Tuesday, October 6, 2020

కరోనా నేర్పిన పాఠాలు

చైనాలో పుట్టి, ప్రపంచమంతా వ్యాపించి అన్ని దేశాలను గడగడలాడిస్తున్న కరోనా గురించి వార్తాపత్రికలలో చదివిన తర్వాత అమ్మో ఇండియా లాంటి దేశంలో వస్తే మన పరిస్థితి ఏమిటి అని భయపడ్డాను.

Corona virus
కరోనా నేర్పిన పాఠాలు
 Image Reference: Pixabay 

భయంకర రోగం వస్తే ఎక్కువమంది నిరక్షరాస్యులు, ఆర్ధిక స్తోమత ఎక్కువ లేనివారు, ఇంకా అవగాహన రాహిత్యంతో ఉన్నవారు శుభ్రత పాటించగలరో, లేదో అని ఆలోచించాను. భయపడ్డా, పడకపోయినా రోగం రావడం ఆగదు. పరిశుభ్రతకు కావలసిన సరుకులు, శానిటైజర్లు వంటివి కొనటం వలన ఖర్చులు పెరిగినాయి. ప్రతి వారు శానిటైజర్లు, డిస్ ఇన్ఫెక్టంట్లు వాడటం అనేది అవసరమైంది.

ప్రాచీన ఆచారాలైన కాళ్లు కడుగుకొనుట, ప్రతివారిని నమస్కారంతో పలకరించుట అనేవి అలవాటు చేసుకోవటం జరిగింది. ప్రతి కొద్ది నిమిషాలకు ఒకసారి శుభ్రత అలవాటుగా మారింది. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించడం ప్రతివారు అలవాటు చేసుకున్నారు. ప్రాణభయంతో ప్రతివారి ఆలోచనలలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.

ఎవరినీ లెక్క చేయని, అలవాట్లను మార్చుకోలేని, రాజీపడని ఈనాటి యువతకు ఒక ప్రాణభయం కలిగించిన ఆలోచన అనేక అలవాట్ల మార్పుకు దోహదం చేసింది.

షేక్ హ్యాండ్ లేదా కరచాలనంతో మురిసిపోయే ఈ తరం మనుషులు నమస్కారం అనే ఆరోగ్యకరమైన అలవాటుకు ఏ విధమైన అభ్యంతరం చెప్పలేకపోయారు. దానితోపాటు కరచాలనం వద్దు, నమస్కారమే ఆరోగ్యానికి హద్దు అనే సామాజిక అలవాటు వారి జీవితంలో భాగంగా నాటుకుపోయింది. అంతే కాక ఎన్నో అలవాట్లు పరిశుభ్రత పేరుతో కొత్తగా చేసుకున్నారు.

ఇక కరోనాతో ఎవరికి వారు ప్రాణభయం మనసులో ఏర్పడి, అవతలివారితో ఎంత సన్నిహితం, బంధుత్వం ఉన్నా వారికి సహాయపడకపోగా, ఇబ్బంది కలిగించిన సంఘటనలు, మానవత్వమునకు మచ్చ కలిగించే విధంగా ప్రవర్తించిన సందర్భములు లెక్కకు మించి జరిగినాయి. ఇలాంటి సందర్భాలు మానవ సంఘ జీవితంలో అపశృతులుగా మిగిలిపోతాయి.

అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఈ ఆపద సమయంలో కరోనా రోగులకు వారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా చేసిన సేవ ఎన్నో రకాలుగా అభినందించదగినది. అలాగే భోజనశాలలు మూసివేయబడినందున, చాలామంది మానవత్వంతో ఆదాయం కోల్పోయిన బాధితులకు చేసిన అన్నదానం చెప్పుకోదగినది. సరైన రవాణా వసతి లేక సొంత ఊళ్లకు ప్రయాణాలు చేసే వలస కూలీలకు, ప్రయాణ సమయంలో ఇబ్బంది పడేవారికి మార్గమధ్యంలో వాహన సౌకర్యం ఏర్పాటు చేసి, అనేకమంది వారి మానవత్వమును చాటుకున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు చెప్పటం సగటు మనిషి యొక్క కనీస కర్తవ్యం. 

ప్రాణభయంతో ఎవరికి వారు గిరి గీసుకొని ఉన్నప్పటికీ, చివరిగా మానవత్వం మేల్కొని సహాయ సహకారాలు అందించిన అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాత్ర చక్కగా పోషించాయని, బాధ్యతలు నెరవేర్చాయనీ చెప్పుకోవచ్చు. 

చివరిగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆర్ధిక వ్యవస్థ తొందరగా యథాస్థితికి రావాలని కోరుకుంటూ, కరోనా పరిస్థితుల్లో బాధ పడిన అందరూ మామూలు స్థితికి రావాలని భగవంతుని ప్రార్ధిస్తూ, సర్వేజనా సుఖినోభవంతు అని ముగిస్తున్నాను.

No comments:

Post a Comment

జీవితములో జాగ్రత్తలు

జీవితం చాలా విలువైనది. అడుగడుగునా తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎక్స్పైరీ డేట్ తెలియని జీవితం మనది. అయినా సమయస్ఫూర్తి, వ...