Wednesday, November 18, 2020

వైరాగ్యం

వైరాగ్యం అనగా ఒక విషయంపై ఇష్టం పోవుట లేక అసహ్యం పుట్టుట. ఈ ప్రపంచంలో చాలా రకాల వైరాగ్యములు ఉన్నాయి.

మచ్చుకు కొన్ని: వ్యసన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, గృహ వైరాగ్యం (ప్రపంచ వైరాగ్యం).

వ్యసన వైరాగ్యం: ఈ భూమి మీద వ్యసనాలకు అలవాటు పడినవారు చాలామంది ఉంటారు. దాని వలన వారిపై, వారి కుటుంబ సభ్యులందరిపై దుష్ప్రభావం పడటమే కాక, వారి కుటుంబ సభ్యులు చాలా మనస్తాపం చెందుతారు. చాలా కష్టములు ఎదుర్కొంటారు. కనుక ఎప్పుడైనా వాటివలన వైరాగ్యం కలిగితే ఆ వైరాగ్యం చాలా మంచిది. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు చాలా సంతోషిస్తారు.

ప్రసూతి వైరాగ్యం: భార్య యొక్క ప్రసవ వేదనను గమనించిన భర్త ఆవిడ కష్టపడుతుంటే చూడలేని సందర్భ వైరాగ్యమే ప్రసూతి వైరాగ్యం. ఇది పూర్తిగా తాత్కాలికమే.

గృహ వైరాగ్యం లేక ప్రపంచ వైరాగ్యం: భార్య, ఇతర కుటుంబ సభ్యుల వల్ల బాధపడే గృహ యజమాని తన అసమర్థతను కప్పిపుచ్చుకునే సందర్భంలో వచ్చేది గృహ వైరాగ్యం. దీనికి పరిష్కారంగా సన్యాసం తీసుకొనుటే మార్గం అని అనుకుంటారు. ప్రపంచ వ్యామోహం వదలకుండా సన్యాసం తీసుకుంటే మనసు మాట వినదు. పాత అలవాట్లతో తన అవసరాల నిమిత్తం ఇతరుల మీద ఆధారపడటం జరుగుతుంది. ఇది అసంపూర్తి జీవన విధానమునకు మార్గం.

శ్మశాన వైరాగ్యం: దగ్గర బంధువుల మరణంతో ఏర్పడే తాత్కాలిక ఆలోచన  శ్మశాన వైరాగ్యంగా భావిస్తారు.

మనిషి జీవించి ఉన్నంతకాలం ప్రపంచంలోని వివిధ రకముల వ్యామోహముల పట్ల ఆకర్షింపబడతాడు. ఆకర్షింపబడడం జీవితంలో ఒక భాగం అనక తప్పదు.

ఏ ఆకర్షణా మన మీద ప్రభావం చూపనప్పుడు, మనిషి నిజమైన వేదాంత భావం కలిగి సంపూర్ణ మానవుడిగా మారతాడు. దానివలన సమాజమునకు మేలు కలుగుతుందో, లేక చెడు జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

దైవత్వమునకు దగ్గర కావడానికి, నిజమైన మార్గమునకు ఎంతవరకు సహాయపడుతుందో మేధావులు నిర్ణయించాలి. జీవితంలో అనేక సందర్భాలలో వైరాగ్యం వస్తుంది. అవి తాత్కాలికమే. వాటిని అధిగమించడానికి మనసుని అదుపు చేసుకుని ఆలోచనలను మరల్చాలి. అప్పుడే విజయం లభిస్తుంది.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.