శుభ్రత అనునది మనసుకి శరీరమునకు సంబంధించినది. శరీర శుభ్రత మొదటిది కాగా రెండవది మానసిక శుభ్రత. మనము పాటించే కొన్ని ఆచారములు శుభ్రతతో ముడిపడినవి.
ప్రత్యేకముగా కరోనా సమయంలో మనము పాటించవలసిన శుభ్రత నియమములు అయిన చేతులు శుభ్రంగా సబ్బు లేక శానిటైజర్ తో కడుక్కొనుట, పరిసరములు లేదా మనం వాడు వస్తువులు డిసిన్ఫెక్ట్ చేయుట, కరచాలనం ఇవ్వటం మానుకొనుట మొదలగునవి ప్రాణ భయంతో చేసినా లేక మన పాత పద్ధతుల మీద గౌరవంతో పాటించినా మంచి జరుగుతుంది.
మన ఇంటి శుభ్రతలో ఆడువారి పాత్ర ఎంతో ఉంది. ఇల్లు శుభ్రంగా ఉంచుటలో అనగా ఇల్లు ఊడవటం, బూజు దులుపుట, అద్దములు శుభ్రం చేయుట, కిటికీలు, తలుపులు, గృహోపకరణములపై దుమ్ము దులిపి వాటిని శుభ్రంగా ఉంచుటలో గృహిణి పాత్ర చాలా ముఖ్యం. తాము స్వయంగా చేయలేనివారు పనిమనుషుల సహాయంతో సూచనలు ఇచ్చి చేయించుకొనుట చాలాచోట్ల జరుగుతున్నది. రోజువారి శుభ్రతలో మనము చేయు దంతధావనం, ఇతర శరీర భాగములను శుభ్రం చేయుటతో పాటు స్నానముతో పూర్తి శరీరమును శుభ్రము చేసుకున్నట్లు మనము భావిస్తాము. అతి శుభ్రతను ఓ. సి. డి. గా పిలుస్తారు.
శరీర శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత గురించి కూడా చెప్పుకుందాం. ఈ క్రమంలో అందరూ ఉపయోగించే రోడ్లు, ఇతర పరిసరములు శుభ్రము చేసే పారిశుద్ధ్య పనివారి సేవలు చెప్పుకోదగినవి. కరోనా కల్లోల సమయంలో వీరు అందించిన సేవలు సాక్షాత్తూ ప్రధానమంత్రిచే ప్రత్యేకముగా కొనియాడబడినవి.
శుభ్రతలో ఆరోగ్య శుభ్రత కూడా వస్తుంది. అనగా మనం తీసుకునే పదార్థాలన్నీ తగిన జాగ్రత్తలు పాటిస్తూ వాడాలి. ఉదాహరణకు పాడైపోయిన వంట దినుసులు లేదా వాటితో వండిన పదార్థములు వాడరాదు. కల్తీలను గమనించాలి. ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలము నిల్వ ఉంచిన పదార్ధములు వాడరాదు. అనగా వండిన పులుసు ఫ్రిడ్జ్ లో ఎక్కువకాలం ఉంచి తర్వాత తీసి వెచ్చపెట్టుకుని తినరాదు. అన్ని రకముల జంతువుల మాంసం ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం ఉంచి వాడుట ఆరోగ్యమునకు హాని అని చెప్తారు. రోగాలు తగ్గించటానికి మన వంతు చేయాలి. నిల్వ నీరు మూతలు లేకుండా బొక్కెనలలో చాలామంది ఇళ్లల్లో ఉంటాయి. ఇది కూడా మనం గమనించవలసిన విషయము. ఇది దోమల్ని పెంచి రోగాలు కలుగచేస్తుంది.
ఈ విషయములో సొంత అనుభవం గుర్తు తెచ్చుకుంటాను. సుమారు 32 ఏళ్ల క్రితం ఉత్తరదేశ యాత్రకు వెళ్ళినప్పుడు ఒక హోటల్లో గారె తినాలనే కోరికతో ఆర్డర్ ఇచ్చి, అది వచ్చిన తర్వాత ఆ గారెపై తీగలు సాగుతుండుట చూసిన జ్ఞాపకం ఇప్పటికీ గుర్తుంది.
మానసిక శుభ్రత మనలను శరీర శుభ్రతతో పాటు మానసిక ఆనందం కలగజేసి ఉన్నత స్థానమునకు పోయే మార్గంలో ముందుకు పోవుటకు తోడ్పడుతుంది. మంచి ఆలోచనల ద్వారా వచ్చే ఫలితములు కూడా సంతోషం కలగజేస్తాయి. మానసిక శుభ్రతకు దైవ సంబంధమైన ఆలోచనలు, పనులు, సేవల ద్వారా చెడు పనుల వైపు ఆకర్షింపబడుట తగ్గి, సమాజమునకు తగిన మేలు జరుగుతుంది, అప్పుడే గ్రహ సంబంధమైన వ్యతిరేక చర్యలు అడ్డుకునే శక్తి సమకూరుతుంది, గ్రహదోషములు లేక దృష్టి ద్వారా వచ్చే కష్టనష్టాలకు మనము ఇబ్బంది పడినప్పుడు పండితులు చెప్పే పరిహారములు మనని తాత్కాలికముగా ఒడ్డున పడేస్తాయి, పరిపూర్ణ మానసిక శుభ్రతకు దైవ అనుగ్రహం పొందినప్పుడు జన్మ సార్థకం అవుతుంది, ఇందుకు మార్గముగా పరోపకారం లేక మానవ సేవను కొందరు ఎంచుకుంటారు. అరుణాచల అగ్ని లింగ దర్శనం సర్వపాప హరముగా భక్తులు భావిస్తారు.
మంచి మాట: అర్హత కలిగిన వారు రక్తదానం చేయండి. తోటి వారి
ప్రాణాలు కాపాడండి.
No comments:
Post a Comment