Tuesday, November 24, 2020

పరోపకారం

మనుషులకు వచ్చే ఆలోచనల వేగమునకు తగినట్లుగా కొందరి పనులు ఉంటాయి. కొందరు వారి ఆలోచనలు వేగంగా అమలు చేస్తే, కొందరు నిదానంగా చేస్తారు. 

ఇందుకు ఉదాహరణగా చిన్నప్పుడు బడిలో చెప్పిన కథను జ్ఞాపకం చేసుకుందాం. ఈ కథా వస్తువు పేరు రావణా అడ్వైస్ టు రామా.  రామాయణంలో రామ రావణ యుద్ధంలో రామునికి ఒక ఆలోచన వచ్చింది. పరిపాలనాదక్షుడు అయిన రావణుడి నుండి రాముడు పరిపాలన విషయములో సలహాలు తీసుకోదలచి ఆయన వద్దకు వెళ్ళాడు.

రావణుడి మాటల సారాంశం:

మంచి పని చేయదలుచుకుంటే వాయిదా వేయరాదు. చెడ్డ పని చేయాలంటే ఆలోచించి, నిదానంగా చేయాలి. ఇందుకు ఉదాహరణగా రెండు విషయాలు చెప్పాడు. స్వర్గమునకు నిచ్చెన కడదామని వాయిదా వేశాను, సీతని ఎత్తుకుని వద్దాం అనుకుని వాయిదా వేయకుండా వెంటనే అమలు చేశాను. దాని ఫలితమే నేటి పరిస్థితి అని చెప్పాడు.
ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే చెడు ఆలోచనలు మనిషిని త్వరగా ప్రభావితము చేసి, అమలు పరిచేలా చేస్తాయి. వాటి  తీవ్రత, ఆకర్షణ చాలా గొప్పది. మంచి పనులు చేయాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఉదాహరణకు డబ్బు అవసరం చాలా గొప్పది. ఎదురుగా డబ్బు కనబడి పక్కనే ఎవరు లేకపోతే దానిని సొంతము చేసుకోవాలి అని చాలామంది ఆలోచించి, అమలు చేయడానికి ప్రయత్నిస్తారు.

ఈ పరోపకారములో మానవత్వపు గోడ అను ప్రక్రియ ద్వారా కొందరికి మేలు జరుగుతుంది. ఈ క్రమములో పరోపకారంలో భాగంగా బయటకు వచ్చి అమలు అవుతున్న ఆలోచనే మానవత్వపు గోడ. ఈ విధానంలో మనకు ఇంటిలో అవసరము లేని,  పెద్దగా ఉపయోగపడని వస్తువులు, గృహోపకరణాలు, ఇతర సామాన్లు, వస్త్రాలు అందరూ ఒకచోట పెడతారు. అవసరమున్నవారు వాటిని తీసుకుని వెళ్లి వాడుకుంటారు. దీనివలన దాత, గ్రహీత ఎవరో తెలియకుండా పనులు జరిగిపోతాయి. ఏ ఒక్క కృతజ్ఞత ఆశించకుండా, వస్తువుని గ్రహించినందుకు చిన్నతనము పడకుండా ఒక విధమైన రహస్య దానము జరిగిపోతుంది.

ఉపకారములో మనము చేసిన పని వల్ల ఇతరులకు మేలు జరుగుతుందని నమ్మకం బాగా బలంగా ఉంటే, ఉపకారము లభించిన వ్యక్తి పొందే సంతోష తరంగం ద్వారా ప్రకృతి ధర్మము అనుసరించి తప్పక మనకు మేలు జరుగుతుంది. ఇందుకు మన ద్వారా  మేలు పొందిన వ్యక్తి మనకు ప్రత్యక్షంగా తెలియనవసరం లేదు.

పరోపకారంలో భాగంగా మానవ ధర్మమైన పొగడ్తలు, పరామర్శ కలిసి ఉన్నవి. జీవన విధానంలో మనకు తెలిసిన వారి జీవితంలో మంచి లేక చెడు పరిస్థితులు లేదా సంఘటనలు జరుగుతాయి. మనకు తెలిసిన వారి జీవితంలో వారు సాధించిన విజయములకు జరిగే కార్యక్రమాలకు వెళ్లి వారిని మనస్ఫూర్తిగా అభినందించడం మరియు వారి సంతోషంలో పాలుపంచుకోవడం కూడా ముఖ్యమైందిగా భావించాలి. అలానే కొన్ని చెడు సంఘటనలు జరిగినప్పుడు వారి కష్టములో పాలుపంచుకుని పరామర్శ చేయుట, అవసరమైన మాట సహాయం చేయుట చాలా అవసరమైన విషయంగా భావించాలి. దీనివలన అంతిమంగా మానవత్వం విజయం సాధిస్తుందని  తెలుసుకోవచ్చు.

రక్తదానం చేయండి. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడండి.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.