మానవ శరీర నిర్మాణం బహు విచిత్రమైనది. స్త్రీ గర్భంలో బీజం ద్వారా 9 లేక 10 నెలల కాలంలో పెరిగి, శరీర భాగములు ఏర్పడి ఆ భాగములు కొన్ని పదుల ఏళ్ళు భూమి మీద నిలబెట్టుచున్నవి.
స్త్రీ పురుషుల శరీర నిర్మాణము వారికి గల ప్రత్యేక అవయవములు మినహాయించి చాలా వరకు ఒకే విధముగా ఉంటాయి. ముఖము శరీరంలోని అన్ని భావముల ప్రకటనకు అద్దంగా ఉంటుంది. కొంతమంది అనుభవజ్ఞులు ముఖము చూసి భావములు చెప్పగలరు. ఆత్మవిశ్వాసము, నమ్మకము మనలను జీవితంలో ముందుకు నడిపిస్తాయి. శరీరము రోగ పీడితమైతే, బలహీనుడైనప్పుడు ఆత్మవిశ్వాసము, నమ్మకము తగ్గుతాయి. జీవ శక్తి లేక ప్రాణశక్తి శరీరములో ఉన్నంతకాలం మనిషి అన్ని రంగాలలో జీవన పోరాటం సాగిస్తాడు. అన్ని రకముల వృత్తి వ్యాపకములలో తన జీవనాన్ని సాగిస్తాడు.
ఒక నడి వయసు ఉద్యోగి మాటలలో భగవంతుడు దయామయుడు. శరీర భాగముల నిర్మాణం అతి విచిత్రం. శరీర భాగములకు పూర్తిగా సరిపోయే అవయవములు తయారు కాలేదు. శరీర భాగములకు ప్రత్యామ్నాయ అవయములు తయారు చేసినప్పుడు ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. శరీరం పూర్తిగా బలహీనమైనప్పుడు మనిషి భగవంతుని గట్టిగా నమ్ముతాడు.
మానవ జీవితం క్షణభంగురం. దానికోసం తాపత్రయములతో ఉరుకులు, పరుగులు పెట్టి అవతలివారిని మోసగించటం అవసరమా? తోటివారిని దాటి పోవాలని ప్రయాసపడి జీవిత విధానమునందు రోగములు తెచ్చుకొనుట జరుగుతున్నది. అసంతృప్తి, అత్యాశతో కూడిన మానవ జీవితం రోగములను ఆహ్వానిస్తుంది. కొందరి మనుషుల అత్యాశ, అన్యాయం ప్రవర్తనతో బలహీనులపై బల ప్రదర్శన వల్ల అవతల వారి మానసిక సంక్షోభం ద్వారా వచ్చు శబ్ద తరంగముల ఫలితం చెడు రూపంలో రోగ కారకము కావచ్చును.
రోగము అనగా శరీరంలోని భాగములకు ఇబ్బంది వచ్చినప్పుడు దాని లక్షణం శరీర ఉష్ణోగ్రత లేదా ఇతర లక్షణాల ద్వారా బయటికి వస్తుంది. కొన్ని వ్యాధుల నిర్ధారణకు నాడిని చూసి చెప్పుట కొన్ని వైద్య పద్ధతులలో కలవు. అప్పుడు వైద్యుల సహాయం అవసరమై, రోగ లక్షణాలను బట్టి చికిత్స తీసుకుని కోలుకోవడం జరుగుతుంది.
వైద్య విధానంలో ఎన్నో రకములు కలవు. అన్ని వైద్య విధానములలో వైద్యుని హస్తవాసి, ఆయన మీద నమ్మకం ప్రధానం. కొన్ని రోగ నివారణ ప్రక్రియల్లో రోగ మూలమును కనుక్కుని, దాని నివారణకు ప్రయత్నము జరిగితే, కొన్ని విధానములలో రోగకారక మూలము జోలికి పోకుండా రోగ తీవ్రత నివారణకు ప్రయత్నము జరుగుతుంది. ప్రకృతి చికిత్స, హోమియోపతి, అల్లోపతిగా పిలవబడే ఇంగ్లీష్ వైద్యం, ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, మూలికా వైద్యము, ఇంటిలోని దినుసుల వైద్యం, ఆక్యుప్రెజర్, ఆక్యుపంచర్ అనబడే చైనా సూదుల వైద్యము, ఇతర రకములు కలవు. రోగములే కాకుండా వివిధ ప్రమాదములు జరిగినప్పుడు, శరీర భాగములకు చికిత్సతో కూడిన శస్త్ర చికిత్సలు జరపాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇంకా మానసిక చికిత్సలు ఉంటాయి.
ఆధునిక వైద్యంలో శరీరంలోని అన్ని భాగాలకు ప్రత్యేక వైద్య నిపుణులు ఉన్నారు. కానీ చాలాకాలం నుండి తీవ్ర రోగంతో బాధపడుతున్నవారు అన్ని వ్యాధులు తగ్గుటకు పూర్తి మందులు అందుబాటులోకి రాలేదని, ఇంకా రోగము తగ్గుటకు చాలా మందులు రావలసి ఉందనే అభిప్రాయంతో ఉన్నారు. రోగములు ఎక్కువ, మందులు తక్కువ అని జనాభిప్రాయ సారాంశము. రోగ పీడితులు సర్వరోగ నివారిణి అయిన ఒక మందును శాస్త్రవేత్తలు కనుగొని అందుబాటులోకి తేగలరనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. రక్తమార్పిడిలో భాగంగా రక్తమునకు ప్రత్యామ్నాయము తయారు చేయుటకు పరిశోధకులు చేసే కృషిలో విజయము ఎప్పుడు సాధిస్తారో అని ఆశగా పీడితులు ఎదురుచూస్తున్నారు. దీనివల్ల ప్రమాదముల బారినపడి ప్రాణములు పోగొట్టుకునేవారికి మేలు జరిగి, వారి ప్రాణములు కాపాడవచ్చు.
జీవించి ఉన్న మనిషి శరీర భాగముల అవయవ మార్పిడి కన్నా శరీర భాగముల తయారీ మేలు కదా! చావుని జయించిన మనుషులు భూమ్మీద ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చే ప్రత్యేక సమస్యలు కాలమే పరిష్కరిస్తుందని నమ్ముతాము. వైద్యరంగంలో ఉపాధి పొందేవారు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారనేది వాస్తవం. (సశేషం)
No comments:
Post a Comment