Thursday, October 17, 2024

జీవితంలో పొదుపు అవసరం

జీవితంలో పొదుపుకుచాలా ముఖ్యమైన స్థానం ఉంది. దానిలో ఆర్థిక పొదుపు ముందు స్థానంలో ఉంటుంది. పొదుపు అనగా ఆర్థికమే కాక అనేక ఇతర విషయములు ఉంటాయి. 

ఆదాయమునకు మించి ఖర్చులు ఉంటే అది పొదుపు సూత్రానికి విరుద్ధం. ఆదాయం లోపే ఖర్చు ఉంటే పొదుపు సాధ్యం. వృధా ఖర్చులు, దుబారా తగ్గించడం కూడా పొదుపులో భాగమే. సూపర్ మార్కెటుకు పోయి అవసరమున్నా, లేకపోయినా ఆకర్షణీయంగా అమర్చిన వస్తువులను కొనడం, తర్వాత దానిని పెద్దగా వాడకపోవటం చాలా ఇళ్లల్లో జరుగుతుంది.

ఒక వస్తువును  కొనబోయే ముందు దానిని మనం ఏడాదిలో ఎన్ని సార్లు వాడతాము అని ఆలోచించుకుంటే కొన్ని వస్తువులను కొనడం వాయిదా వేసుకోవచ్చు. వేలు పెట్టి కొన్ని వస్తువులు కొనటం కంటే అవి మార్కెట్లో అద్దెకు దొరుకుతున్నప్పుడు వాటిని కొనటం వాయిదా వేసుకోవచ్చు.

ఇంటిపట్టునే ఉండి మానసిక విశ్రాంతి దొరకదని భావించేవారు, అనారోగ్యంతో బాధ పడుతూ వైద్య ఖర్చులు చెల్లించటం కంటే యాత్రలు చేయడం కూడా కొంత పొదుపుగా భావించాలి. యాత్రలో ఇంటి దగ్గర కంటే కొద్దిగా ఖర్చులు పెరిగినప్పటికీ, అవి మనసుకు ప్రశాంతతనిచ్చి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

కోరికలు పరిమితంగా ఉంటేనే పొదుపు సాధ్యం. ఉద్యోగము లేక వృత్తి వ్యాపారములు చేసేవారు కొత్తలో ఒక మారు ఆదాయం చేతికి రాగానే మనసులోని అనేక కోరికలు బయటపడి లేదా బయట ఆకర్షణకు లొంగితే పొదుపు సాధ్యం కాదు. బ్రహ్మచారి జీవితంలో పొదుపు ఎక్కువ శాతం చేయగలిగిన వారు తర్వాత జీవితంలో తక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వివాహ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఖర్చులు, అవసరములు పెరిగి పొదుపు ఎక్కువగా చేయలేకపోవచ్చు. 

పొదుపులో భాగంగా ఆరోగ్య బీమా ఒకటి అని గుర్తుంచుకోవాలి. పెరిగిన బంగారం ధరల దృష్ట్యా దాని వైపు సామాన్యుల ఆలోచన లేదు. ఆచార వ్యవహారములు పాటించుటలో శక్తికి మించి ఖర్చులు చేయకుండా ఉండటం, అనేక కార్యక్రమములలో ఆడంబరములకు పోకుండా, ఆహార పదార్ధములు వృధా చేయకుండా ఉండటం కూడా పొదుపులో భాగంగా అనుకోవాలి. ఏ పొదుపుకైనా కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్తగా పెళ్లయిన జంటలు వంట చేసుకోవటం ఇష్టం లేక బయట ఆహార పదార్ధములకు ఆశపడి, ఆరోగ్యం చెడగొట్టుకొని అప్పుల పాలవుతున్నారు. 

పొదుపుకి ద్రవ్యోల్బణంతో సంబంధం ఉంది. అనగా ఆ డబ్బుకి తగిన కొనుగోలు శక్తి ఉండాలి. కొన్ని ఏళ్ల క్రితం ఒక దేశంలో కరువు వచ్చినప్పుడు బ్రెడ్‌ను లక్షన్నర రూపాయలకు కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ దుస్థితిని ఊహించలేము. దాని ప్రభావం పొరుగు దేశాల మీద కూడా ఉంటుంది. 

పొదుపు చేసిన తర్వాత దాని మదుపు కూడా ముఖ్యమే. అధిక వడ్డీలకు ఆశపడి అసలుకు ఎసరు తెచ్చుకోకుండా ప్రభుత్వ పథకాలలో లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో మాత్రమే దాచుకున్న వారు నిర్భయంగా ఉంటారు. ప్రభుత్వ పొదుపు పథకాలలో ఎక్కువ భాగం  నాగపూర్లో ఉన్న నేషనల్ సేవింగ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగా ఉన్న రోజుల్లో కొన్ని కుటుంబములు క్రమశిక్షణ ద్వారా పొదుపు చేయగలిగేవిగా ఉండగా, మరికొన్ని కుటుంబములు శుభ, అశుభ కార్యములకు అవసరానికి మించిన ఖర్చులు చేసి పొదుపుకు దూరంగా ఉన్నాయి. ఆప్యాయత, ఆదరణ, బంధు ప్రేమల వలన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు బలంగా ఉన్నప్పటికీ, కాలక్రమేణా అనేక కారణముల చేత అది కనుమరుగయ్యింది. దానికి కారణములుగా వలస జీవన విధానం, పెద్దల అనాలోచిత నిర్ణయములు, వాటిని తప్పుబట్టే ఇతర సభ్యుల అభిప్రాయాలను చెప్పుకోవచ్చు. వాటికి కాలమాన పరిస్థితులు దోహదం చేశాయి.

ఉమ్మడి కుటుంబాలలోని కొన్ని విషయాలు తెలుసుకుందాం:

  • ఉమ్మడి కుటుంబంలో ఖర్చులను సమానంగా భరించటం కొన్నిచోట్ల ఉంది. ఆదాయం ఉన్నవారు కూడా తక్కువ ఖర్చును భరించి, ఆ ఖర్చు మిగిలిన వారిపై వేసి, కొంత మిగుల్చుకున్న తెలివైనవారికి అది కూడా పొదుపే.
  • కొందరు కుటుంబ సభ్యులు ఇంటి పనులు చేయకుండా, కర్ర పెత్తనం చేస్తూ ఇతరులతో పనులన్నీ చేయిస్తే అది శ్రమశక్తిని పొదుపు చేసినట్లే.
  • ఒకరి కంటే ఎక్కువ సంతానం కలిగిన పెద్దలు తమ ముసలితనంలో ఉన్న ఆస్తులను పిల్లలందరికీ సమంగా పంచి,  ఒకరి దగ్గరే  ఉండాలనుకున్నప్పుడు,  ఎవరి వద్ద ఉండాలనుకుంటున్నారో వారు చాకిరీ మొత్తం తమ మీదే పడిందని అనుకుంటారు. మిగిలినవారంతా సంతోషిస్తారు. ఇలాంటి సందర్భాలలో అభిప్రాయ బేధాలు వస్తాయి.
  • పెద్దవారితో కలిసి ఉన్నప్పుడు ఆస్తి పంపకం అయినప్పటికీ, దాని తర్వాత పిల్లలకు అవసరం వచ్చినప్పుడు, వారి పెన్షన్ తదితర ఇతర  మార్గముల ద్వారా వచ్చిన ఆదాయమును పిల్లలకు, వారి అవసరాలకు అనగా విదేశీ విద్య, స్థిరాస్తి కొనుగోలు, బంధువులు వచ్చినప్పుడు బట్టల ఖర్చుల నిమిత్తం సహాయం చేస్తే అంత మొత్తం ఖర్చు లేదా అప్పు తగ్గించడం కూడా పొదుపే. 

కాలం మారింది, ఆలోచనలు మారిపోతున్నాయి. అలాగే పొదుపుకు అర్థం కూడా మారిపోతోంది.

No comments:

Post a Comment

జీవితంలో పొదుపు అవసరం

జీవితంలో పొదుపుకుచాలా ముఖ్యమైన స్థానం ఉంది. దానిలో ఆర్థిక పొదుపు ముందు స్థానంలో ఉంటుంది. పొదుపు అనగా ఆర్థికమే కాక అనేక ఇతర విషయములు ఉంటాయి.