Thursday, July 7, 2022

నేను దైవమును చూస్తాను

నా జీవితములో చిన్న చిన్న రోగాలు ఎన్ని వచ్చినా పెద్దమార్పు లేదు కానీ, చక్కెరవ్యాధి ఎన్నో మార్పులు తెచ్చింది. నాకు 40 సంవత్సరములు నిండకుండానే చక్కెర వ్యాధి రావటం పెద్ద కుదుపుగా చెప్పుకోవచ్చు. 

మొదట దానిని నేను పెద్దగా పట్టించుకోలేదు. నీరసము, తీపి పదార్థాలపై వ్యామోహము, మూత్రమునకు తరచుగా వెళ్ళుటతో ఇది బయట పడుతుంది. ఉద్యోగరీత్యా ప్రతి రెండు లేదా మూడేళ్ళకు బదిలీలు సామాన్యము. ఒక జిల్లాలో పని చేస్తున్నప్పుడు ఆ ఊరిలో డాక్టర్లు తక్కువ, రక్తపరీక్షలు పెద్దగా లేవు. ఆ ఊరిలో ఉన్న మూడు ఏళ్ళు రోగ విషయమై చాలా అశ్రద్ధగా ఉన్నాను. ఇలా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒక డాక్టర్ సలహాతో మందుల స్టేజ్ దాటి ఇన్సులిన్ వైపు వెళ్ళాను. 

మధ్యలో ఒక ఊరిలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగా మందుబిళ్లలు పొడిగా ఇచ్చి నెల రోజులు వాడితే పూర్తిగా తగ్గుతుందని చెప్పితే గుడ్డిగా నమ్మాను, కాని ఫలితం లేదు. అంత క్రితమే హైదరాబాదు అవతల నాటు పసరుల వైద్యము కారము అన్నము, పథ్యముతో వాడినా ఫలితం కనపడలేదు. నాలా వైద్యం కోసం వచ్చిన ఒక స్వాతంత్రయోధుడు తిరుగు ప్రయాణములో సహాయముతో తగ్గింపు ధరలో రైలు టికెట్ పొందడం కొసమెరుపు. మధ్యలో రేకి వైద్యము ఒక నెల రోజులు వాడి ఇన్సులిన్ మానివేసినప్పుడు నెల రోజుల తర్వాత రెండు మార్లు ఇంజక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్యలో ఎవరినో చూసి కాకరకాయ ఉడకపెట్టి అన్నములో తినటము చేసినా ఫలితము పొందలేదు. 

రకరకాల ఆకు పసరుల వైద్యము, చేదు కషాయము వంటివి తీసుకున్నా ఫలితం కనపడలేదు. ఈ మధ్యలో కొన్ని ఏళ్ళ క్రితము ఒక ప్రముఖ దిన పత్రిక ఆదివారం మ్యాగజైన్ లో రాసిన చేతి గడియారము పెట్టుకుంటే తగ్గుతుందని చదివి 150 రూపాయలు మనీ ఆర్డర్  పంపగా తిరిగి వచ్చింది. మరల డబ్బు పంపగా డబ్బులు తిరిగి రాలేదు, వాచ్ రాలేదు. చక్కెర వ్యాధిగ్రస్తుల పరిస్థితి సింహం మీద సవారీ లాంటిదని, అది అదుపు తప్పితే  మనలను కిందకు పడవేస్తుందని అన్నమాట నిజమనిపిస్తుంది. 

ఈ మధ్యకాలంలో రోగి, వైద్యుల సంభాషణ. ఒక నేత్ర రోగి వైద్యుని దగ్గరకు వెళ్లగా నీకు కళ్ళు చాలా ముఖ్యము, నీ కళ్ళకు వైద్యం చేస్తే పొలం కొద్దిగా రాసి ఇస్తావా అని అన్నట్లు విషయముగా ఉంది. నిజముగా డబ్బు కాక పొలము అడిగాడో లేదో మనకు తెలియదు కానీ దీనిని కాసేపు సరదా సంభాషణగా భావిద్ధాము. ఈ భూమి మీద ఎవరి సేవలు ఉచితము కాదు. వృత్తి నైపుణ్యంతో కూడిన సేవలు అస్సలు ఉచితముగా ఉండవు. అవి మనము ఆశించడము కూడా సరికాదు.

15 లేక 20 ఏళ్ళ వ్యాధి గ్రస్తులకు అనుబంధ సమస్యలు మొదలవుతాయి. అవి ఎలాంటివంటే కాలి దురద, కీళ్ళ నొప్పులు, కాళ్ళ మంటలు, గుండెకు రక్త సరఫరాలో ఆటంకం వల్ల ఆపరేషన్, నేత్ర సమస్యలు, కాళ్ళు చేతుల గోళ్ళు నల్లగా మారటం మొదలైనవి. ఏ సమస్య వచ్చినా వైద్యుల్ని సంప్రదిస్తే చక్కెర వ్యాధిని అదుపులో ఉంచడం మంచిదని సలహా చెబుతారు. అది అదుపులో ఉండకుండా ఫాస్టింగ్, పిపి లలో రెట్టింపుగా ఉండడం సామాన్య పరిస్థితిగా ఉంది. శుక్లములకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత, కంటిలో రెటీనాకు ఆపరేషన్ అవసరము ఏర్పడి షుగర్ లెవెల్ అదుపులో లేనందున ఆపరేషన్ వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. 

మధుమేహ వ్యాధిగ్రస్తులు తాము వాడే ఇంగ్లీష్ మందులతోపాటు అనేక వైద్య విధానములు పాటించడం పరిపాటి అయింది. ఏ విధమైన మందు వాడినా అసలు ఇంగ్లీష్ మందులు వాడడం మానరాదు. ఇరవై ఏళ్ళు ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకున్న తర్వాత ఇన్సులిన్ సరిపోవట్లేదనే అనుమానంతో వైద్యుని సలహాకు వెళ్ళినప్పుడు పాత ఇన్సులిన్ మానేసి, పెన్ ఇన్సులిన్ కి మారి అది పని చేయకపోతే మిక్స్డ్ ఇన్సులిన్ కి మారడం అవసరం అయ్యింది. 

అనేక సంవత్సరాల వ్యాధి పీడితునిగా ఆధునిక వైద్యమును అనుసరించి, ఎండోక్రైన్ నిపుణులను సంప్రదించడం మంచిదని తెలుసుకున్నాను. ఈ పద్ధతిని అనుసరించి షుగర్ వ్యాధి అదుపులో ఉంచుకొనుటకు కొన్ని పద్ధతులు ఉపయోగపడతాయని నమ్ముతూ ఫలితము కోసం ఎదురు చూస్తూ ముందుకు పోతున్నాను. ఈ ఫలితము విజయవంతము అయితే నేను వైద్యునిలో దేవుని చూసినట్టే. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అని చెప్పారు కదా. ఈమధ్యలో కొంతమంది నేరేడు పళ్ళు తినటము లేక నేరేడు పళ్ళ పొడిని గోరువెచ్చని నీటిలో రోజుకు రెండు మార్లు తాగటము ద్వారా చక్కెరను అదుపులో ఉంచుకున్నట్లు వారి అభిప్రాయముగా తెలుసుకున్నాను.

శరీరమునకు ఏ రోగము వచ్చినా దానికి కొంత షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకొనుట అవసరముగా వైద్యులు చెప్పినప్పుడు దాని అదుపు గూర్చి తీవ్రముగా ఆలోచించవలసిన పరిస్థితి. నిశ్శబ్దముగా శరీరమునకు అనేక బాధలు కలగజేయగల ఈరోగమును అదుపులో ఉంచుకోవలసిన అవసరమును నేను ఆలస్యముగా తెలుసుకున్నాను. దీర్ఘకాల రోగ పీడితులు అనగా 20ఏళ్ళ పీడితులు అన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరము ఉంది.

సలహా: చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే ఏ ప్రమాదము జరుగుతుందో మనకు తెలియదు. అదుపులో ఉంచుకొనుటకు ప్రయత్నం చేయాలి. అశ్రద్ధ చేయరాదు.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.