ఒక పనిలోని లోపాలు ఎత్తి చూపటం విమర్శ అయితే దానిలోని మంచిని చూసి అభినందించడం పొగడ్తగా నిర్ణయిద్దాం.
ఒక పనిలోని లోపాలు, మంచి పూర్తిగా అంచనా వేసుకుని పక్షపాతం లేకుండా చెప్పుట ఒక మంచి సలహాగా భావించవచ్చు. కొందరు వృత్తి ధర్మంగా ప్రతి పనిలోనూ లోపాలు ఎత్తి చూపిస్తే, మరికొందరు దానిలోని మంచిని మాత్రమే చెప్పడం మనం గమనిస్తాం. విమర్శలు చేసేవారు దానిలోని లోపాలతో పాటు, దానిని సవరించుకోడానికి సరి అయిన సలహాలు చెబితే, విమర్శలని ఎక్కువ మంది ఆహ్వానిస్తారు. ఒక మనిషికి తాను చేసిన పని ద్వారా, అవతలి వారి నుండి విమర్శలు ఎదురైతే అతడిలోని ఆత్మవిశ్వాసం తగ్గి, నిరాశా నిస్పృహలతో కృంగిపోయే సందర్భం ఉంటుంది. అదే విధముగా అతను చేసే పనిలోని మంచిని గుర్తించి, పొగడ్తను అందుకున్నప్పుడు అతనిలోని ఆత్మవిశ్వాసం పెరిగి, మరికొన్ని మంచి పనులు చేయుటకు ప్రోత్సహించినట్లు అవుతుంది.
ఈ కింది విమర్శను పరిశీలిద్దాం.
ఒక తండ్రి, కొడుకు గాడిదతో రోడ్డు మీద నడిచి వెళుతున్నారు. చూచినవారు “ఇదేమిటి గాడిద మీద ఎవరూ కూర్చోకుండా వెళుతున్నారు, ఎవరైనా కూర్చుంటే బావుంటుంది కదా” అని అన్నారు. ఈ మాటలు విన్న తండ్రీ కొడుకులు సరే ఎవరో ఒకరు గాడిద మీద కూర్చుందామని అనుకున్నారు. ఆ తరువాత తండ్రి దాని మీద కూర్చుని కొడుకుతో పాటు వెళుతున్నాడు. దీనిని చూచిన కొందరు బయటవారు “తండ్రి ఎంత నిర్దయుడు, తను గాడిద మీద కూర్చుని పిల్లవాడిని కష్ట పెడుతున్నాడు” అని అన్నారు. దానిని విన్న తండ్రి వెంటనే గాడిద మీద నుంచి దిగి, కొడుకుని కూర్చోబెట్టి ప్రయాణం సాగించాడు. దీనిని చూసిన కొందరు “కొడుకు ఎంత స్వార్థపరుడు. వయసు మళ్ళిన తండ్రిని కష్టపడుతున్నాడు" అని అన్నారు. ఈ విమర్శకు అసలైన పద్ధతి ఎవరూ చెప్పలేని స్థితి. సమాధానం పాఠకులు ఆలోచించగలరు.
ఈరోజు ఉన్న కాల పరిస్థితులను బట్టి విమర్శల్ని ఆహ్వానించేవారు చాలా తక్కువ. విమర్శలను సవాలుగా స్వీకరించి, లోటుపాట్లను సరి చేసుకుని విజయం సాధించేవారు చాలా తక్కువని చెప్పుకోవచ్చు. పైపెచ్చు విమర్శించబడ్డ వారి నుండి కోపం, అసహనము భరించాలి. కాగా అవతల వ్యక్తి చేసిన పనిలోని మంచిని మాత్రమే గమనించి, దానిని పొగడ్తగా వ్యక్తీకరించినప్పుడు అవతల వ్యక్తి ఆప్తవర్గంలో ఇతను చేర్చబడి కొన్ని ప్రయోజనాలు పొందగలడు. ఈ పరిస్థితి కుటుంబంలోని వ్యక్తుల మధ్య కూడా జరగవచ్చు. మానవ సంబంధంలో విమర్శకుల కన్నా పొగిడేవారిని ఎక్కువమంది ఇష్టపడతారు.
కొందరు వ్యక్తులు సహృదయంతో పక్షపాతం లేని విమర్శలు కావాలని కోరినప్పటికీ, దానిని వారు ఎంతవరకు సహృదయంతో స్వీకరించగలరో అనే సందేహం వస్తుంది. పొగడ్తలు మనని ఆనందముగా ఉంచితే, విమర్శలు ఆలోచింపజేస్తాయి. పొగడ్తల విషయంలో ఆడవారు మగవారి కన్నా ఎక్కువ సంతోషపడతారు అని జనములో ఒక అభిప్రాయం. పొగడ్తలు స్నేహితులను సమకూరిస్తే, విమర్శలు శత్రువులను పెంచుతాయని అనేక పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి. కొందరయితే విమర్శలు వద్దు, పొగడ్తల ముద్దు అని వారి ఆప్తులతో చెప్తారు. టీవీలు, సెల్ ఫోన్ల వాడకం పెరిగిన నేపథ్యంలో, మానవ సంబంధాలు తగ్గిన వేళ ఒక పలకరింపు లేదా పొగడ్త అవతల మనిషిని ఎక్కడికో తీసుకుని వెళ్తుందనే అభిప్రాయం బలంగా ఉన్నది. ఏమైనప్పటికీ విమర్శలు, పొగడ్తలు అవినాభావ సంబంధం గల రెండు విభిన్న భావ ప్రకటనలకు సూచికగా భావించాలి. పొగడ్తను సవినయముగా ఆహ్వానించగల వారిని స్థిత ప్రజ్ఞత్వము లేదా మానవ సంబంధములలో పరిణతి సాధించిన వ్యక్తిగా భావించవచ్చు.
చివరిగా విమర్శించే వారందరూ పక్షపాతం లేకుండా, స్వార్థముతోనూ, వ్యక్తిగతము కాకుండానూ చేయండి. అలాగే అవతలి వారు చేసే పనిలో మంచిని కూడా పొగిడి, వారిలో ఉత్సాహం నింపి సమాజంలో అందరికీ ఎక్కువ మంచి జరుగునట్లు చూడండి.
విజ్ఞప్తి: వాహనదారులారా! మీ
ప్రయాణంలో సాధ్యమైనంత ముందుగా బయలుదేరి, నిర్ణీత వేగంతో భద్రత నియమాలు పాటిస్తూ, సకాలంలో గమ్యస్థానం
చేరండి. రోడ్డు ప్రమాదాల నివారణకు మీవంతు సహకారం అందించండి.
No comments:
Post a Comment