వ్యామోహం అనబడే కోరికల పుట్టను అందరికీ అర్థమయ్యే వైద్యపరమైన భావముతో దురద అని సరదాగా వ్యవహరించుకుందాం.
దురద శరీరమునకు సంబంధించిన చర్మవ్యాధిగా నిర్ధారింపబడి చికిత్సతో తగ్గుతుంది. ఒక్కొక్కప్పుడు షుగర్ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు దురదలు వచ్చి, చికిత్సతో తగ్గుతున్నాయి. మన చుట్టూ ఉండే వారిలో కోరికలు తీరని అసంతృప్తి జీవులు ఎక్కువ.
మనలోని భావములను అందరితో పంచుకోవాలని అనుకుంటాము. అందుకు వినేవారు దొరకరు. అందరికీ భావములు ఉన్నా కాగితంపై అక్షరరూపంలో ఇవ్వగలిగినవారు కొందరైతే, ఆ కొందరిలో జనం మెచ్చేలా రాయగలిగినవారు చాలా తక్కువగా ఉంటారు. కొద్దిమంది మాత్రం తమలోని భావములకు, అక్షరరూపం ఇచ్చి సొంత ధనం వెచ్చించి దాన్ని వెలుగులోకి తెస్తారు. తెలివిగలవారు ఈ ముద్రణకు పెట్టుబడిదారులను సమకూర్చుకుని ఒడ్డున పడతారు. పాఠకుల స్పందన లభించిన వ్యాసకర్తలు లేదా రచయితలు వారిచే గుర్తింపబడినా, స్పందన లభించని వ్యాసకర్తలు వారి శ్రమను సాహిత్యం దురదగా పోల్చుకునే సందర్భం ఉంటుంది. సినిమా తీసే ప్రతి నిర్మాత ప్రజలు బాగా ఆదరిస్తారు అనుకొని భారీ ఖర్చుతో సినిమాని తీసి ప్రజలు ఆదరించనప్పుడు పడే నిరాశతో దీనిని పోల్చుకోవచ్చు. ఇంకొక రకంవారు పల్లెటూరిలో ఉండి, వారి ఆదాయం పంటలు వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఏదైనా శుభకార్యములు జరిగినప్పుడు చదివింపులు అప్పుగా అనగా తరువాత చెల్లించే విధముగా చదివింపుల పట్టికలో పేరు చెప్తారు. కొందరి చెల్లింపులు ప్రశ్నార్ధకమే. నాకు తెలిసిన వ్యక్తి ఒక సన్మాన కార్యక్రమంలో చేసిన వాగ్దానం మొత్తం నాలుగు అంకెలు, 20 ఏళ్లు అయినా ఆ వాగ్దాన గ్రహీతకు అందలేదు. అతనికి గల వ్యాపారముల ఒత్తిడి రీత్యా అతను మర్చిపోయి ఉండొచ్చు.
దైవ సంబంధము కానీ ఇతర వాగ్దాన భంగములు చాలా సామాన్యము. కొందరు కళాభిమానులు వారికి కళలపై ఉన్న విపరీత మోజుతో ఆస్తులు అమ్ముకొని కళాపోషణ చేస్తారు. చివరికి ఆస్తులు పోయి, అప్పులు మిగిలి, కళాభిమానం మాత్రమే మిగులుతుంది. వారు జీవించే చివరివరకు కష్టములతో జీవనం సాగిస్తారు. ఉదాహరణకు నాటకముల మీద మోజుతో సొంత డబ్బు ఖర్చు పెట్టి చితికి పోయిన వారిని మనం గమనిస్తాం.
చెడు వ్యసనములపై విపరీత ధనమును ఖర్చు చేసి అప్పులపాలై, ఆస్తులు పోగొట్టుకున్న వారిని కూడా మనం గమనిస్తాం. వ్యామోహం అనే దురదతో పోల్చగలిగిన ఈ శక్తికి సంబంధించిన చెడు ఆలోచన మనసులో పుట్టి, శరీరంతో అనేక పనులు చేసి మనిషిని పతనం చేస్తుందని పెద్దలు చెప్తారు. కొన్ని మంచి కోరికల్లో కీర్తి కాంక్ష కలిసి ఉంటుంది. వ్యామోహం అనే కోరికల తీవ్రత తగ్గించుట కొరకు మనసు గట్టిగా ఉండాలని, కోరికలు అదుపులో ఉన్నప్పుడు మనిషి సమతూకంగా జీవనం సాగించగలడని అన్ని మతముల విశ్వాసముల సారాంశము.
జంతువులకు ఆహార సంపాదన, విశ్రాంతి చాలు అని మనం భావిస్తే మానవులకు వాటితో పాటు జీవించుటకు డబ్బు సంపాదన, కుటుంబ సభ్యుల అవసరములు తీర్చుట, వినోద అవసరములు కూడా అదనంగా కావాలి. ఎంతో వైరాగ్యం అబ్బి సన్యాస ఆశ్రమము స్వీకరించిన వారిని కూడా గృహస్థులు ఆదరించుట ఒక భాగమై ఉన్నది. పూర్వజన్మలను మనం నమ్మితే ఎంతో పూర్వ పుణ్య ఫలం అబ్బి, కోరికలు అదుపులో ఉంచుకొని తపస్సు చేసి పరమాత్మ అనుగ్రహం కొరకు ప్రయత్నించువారు చాలా కొద్ది మంది. అనగా కొద్దిమంది మాత్రమే ఉంటారు. సగటు మానవుడికి కోరికలు ఉండుట, అది తీర్చుకొనుటకు వ్యయప్రయాసలు పడుట తప్పనిసరి, ఇప్పుడు మనకు అర్థమైంది కోరికలు లేదా వ్యామోహం అనబడే దురద శరీరమునకు అవసరం. అది శరీరమునకు అవసరమైన లక్షణమని, రోగము కాదని నమ్మాలి. కోరికలు పుట్టుట, అది తీర్చుకొనుటకు వ్యయప్రయాసలు పడుట ఒక చక్ర భ్రమణము అనుకుందాం.
ఈ కోరికలు తీర్చుకొనుటకు పడు కష్టములు సహజము అని భావించేవారు, కొంత సమయం భగవంతుని ధ్యానమునకు కేటాయిస్తే ఆ మార్గంలో ముందుంటారు. అది జీవితంలో ఏ వయసులో ఎంత సమయం కేటాయించాలని వారి జీవన వ్యాపకము బట్టి నిర్ణయించుకోవాలి. చాలామంది తమ వృద్ధాప్య దశలో భగవంతుని ధ్యానమునకు సమయము కేటాయించాలని అనుకుంటారు. అన్నీ ఉడిగి, శరీరము సహకరించక దేవుని మీద కంటే తన శరీరములో బయటపడి బాధించే రోగములు జీవితంలో తీరని కోరికలపై గల ఆశ మనసుని ఆక్రమించి మనకు మనశ్శాంతి దొరకదు. ఇంతకంటే చిన్నతనము నుండి, భగవంతుని చింతనకు సమయం కేటాయిస్తే శరీరం, మనసులకు క్రమబద్ధమైన క్రమశిక్షణ వస్తుంది అని కొందరి అభిప్రాయం. భగవంతుని నమ్మే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సమాజంలో అన్యాయాలు తగ్గుతాయి అనే అభిప్రాయంలో నిజముంది. ఒక ఉదాహరణ చెప్తాను. మనము ఏదైనా యాత్రా దర్శనమునకు వెళ్ళినప్పుడు ముందుగా రాత్రి వసతి కొరకు ఏర్పాటు చేసుకున్నచో పగలు మన పని అయిన తర్వాత రాత్రికి వసతికి జేరి నిశ్చింతగా ఉండవచ్చు. అదేవిధంగా జీవితం మొదలుపెట్టినప్పుడు భగవంతుని ధ్యానమునకు సమయం కేటాయించుకుని, జీవితము సాగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, జీవితం కాచి వడబోసిన వారి అభిప్రాయం. ఈ విషయం అందరూ గమనించి, వారి అభిప్రాయములను గౌరవించి పాటించేవారికి సలహా ఇచ్చి వారి జీవితం క్రమశిక్షణ మార్గంలో ప్రయాణించినట్లు చేయగలరు.
జీవన నీతి: గలగలపారే నిండైన నదీ ప్రవాహము మనిషికి సంతోషం కలగచేస్తుంది. మనసు, శరీరము సహకరించేవారు న్యాయమార్గంలో ధన సంపాదన చేసి తమ మీద ఆధారపడిన వారి అవసరములు తీర్చుటతో పాటు, తోటి వారికి తమ శక్తికి తగిన ఆర్థిక, మానవ సహాయం చేసి ప్రతిఫలం కోరకుండా సమాజాభివృద్ధికి తోడ్పడగలరు.
No comments:
Post a Comment