Saturday, November 28, 2020

కోరికలు - భవిష్యత్తుపై ఆశలు

కోరికలు లేని జీవితం లేదు. బుద్ధుడు చెప్పిన ప్రకారం దుఃఖమునకు మూలకారణం కోరిక. మనసు కోరికల పుట్ట. 

ఒక కోరిక తీరిన తర్వాత, ఇంకొక కోరిక తయారుగా ఉంటుంది. ప్రతి కోరిక తీరిన తర్వాత సంతోషంగా ఉంటుంది అనుకుంటారు. అది పూర్తిగా నిజం కాదు. ప్రతి కోరికలో సంతోషం మరియు దుఃఖం కలిగించే భాగం కలిసి ఉంటాయి.

ప్రతి మనిషి మంచి కోరికలు మాత్రమే కోరుకుంటాడని అనుకోలేము. మనసు చంచలము. మెలకువగా ఉన్నప్పుడు కోరికలు మరియు దానికి సంబంధించిన ఆలోచనలతో జీవితంలో చాలా భాగం గడిచిపోతుంది. కోరికలు తీర్చుకోలేనప్పుడు లేదా తీరనప్పుడు మొక్కులుగా దేవుని ప్రార్థిస్తూ, ఆ దేవుని ద్వారా తీరనప్పుడు ఇంకొక దేవుని ప్రార్థిస్తాము. ఈ క్రమములో  తీర్థయాత్రలు, దైవ దర్శనం చేస్తారు. దర్శనంతో పాటు శక్తికి తగిన పూజలు, మొక్కులు, ప్రార్థనలు, స్తోత్రములు చేసి తీరిక లేకుండా దేవుని విసిగిస్తారు. మొక్కులు లేక కోరికలు తీరినప్పుడు ఏ దైవ దర్శనం ద్వారా అయిందో తెలీక కంగారుపడిన సందర్భాలు ఉంటాయి. నిజానికి రూపాలు వేరైనా దైవం ఒక్కడే. ఆ తీరని కోరికలో లాభనష్టాలు లెక్కలు వేసుకుని వ్యతిరేక విషయములు కొంతమంది ఆలోచిస్తారు. అప్పుడు అసంతృప్తికి లోనవుతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగం దొరికిన వారికి ఉద్యోగం తర్వాత వివాహము, సంతానము కలిగి ఆ పిల్లలు రంగు ఆలోచింపజేస్తుంది. మేం మంచి రంగులో ఉన్నాము, మా పిల్లలకు మా రంగు రాలేదు అని అసంతృప్తి పడతారు. ఈ క్రమములో జాతకం చెప్పేవారు లేక దైవానుగ్రహం ద్వారా ప్రశ్నలు చెప్పేవారి కోసం వెతుకుతారు. 

భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. భవిష్యత్తు తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఎంతో రోగగ్రస్తులు అయితే తప్ప ఆయుర్ధాయ విషయం తెలుసుకోవద్దు అని నా మనవి. కొందరు భవిష్య దర్శకులు తమ మాటల చాకచక్యంతో సరి అయిన ఫలితము చూపించి అధికారంలో ఉన్న నాయకుల మెప్పు సంపాదిస్తారు. అధికారంలో ఉన్న నాయకుల ప్రాపకం కత్తి మీద సాము లాంటిది. 

భవిష్యత్తు తెలుసుకునే క్రమంలో అలాంటివారి వివరములు సేకరించిన తర్వాత మన కోరికల చిట్టాతో వారిని కలుస్తాం. చాలా వరకు ఉచిత సేవలు ఉండవు. కొందరు ఏ విధమైన డబ్బు ఆశించక పోయినా వారి ద్వారా నిర్వహింపబడే సేవా కార్యక్రమములో పాల్గొనడానికి సిద్ధముగా ఉండాల్సిన పరిస్థితి.

మరికొందరు వారి భవిష్య సూచికలో తప్పు ఫలితము వచ్చినా కూడా అడగలేని పరిస్థితి. ఇంకొందరు కోరికలు తీరటానికి ఖరీదు అయిన కార్యక్రమములు, హోమాలు, మరియు ఇతర తంత్ర పూజా విధానములు చేయిస్తారు. అప్పు చేసి కార్యక్రమంలో పాల్గొంటే, ఆశించిన ఫలితం లేదా లాభము రాకపోతే మనశ్శాంతి ఉండదు. అప్పులు తీర్చలేని ఒత్తిడి మన ఎదురుగా ఉంటుంది.

ఈ విషయం వివరంగా వ్రాయుటలోని జాగ్రత్త ఏమిటంటే మనకు దొరికే భవిష్య సలహాదారుడు సరైన వ్యక్తి అయినా మనను సక్రమంగా నడిపించకపోతే మనము మోసపోయి ఆర్థిక ఇబ్బందులు పాలు కాకూడదనే. మంచి ఆధ్యాత్మిక గురువులతో పాటు చెడు గురువులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు.  వారితో తస్మాత్ జాగ్రత్త.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.