Wednesday, September 23, 2020

చదువు (విద్య)

బాల్యం నుండి యుక్త వయస్సు వరకు మానసిక అభివృద్ధి నిమిత్తం, జీవనోపాధికి విద్య చాలా అవసరం. దానికోసం చదువులకు అధిపతి అయిన సరస్వతీ దేవిని కొలుస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో కొలను భారతి, బాసర, వర్గల్ లలో  సరస్వతి ఆలయములు కలవు.

బాసర హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది. నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో ఉంది. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడకి వెళ్ళటానికి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. రైల్వే కూడా అనేక రైళ్లు నడుపుతోంది. దాంట్లో నాగవల్లి ఎక్స్ప్రెస్, దేవగిరి ఎక్స్ప్రెస్ వంటివి కొన్ని. 

 Image Reference: Wikimedia

వర్గల్ హైదరాబాద్ నుండి సుమారు 45 కి.మీ.  దూరంలో, సిద్దిపేట వెళ్ళే మార్గంలో ఉంది. బస్సులో కానీ, కారులో కానీ వెళ్లవచ్చు. లేదా టాక్సీలో వెళ్లవచ్చు. రూ. 1,000 నుండి రూ 1,500 వరకు ఖర్చు అవుతుంది. నేరుగా రైళ్లు లేవు కానీ, మనోహరాబాదుకు వెళ్ళి, అక్కడ నుండి రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు.

కొలను భారతి కర్నూల్ జిల్లాలో ఆత్మకూరు నుండి 20  కి.మీ.  దూరంలో ఉంది. శ్రీశైలం నుండి 130 కి.మీ., కర్నూలు నుండి 88 కి.మీ., విజయవాడ నుండి 293 కి.మీ.,  హైదరాబాద్ నుండి 300 కి.మీ. దూరంలో ఉంది.

ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చును. కొత్తపల్లె మండల కేంద్రం నుండి శివపురానికి  చేరుకొని, అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరం మెటల్ రోడ్డులో ప్రయాణించి కొలనుభారతి దేవాలయం చేరుకోవచ్చు.

ఆంధ్రా బాసరగా వెలుగొందుతున్న ఈ క్షేత్రం సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామమైన శ్రీ భారతి పేరుతో వెలసింది.   కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయటానికి వచ్చినప్పుడు వారి సంరక్షణ కోసం అమ్మవారు ఇక్కడకు వచ్చి స్వయంభువుగా నెలవైందని చెప్పబడుతోంది.

కొందరు చదువులో  అభివృద్ధికి, ఆటంకం తొలగుటకు శివుని అవతారమైన మేధో దక్షిణామూర్తిని ఆరాధిస్తారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కోటప్పకొండ క్షేత్రంలోని శివాలయంలో జరుగు మేధో దక్షిణామూర్తి హోమంలో విద్యా సంబంధమైన కోర్కెలతో పాల్గొంటారు. కోటప్పకొండ చిలకలూరిపేట నుండి పదిహేను కిలోమీటర్లు, నరసరావుపేట నుండి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది.

అలాగే విజయవాడ వన్ టౌన్లో గల శ్రీవిజయేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి గురువారం నాడు మేధా దక్షిణామూర్తికి జరిగే అభిషేకంలో పాల్గొంటారు. ఫీజు 90 రూపాయలు మాత్రమే.

విద్యాభివృద్ధికి సరస్వతీ సూక్తం, మేధో దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి.

హైదరాబాద్ కు దగ్గరలో, మొయినాబాద్ మండలంలో గల చిలుకూరు బాలాజీ దేవాలయం వీసాల బాలాజీ గా ప్రసిద్ధి చెందింది.  హైదరాబాద్ నుండి చిలుకూరు 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. విద్య, ఉద్యోగం నిమిత్తం విదేశీయానం కావలసినవారు ఇక్కడ బాలాజీని దర్శించుకుంటారు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.