Tuesday, April 16, 2024

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు. 

పెట్టుబడికి రాబడి వచ్చి అభివృద్ధి చెందితే అది తమ విజయం అని కొందరు మురిసిపోతారు. బ్యాంకు ఉద్యోగంలో విధి నిర్వహణలో భాగముగా కరెన్సీ నోట్లు లెక్కించి, కొన్ని ఏళ్ల తర్వాత కోటి నోట్ల లెక్క పూర్తయిందని సంతోషపడతారు. ఇప్పుడు నోట్లు లెక్కించటానికి యంత్రములు వచ్చినవి కనక ఆ సమస్య లేదు. 

ఇలా ఆలోచిస్తూనే ఉద్యోగ కాలం పూర్తయిపోయింది. విశ్రాంత ఉద్యోగినయ్యాను. విశ్రాంత ఉద్యోగ కాలంలో కూడా కొన్ని ఏళ్లు గడిచాయి. భగవంతుని నామ కోటి పుస్తకములు వ్రాసి కోటీశ్వరులు అయిన వారు కొందరు.

ఈ సందర్భంలో ఈ విషయము తెలుసుకుందాము. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోటి గోవింద నామాలు వ్రాసిన వారికి భగవంతుని ప్రత్యేక దర్శనము ఏర్పాటు చేయటము గోవింద నామ కోటి వ్రాసే ఆధ్యాత్మిక కోటీశ్వరులకు ఒక ప్రత్యేక ప్రోత్సాహకంగా ఉంటుంది. 

ఆధ్యాత్మిక కోటీశ్వరులకు దొంగల భయం లేదు, ఎవరూ వారిని అప్పు అడగరు, ఆలోచనలు క్రమపద్ధతిలో ఉంటాయి. తద్వారా ఆ మార్గంలో ప్రయాణిస్తూ మన నిజజీవితంలో చికాకు పెట్టే అనేక సమస్యలపై సమ భావముతో అనగా ఉద్రేక రహిత, ప్రశాంత మనసుతో నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నములు జరుగుతాయి. ఈ పరిణామాలు వచ్చిన తరువాత మన ఆరోగ్యం కూడా క్రమబద్ధంగా ఉంటుంది.

ఇది చూసిన తరువాత నేను ఈ మార్గంలో ప్రయత్నించాలని మొదలుపెట్టాను. ఏడు పదుల వయసు దాటి శరీరము బలహీనమైనా, సంకల్ప బలముతో ముందుకు సాగుతున్నాను. దైవ నామస్మరణ లేదా మంత్ర జపము రోజుకి కొన్ని వేల క్రమ సంఖ్యలు కొన్ని నెలలలో జరిపినాను. 

ఈ జపము లెక్కించే విధము ఈ క్రింది విధముగా ఉంటుంది. నామస్మరణ లేక మంత్ర జపములో మనసు పాత్ర చాలా ముఖ్యము. కోతి లాంటి మనసు నిలకడగా ఉండదు. జపమున కూర్చోగానే అనవసరమైన, మన గత, వర్తమాన జీవితకాలంలో జరిగిన, జరుగుతున్న ఆలోచనలు రావటం జరుగుతుంది. ఏకాగ్రత కుదరదు. దానిని పట్టించుకోరాదు. 

108 పూసల ద్వారా కొందరు, చేతి వేలి కణుపుల లెక్క ద్వారా కొందరు, ఒక పావుగంటకు ఇంత సంఖ్య అని లెక్కించుకుని కొందరు, పూజా సామాన్లు లేదా ఆన్లైన్లో దొరికే జపం లెక్కించు మిషన్ సిక్స్ డిజిటల్‌ని వాడి ఇంకొందరు, సెల్ ఫోన్లో జపమాల యాప్ ద్వారా మరికొందరు చేస్తారు. 

ధ్యానము లేదా దైవ నామస్మరణలో కళ్ళు మూసుకుని చేసే విధము ఉత్తమమని భావించినా, కొందరికి కళ్ళు మూసుకోగానే నిద్ర వస్తుంది. కళ్ళు తెరిచే విధానంలో దైవసాక్షాత్కారము తొందరగా జరగదనే భావన ఉంది. కళ్ళు మూసుకుంటే కనీసం స్వప్న సాక్షాత్కారం జరగవచ్చు. 

ఈ విషయంలో కారు నడుపుతూ సంగీతం పెట్టుకుని, దానిమీద ధ్యాస లేకుండా ఏకాగ్రతగా బండి నడుపుట మనకు ఆదర్శము అవ్వాలి. ఆధ్యాత్మిక కృషి ఒక స్థితికి వచ్చిన తరువాత మన శరీరము నుండి వెలువడే మన కంటికి కనపడని ఆధ్యాత్మిక సూక్ష్మ కిరణములు అవతలి వారిపై ప్రభావితము చేసి ఆదరాభిమానాలు పెరుగుతాయి అని కొందరు భావిస్తారు.

కాలము సాగిపోతుంది. భగవంతునిచే నిర్దేశించబడిన ఆయుర్దాయం పరిమితికి లోబడి ఈ మార్గములో ముందుకు సాగిపోతున్నాను. నా జీవిత ఆశయమునకు దగ్గరలో మరి కొద్ది నెలల్లో భగవంతుని బ్యాంకులో ఆధ్యాత్మిక సంపద దాచుకోగలనని నమ్ముతూ ముందుకు పోతున్నాను.

జీవితములో మానవ సేవ లేక మాధవ సేవ పాత్ర గొప్పదని గుర్తించిన వారు ధన్యులు.

అనుబంధము:

ఈ క్రింది విషయములు మీతో పంచుకుంటాను.

1. ప్రదక్షణ చేయు విధానము-

నవ మాసములు నిండిన స్త్రీ నెత్తిన నీళ్ల కడవ ఎంత మెల్లిగా నడుస్తుందో. ఆ విధముగా ప్రదక్షణ చేయాలని నేను తెలుసుకున్నాను. గుడిలో ప్రదక్షణ చేయునప్పుడు అభిషేక తీర్థములు వచ్చు గొట్టము వరకు ప్రదక్షణ చేసి, మళ్లీ వెనుకకు తిరిగి అభిషేక గొట్టమునకు అవతల వైపు రావాలి.

2. గుడిలో దర్శనం ఎలా చేయాలి?
గుడిలోకి వెళ్ళగానే దేవునికి నమస్కరించి కళ్ళు మూసుకుని ఆయన రూపాన్ని మనసులో ఊహించుకుని కోరికలు చెప్పుకోవాలి.

3. కొంతమంది ఈ విధమైన పూజ పద్ధతులు పాటిస్తున్నారు-
a) నదీ హారతి దర్శనము
b) గిరి ప్రదక్షిణ
c) వ్రతములు, నోములు

ఇందులో భాగముగా వినాయక చవితి పండగ తరువాత ఐదో రోజున అనంత పద్మనాభ వ్రతమును కొందరు చేస్తున్నారు.

శుభం

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.