారకమని కొందరు నమ్ముతారు. నూనెలో బాగా మునిగి వండిన చిరుతిళ్ళు ఎక్కువ రోగాలు కలుగజేస్తాయని కొందరి అభిప్రాయము. కాగిన నూనె మళ్లీ వాడరాదని కొందరు చెప్తారు. మైదాపిండి వాడకం కూడా ఎక్కువ రోగాలను కలగజేస్తాయి అని కొందరి భావన.

కల్తీ ఆహారం మరియు ప్రకృతి ధర్మమునకు విరుద్ధంగా నిలవజేసి వాడే ఆహారం కూడా  రోగ కారణాలు అవుతున్నవి. కొందరు క్రిమిసంహారక మందులతో పెంచబడిన ఆహార ధాన్యం కాక సహజ పద్ధతుల్లో పండించబడిన ఆహారధాన్యాలు వాడి ఆరోగ్యం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పురాణ కథల ప్రకారం గోదావరి నదిని భూమ్మీదకి తెచ్చిన గౌతమమహర్షి ఉదయం విత్తనాలను నాటి సాయంత్రం చేతికి వచ్చే వరి ధాన్యము సాగు చేశాడని చదివాను. అలాంటి ప్రయోగాలలో మన శాస్త్రవేత్తలు విజయం సాధిస్తే బాగుంటుందని నా ఆశ.

రోగములను ఎవరూ తెలిసి ఆహ్వానించరు. మన పద్ధతుల ద్వారా అవే మనల్ని పలకరిస్తాయి. ఒక విధముగా ప్లాస్టిక్ వాడకం రోగకారకమని శాస్త్రవేత్తలు అంటారు. పంచభూతాలైన అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశములకు మనం కలగజేసే హానికరమైన చర్యలు విపరీత రోగ కారకములు కావచ్చు. జల కాలుష్యం, వాతావరణ కాలుష్యం కూడా వీటికి కారణమని చెప్పవచ్చు. కనుక మన జీవితంలో పర్యావరణ పరిరక్షణ కూడా భాగం కావాలి.

శుభం

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.