Wednesday, October 14, 2020

జ్యోతిర్లింగ దర్శనం - ఫలితాలు

 

64 జ్యోతిర్లింగాలు ఉన్నప్పటికీ, వాటిలో 12 అతి ముఖ్యమైనవిగా, పవిత్రమైనవిగా భావించబడుతున్నాయి. వీటిలో 5 మహారాష్ట్రలోనే ఉన్నాయి. 

కాశీ విశ్వేశ్వరాలయం, కేదారేశ్వరాలయం ఉత్తర భారతంలో ఉన్నాయి. రామేశ్వరం, శ్రీశైలం దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. నాగేశ్వరం, త్రయంబకేశ్వరం, భీమశంకరం, ఘృష్ణేశ్వరం, సోమనాథ్ ఆలయాలు పశ్చిమ భారతంలో ఉన్నాయి. మిగిలిన ఓంకారేశ్వరం, మహాకాళేశ్వరం, వైద్యనాథ్ ఆలయం తూర్పున ఉన్నాయి.

  జ్యోతిర్లింగాలను దర్శించడం వలన అనేక ఫలితాలున్నాయి.

సౌరాష్ట్ర సోమనాథ్ ఆలయానికి వెళ్ళాలంటే బస్సులో వడోదర లేదా అహ్మదాబాద్ వరకు వెళ్ళి, అక్కడనుండి సోమనాథ్ వెళ్ళాలి. ఈ ఆలయాన్ని దర్శిస్తే సంపదలతో ఆశీర్వదింపబడతారని భక్తులు నమ్ముతారు.

శ్రీశైలం వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి నేరుగా బస్సు దొరుకుతుంది. తక్కువ ఖర్చులో వెళ్లి రావాలంటే రైల్లో నల్గొండకి వెళ్లి, అక్కడి నుండి శ్రీశైలంకి వెళ్ళవచ్చు. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిని ఆరాధిస్తే పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. శ్రీశైల శిఖర దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదని భక్తుల భావన.

ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరుడిని ప్రార్థిస్తే అన్ని భయాలు మరియు పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఉజ్జయినికి వెళ్లాలంటే సికింద్రాబాద్ నుండి భోపాల్ కి వెళ్లి, అక్కడి నుండి ఉజ్జయినికి వెళ్ళాలి.

వైద్యనాథ్  దేవాలయం అంటే కొంతమంది పర్లీలో ఉన్న వైద్యనాథుడని, ఇంకొంతమంది ఝార్ఖండ్ లోని దేవగర్లో ఉన్న వైద్యనాథ్ దేవాలయం అని అంటారు. ఏది ఏమైనప్పటికీ, రెండూ విశిష్టమైనవే. వైద్యనాథుని దర్శనం అనేక రకాల వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది. పర్లీకి హైదరాబాద్ నుండి రైల్లో వెళ్తే తక్కువ ఖర్చులో ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఝార్ఖండ్ లోని దేవగర్లో ఉన్న వైద్యనాథ్ దేవాలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అని అనేకమంది భక్తులు భావిస్తారు. దేవగర్ అంటే దేవతలు నివసించే ప్రదేశం అని అర్థం. ఇక్కడకు రైలు మార్గం ఉంది.

భీమశంకరుని దర్శిస్తే, శిక్షా సంబంధిత ఉపద్రవములు నశించటమే కాక, శత్రువులపై విజయం మరియు ఆకస్మిక మరణం నుండి విముక్తి  లభిస్తుంది. పూనా వెళ్ళి, అక్కడి నుండి ఆర్టీసి బస్సు  ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

రామేశ్వరానికి వెళ్లాలంటే హైదరాబాద్ నుండి నేరుగా ట్రైన్లో వెళ్ళవచ్చు. విజయవాడ నుండి కూడా రైల్లో లేదా బస్సులో వెళ్ళవచ్చు. రామేశ్వరుడిని సందర్శించడం మరియు లింగాన్ని ప్రార్థించి, అభిషేకం చేయడం మహా పుణ్యాన్ని, కైవల్యాన్ని కలిగిస్తుంది.

మహారాష్ట్రలో ఉన్న ఘృష్ణేశ్వరాలయం దర్శించాలంటే ఔరంగాబాద్ వరకు రైల్లో వెళ్ళి, అక్కడి నుండి ఎల్లోరా గుహలకి వెళ్ళాలి. అక్కడినుండి ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఆలయ సందర్శన ఫలితం ఊహకందనిది. ఇది అంతులేని సంపదలను మరియు ఆనందాన్ని ఇస్తుంది.

కాశీ విశ్వేశ్వరుడిని దర్శిస్తే అన్ని రకాల కర్మల నుండి విముక్తి పొందుతారు. వారణాసికి రైల్లో వెళ్తే తక్కువ ఖర్చులో వెళ్లవచ్చు. బస్సులు కూడా ఉన్నాయి.

కేదారనాథ్ లో ఉన్న కేదారేశ్వరుని దర్శించాలంటే, హృషికేశ్ వరకు రైలులో, గౌరీకుండ్ వరకు బస్సులో వెళ్ళి, అక్కడి నుండి 14 కిలోమీటర్లు గుర్రం లేదా డోలీలో వెళ్ళాలి. కేదారేశ్వర లింగాన్ని సందర్శించేవారు ముక్తిని పొందుతారు. వారి జీవితంలో దుఃఖం, చీకటి రోజులు నశిస్తాయి.

నాగేశ్వరం వెళ్లాలంటే ద్వారక వరకు రైల్లో వెళ్లి అక్కడి నుండి టాక్సీలో గానీ, ఆటోలో కానీ వెళ్ళొచ్చు. నాగేశ్వరుడిని దర్శిస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి.

ఓంకారేశ్వరం వెళ్లాలంటే బస్సులో వెళ్ళాలి. లేదంటే ఖాండ్వా వరకు రైల్లో వెళ్ళి, అక్కడి నుండి టాక్సీలో వెళ్లవచ్చు. ఈ ఆలయాన్ని దర్శిస్తే ఓదార్పు, సంపదలు మరియు  శత్రువుల మీద విజయం లభిస్తాయి.

త్రయంబకేశ్వరాలయం దర్శించాలంటే, నాసిక్ వెళ్ళి, అక్కడినుండి వెళ్లవచ్చు. ఈ ఆలయ సందర్శన వలన నిందలు పోయి, భార్యాభర్తల మధ్య ఎడబాటు నశిస్తుంది. కోరుకున్నవి నెరవేరతాయి.

No comments:

Post a Comment

జీవితములో జాగ్రత్తలు

జీవితం చాలా విలువైనది. అడుగడుగునా తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎక్స్పైరీ డేట్ తెలియని జీవితం మనది. అయినా సమయస్ఫూర్తి, వ...