Wednesday, March 3, 2021

సన్యాస జీవితము - 2

వంటింటికి పరిమితమైన గృహిణులు కూడా ఈమధ్య కాలంలో సన్యాసము స్వీకరించుట, ఆధ్యాత్మిక జ్ఞానము సంపాదించి జాతికి దిశానిర్దేశం చేసి గుర్తింపు తెచ్చుకున్న విధానము ఆహ్వానించదగినది. 

సన్యాసులకు ఉండకూడని కామ, క్రోధ నివారణకు మసాలాలు, ఉప్పు, కారం లేని ప్రత్యేక ఆహారము వారి మనసుని ప్రత్యేకంగా ఉంచుతుంది. కొందరు స్వామీజీలు ప్రత్యేక వ్యాపారం ద్వారా అనేక ఉత్పత్తులను తయారుచేసి విక్రయించుట మనము చూడవచ్చు.

శంకరాచార్యుని గూర్చి చూస్తే, శంకరుల వారి అనుగ్రహంతో కేరళ కాలడి గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు తన బాల్యంలోనే సన్యసించి దేశం మొత్తం పర్యటించి, అనేక జీర్ణ దేవాలయములను బాగుచేసి, కోపంగా ఉన్న అనేక దేవతామూర్తులను ఉగ్రరూపం నుండి శాంతరూపంగా యంత్ర ప్రతిష్ఠలు చేసి, అనేక స్తోత్రములు వెలుగులోకి తెచ్చివిజ్ఞాన ప్రబోధముల ద్వారా పెంచి, ఎన్నో ధర్మములకు భాష్యం చెప్పి, జ్ఞానవంతులనుగా చేశారు. తమ తరువాత జ్ఞానం పంచు నిమిత్తము ఏర్పరచిన నాలుగు పీఠములు తమవైన పద్ధతులలో ధర్మమును కాపాడుతున్నవి. శిష్య పీఠములు ఎన్నో వివాదాస్పద విషయములలో, మత సంబంధమైన విషయములలో తగిన సూచనలు ఇచ్చి మనలను కాపాడుతున్నవి. అతి చిన్న వయసులో పరమపదించిన ఆదిశంకరులు విజ్ఞాన సంపన్నులుగా పేరొంది, వారి సమాధి హిమాలయాలలో కేదార్ నాథ్ వద్ద ఉన్నట్లు చెప్పుకుంటారు.

కొన్ని రాష్ట్రములలో వందల ఎకరాలు కలిగి ఉండిన మఠాధిపతులు రాజకీయములను ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారు. కొందరు స్వామీజీలు అధికారులు, పరపతి కలిగిన భక్తుల సహాయంతో భూకబ్జాలు చేసి వివాదాలలో చిక్కుకుంటున్నారు. సన్యాసులను ఆదరించుట గృహస్థ ధర్మము.

హిమాలయములు ఎంతోమందికి మహర్షులు, సన్యాసులు, ముముక్షువులకు తపస్సు చేసికొనుటకు అవకాశమిచ్చి, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం కాపాడుకొనే వేదికగా, గుర్తుగా ఉన్నవి. వీరి తపోబలమే దేశానికి రక్ష. దేశంలో గల అనేక పీఠములు, ఆశ్రమములలో వారసుల ఎన్నిక కొరకు శిష్యులకు భారతీయ విజ్ఞానము, విద్య నేర్పుతూ తదుపరి పీఠాధిపతులను ఎంచుకునే ప్రక్రియ పాటిస్తున్నవి. కొందరు పొట్టకూటికి కాషాయం  ధరించి, మాదక ద్రవ్యములు సేవించి, నేరములు చేస్తే మరికొందరు నిజమైన వైరాగ్యముతో కాషాయం ధరించి దాన్ని గౌరవము పెంచుతున్నారు.

గృహ వాతావరణమునకు, ప్రపంచ సమస్యలకు స్పందించేవారు ఒకానొక సమయంలో సన్యాసులకు సంబంధించిన ఆశ్రమములను తాత్కాలిక ఉపశమనముగా దర్శించినా, అక్కడ వాతావరణంలోని ఈర్ష్య, ద్వేషం మనలను బాధపెడితే కొంత ఇబ్బంది పడతాము.

నాకు తెలిసిన పిఠాపురం శ్రీపాద వల్లభస్వామి గాని, కర్ణాటకలోని గానుగాపూర్ నందుగల నృసింహ సరస్వతి గాని కృష్ణా నదిలో అంతర్ధానమై వారి జీవిత కాలంలో ప్రదర్శించిన మహిమలు ప్రసాదించిన వరములు ఎంతోమంది జీవితాలను నిలబెడతాయి. శ్రీపాద వల్లభ కర్ణాటకలోని కురువపురం కృష్ణా నదిలో, నరసింహ సరస్వతి పాతాళ గంగ వద్ద కృష్ణా నదిలో  అంతర్ధానం అయినారు. వారి అవతార సమాప్తి జరిగి చాలా కాలమైనా వారు ఇప్పటికీ సజీవులు, చిరంజీవులు. స్థూల శరీరమును మనం దర్శించకపోయినా. తమ భక్తులకు సహాయం కోరిన వారికి సహాయం అందజేస్తున్నారు అని నమ్ముతూ ఈ సృష్టిని నడిపించే పరమ గురువులకు ధన్యవాదములు తెలియజేద్దాం.

సన్యాసి జీవితం విమర్శలకు అతీతం కానప్పటికీ, వారి జీవన విధానము జాతికి గౌరవప్రదం. దానిని మార్గదర్శకముగా భావించుటలో ఎలాంటి సందేహమునకు చోటివ్వరాదు. జ్ఞాన సంపన్నులను, మార్గదర్శకులను గౌరవించుట మన విధి. వారినందరిని ఒకమారు స్మరించి వందనము చేద్దాము. చివరిగా సన్యాస జీవన నిష్క్రమణ విధానమునకు వస్తే వారి  పార్థివ శరీరం నది మధ్య తీసుకువెళ్ళి, తలమీద కొబ్బరికాయలతో  కొట్టుట ద్వారా కపాల మోక్షము కలిగించి, ఆ పార్ధివ శరీరమును జలచరములకు ఆహారము వేయుట అనే విధానము ఆచరణలో పాటింప బడుతున్నది.

నీతి: ఆచారములను పాటించినప్పుడు అవి మనలను కాపాడుతాయి అని అనుకుంటే, దానిని మానవ ధర్మం అనుకొని దాని ఆచరణకు అప్పుల పాలు కాకుండుట జీవిత ధర్మము.

జై గురుదేవ! జై గురుదత్త! శరణం మహాప్రభో! మమ్మల్ని కాపాడు.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...