Saturday, September 10, 2022

కోడి - కుంపటి

నా చిన్నప్పుడు చదివిన కథ జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఊరిలో ఒక ముసలమ్మ కోడికుంపటితో ఉండేది. కోడి తన సహజ లక్షణమైన కూత పెట్టి అందరినీ మేలుకొలిపేది. ఆ ఊరి జనము కోడి కూతకు నిద్రలేచి తమ పనులు చేసుకునేవారు.

ఊరిలోని జనము తమ పొయ్యిలోనికి నిప్పు కొరకు ముసలమ్మ కుంపటి నుండి నిప్పు తీసుకుని వెళ్లేవారు. కొంతకాలం తరువాత ముసలమ్మకు ఒక ఆలోచన వచ్చింది. తన కోడి కుంపటి లేకపోతే ఊరి జనమునకు ఏమి పని జరగదని, వారు బతకలేరని అనుకుని ఒక రోజు తెల్లవారుజామున ఊరి బయటకు వెళ్ళింది.

తెల్లవారిన తరువాత ఊరి జనము తన కోసం ఏమి అనుకుంటున్నారో తెలుసుకోవాలని, అటు పక్కగా వెళ్తున్న ఒక వ్యక్తిని పిలిచి ఊరిలో అంతా బాగుందా అని అడిగింది. అతను అందరూ వారి పనులు వారు చేసుకుంటున్నారు అని చెప్పగానే ఆమె తన తప్పు గ్రహించి ఊరిలోనికి తిరిగి వెళ్ళింది. ముసలమ్మ ఏమీ చదువుకోలేదు కనుక అలా ఆలోచించిందేమో కానీ చాలామంది ఉద్యోగులు, చదువుకున్న వారు కూడా అదే తప్పుగా ఆలోచిస్తున్నారు.

ఎంతోమంది చదువుకున్న ఉద్యోగస్తులు, నాయకులు తాము పనిచేసే ఆఫీసుల్లో తాము లేనిదే ఏ పని జరగదని తామే ఆఫీసుకి ముఖ్యమనే భ్రమలో ఉంటారు. అలా అనుకుని తమ సొంత పనులు కూడా మానుకొని ఆఫీసుల్లో వేలాడుతూ ఉంటారు. ఈ భ్రమ ఉద్యోగ విరమణ తర్వాత గాని పోదు.

ఇంకొంతమంది పదవుల్లో ఉన్నవారు తాము లేనిదే దేశంలో ఏమీ లేదని, తాము లేకపోతే దేశం నాశనం అయిపోతుందని అనుకుంటారు. వారితో పాటు వారి అభిమానులు కూడా దేశం ఏమైపోతుందో అని భయపడతారు. భూమి మీద ఉన్న వారు ఎవరైనా కాలం తీరిన తర్వాత మరణించక తప్పదు. వారి కోసం ఏదీ ఆగదు అన్నది సత్యం. దానిని అందరూ తెలుసుకోవాలి.

అతి ముఖ్యమైన విషయం ఏమనగా నాయకులు వారి జ్ఞానము చేత అధికారము ఉన్నప్పుడు కొన్ని పనులు చేస్తారు. వారి తదనంతరము అధికారములోకి వచ్చిన వారు వారి ఆలోచనలను బట్టి మిగిలిన పనులను పూర్తి చేస్తారు.

నీతి: కాల ధర్మమునకు ఎవరూ ఎదురు ఈదలేరు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.