Friday, December 11, 2020

జీవితములో దేవుని చూడగలమా - 3

4. దర్శనం

కొంతమంది ప్రముఖ దేవాలయాల దర్శనం ద్వారా తమ కోరికలు తీర్చుకుని, భక్తిని  పెంచుకుంటారు.

5. సాహిత్యము

జ్ఞాన సంపన్నులు తమ దైవ సాహిత్యము ద్వారా భక్తుల దైవ మార్గమునకు పునాదులు వేశారు.

6. దానములు

చాలామంది ధనవంతులు సేవా భావంతో ప్రజల మేలు కొరకు త్రవ్వించిన బావులు, కట్టించిన సత్రములు, నాటిన చెట్లు వారి కీర్తిని చిరస్థాయిలో ఉంచినవి. విద్యాదానం నిమిత్తం బడి, పేదవారికి వైద్య నిమిత్తం ఆస్పత్రి, భక్తి భావం పెంచడానికి గుడి కూడా సమాజసేవలో భాగమే. పుణ్య సంపాదన, పాప పరిహారంలో వీటి పాత్ర ఉంటుంది. పాపపుణ్యములకు సరి అయిన నిర్వచనము చెప్పలేకపోయినా, పుణ్యమనగా నలుగురికి ఉపయోగపడే పని అని, పాపము అనగా ఇతరులకు హాని చేసేది అని అర్థము చేసుకుందాం.

7. ధర్మము చేయుట

మనకు ఉన్న దానిలో కొంత పేదలకు ఇచ్చుట ఒక ఆచారముగా అన్ని మతముల వారు పాటిస్తారు. ఇది సమాజ సమతుల్యమునకు సహాయపడుతుంది.

8. భారతదేశపు ఆధ్యాత్మిక విశిష్టత

ఆధ్యాత్మిక విశిష్టత గల భారతదేశపు ఇతిహాస గ్రంథములలో ఒకటి అయిన రామాయణం చరిత్ర జరిగిన ప్రదేశములు కొన్ని దండకారణ్యంలో ఉన్నవి. రామాయణంలో గల సుందరకాండ పఠనము నవగ్రహ దోష నివారణకు, సకల కార్య సిద్ధి కొరకు జ్యోతిష్య పండితులు చెప్తారు. హిమాలయాల్లోని మంచు కొండల గుహల్లో సాధు పురుషులు, సిద్ధ పురుషులు, మహర్షులు తపస్సు చేసుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తర భారత దేశంలో గల  కురుక్షేత్రం వద్ద భారత యుద్ధం జరిగిందని, దండకారణ్య ప్రాంతం సీతారాముల వనవాసంలో తిరిగిన ప్రాంతము, నైమిశారణ్యం అనేక పురాణాలు పుట్టిన చోటుగా గుర్తించబడి ప్రముఖ యాత్రాస్థలాలు అయినవి. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయమును ప్రతిరోజు  విభీషణుడు దర్శిస్తాడని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మిక విశేషములతో సంబంధం గల అనేక దేవాలయములు తమిళనాడులో  ఉన్నవి. అందులో మానవ కన్యగా పుట్టిన ఆండాళ్ శ్రీరంగనాధుని వివాహమాడినది. ఈమె జన్మస్థలం మధురైకి 80 కిలోమీటర్ల దూరంలో గల శ్రీవిల్లిపుత్తూరు. ఆమె స్వామి వారి మీద పాడిన పాశురములు తమిళ సాహిత్యంలో మరియు వైష్ణవ సాంప్రదాయంలో విశేష  ప్రాచుర్యము పొందినవి. దానిని ధనుర్మాసంలో విష్ణు భగవానుని ప్రీత్యర్ధం భక్తులు చదువుతారు.

9. మంత్రము, జపము

ప్రస్తుతము అందుబాటులో ఉన్నది భావవ్యక్తీకరణ విధానము. తన మాటల ద్వారా అవతలి వారితో భావ వ్యక్తీకరణ జరుగుతుంది. భగవంతునితో మాటలను అనుసంధానము చేయుటకు బీజాక్షరాలతో కూడిన మంత్రం లేదా దైవనామస్మరణ విశేషముగా ఏకాగ్రతతో కూడిన మనసుతో  స్మరించి భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి కొందరు ప్రయత్నం చేసి, ఫలితం పొందుతారు. మంత్ర ధ్యానము లేదా జపం ద్వారా శక్తి వచ్చిన తర్వాత, దానిని మంత్రసిద్ధిగా వ్యవహరిస్తారు.

10. ఆహారం

దైవానుగ్రహానికి ఆహారం తోడ్పడుతుందని కొందరి అభిప్రాయం. దైవానుగ్రహం పొందిన వారిలో అన్ని రకముల ఆహారం తీసుకునే వారు ఉన్నారని నేను తెలుసుకున్నాను. దైవానుగ్రహం తర్వాత వారి ఆహారపు అలవాట్లు మారినాయేమో నాకు తెలీదు.

                                                                                                                        (సశేషం)

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.