Saturday, December 12, 2020

జీవితములో దేవుని చూడగలమా - 4

11. కర్మలు

మన నిత్య జీవితంలో చేసే పనులన్నీ కర్మల కింద వస్తాయి. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రతి పనికి తగిన మంచి, చెడు ఫలితాలు ఉంటాయని ప్రతివారు గమనించాలి. 

దీనిని ఇంగ్లీష్ లో  ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ యాన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు. నాలాంటి సామాన్యుడికి అర్థమైంది ఏంటంటే, మనం నిత్యజీవితంలో చేసే పనులకు పై సిద్ధాంతం ప్రకారం బలమైన వ్యతిరేక చర్య వచ్చినా, రాకపోయినా ఎంతోకొంత మంచి చెడుల ఫలితం వస్తుందని నిజముగా నమ్మాలి. ఇదే పాపపుణ్యముల కొలబద్దగా ఉంటుంది. మన శరీరము పుట్టుక కర్మబంధము వలన జరిగిందని నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే కర్మల బంధం లేక పోతే జన్మ కానీ, శరీరము కానీ లేదు. దైవభీతి కలవారు నమ్మే ఒక మాట ఏమిటంటే ప్రత్యక్ష సాక్షి అయిన సూర్య చంద్రులు మరియు పంచభూతములు అనగా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములను గుర్తుంచుకొని ప్రవర్తించేవారికి అన్ని విధముల శుభము కలుగుతుంది.

12. విమర్శలు

విమర్శలు మనలను మంచి మార్గంలో తీసుకుని వెళ్తాయని, తప్పులు లేదా లోటుపాట్లు దిద్దుకోవచ్చని భావిస్తే వాటిని ఆహ్వానించండి లేదా మీరు దైవ మార్గంలో ప్రయాణిస్తూ, మంచి పనులు చేస్తుంటే విమర్శలు పట్టించుకోకుండా ముందుకు పోండి.

13. ధ్యానము - యోగము

అనేక రకముల ధ్యాన యోగ మార్గములు అందుబాటులో ఉన్నవి. మార్గం ఏదైనా భగవంతుని మీద దృష్టి బలముగా ఉండుటకు చేసే ప్రక్రియ. మీరు నమ్మిన మార్గంలో ముందుకు పోండి. తమిళనాడు కోయంబత్తూరులో జగ్గీవాసుదేవ్ గారి ద్వారా వేళాంగని అనే ప్రదేశంలో సైంటిఫిక్ గా నిర్మింపబడిన ఈషా టెంపుల్ వారి ధ్యాన మందిరంలో, ధ్యానము చేసి మీ శరీరంలో వచ్చే మార్పులు గమనించండి. యోగసాధనలో కుండలినీ శక్తులను మేలుకొలుపుటకు కోయంబత్తూరు దగ్గరలోని వేదాద్రి మహర్షి ఆశ్రమములో శిక్షణ పొందిన శిష్యులు కుండలినీ యోగం సాధన చేస్తారు. కుండలినీ యోగా  శాఖలు దక్షిణాది రాష్ట్రములలో చాలా చోట్ల ఉన్నవి.

ముఖ్య విషయము

చరిత్ర ద్వారా వివేకానందుని గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస దైవం అనుభూతి పొందిన వారిలో ఒకరుగా మనం తెలుసుకున్నాం.

ఈ వ్యాసంలో వ్రాసిన విషయములు ఎక్కువమందికి తెలిసి ఉండవచ్చు. అయినా మరొకమారు దైవ సంబంధమైన విషయములు చదివి, మన దృష్టిని దైవముపై నిలపడంలో సహాయపడగలవని ఆశిస్తూ వ్రాయటం జరిగిందని గమనించగలరు.

దైవ దర్శనంలో మాత్రమే మానవ జన్మ సాఫల్యం అని కొందరు నమ్ముతారు. మానవ జన్మ దుర్లభమని,  అన్ని రకముల జంతు మరి ఇతర జన్మల తర్వాత మానవ జన్మ సాధ్యమని మత విశ్వాసం ద్వారా నమ్ముతారు. దేవుడు ఎక్కడో లేడు అని, మనలోనే ఉన్నాడని భావించే కొందరు జ్ఞానుల అభిప్రాయంతో ఏకీభవిస్తే, ఆ నమ్మకంతో ముందుకు పోండి. శరీరం దేవాలయముగా భావించి తోటి మానవుల సేవలో తరించండి. క్షమించండి, అధికారంతో సేవ వద్దు. అధికారంతో చేసే సేవలో ఎన్నో తప్పులు జరుగుతాయి అని గమనించండి. ప్రేమతో, ఆప్యాయతతో తోటివారితో కలిసి పోండి. వారి మంచి కోరుకోండి. వారి ఆశీర్వాదమే మీకు రక్ష. భగవంతుడు మెచ్చే పనులు చేయండి. దైవ దర్శనం అసాధ్యం కాదు. కష్టపడి మనసుని, ఏకాగ్రతతో కోరికలని అదుపులో ఉంచుకుని ప్రవర్తించండి. ప్రయత్నించి విజయం సాధించండి. మనలోని దేవుని చూడండి. మీ కోరికలను నిగ్రహంతో  ఏ మార్గంలో అయినా సాధన చేసి విజయము పొందండి. మీకు గురువు దొరికితే ఆయన పర్యవేక్షణలో లేదా షిరిడి సాయినాధుని గురువుగా భావించి ముందుకు పోండి.

చివరిగా సందేహమునకు అవకాశం లేని వివరణ: ఈ వ్యాసంలో వ్రాయబడిన  దైవ దర్శనమునకు అర్థమైనా, పరమార్థమైనా ఒకటే. దేవునితో ప్రత్యక్ష అనుసంధానం మాత్రమే. అది మనలోని దేవుడిని చూచుట లేక ప్రకృతి శక్తిలో అంతర్లీనమైన దైవ శక్తిని పూర్తిగా అర్థం చేసుకుని, దానిని ఆస్వాదించుట అని తెలుసుకోవడమే.

విజ్ఞప్తి: కొవిడ్ నివారణ జాగ్రత్తలు అయిన చేతులు శుభ్రం చేసుకోవటం, కనీస దూరం మూడు నుండి ఆరు అడుగుల పాటించుట, మాస్కులు ధరించుట చేసి కొవిడ్ నివారణ లేదా నియంత్రణలో మీవంతు సహకారం అందించండి.

శుభం

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.