Sunday, February 21, 2021

నిద్ర

మానవుడు విశ్రాంతి తీసుకునే క్రమంలో చేసే/జరిగే ప్రక్రియను నిద్రగా అనుకోవచ్చు. నిద్రావస్థకు మెలుకువ అనేది వ్యతిరేకం. ఆహారంతోపాటు మనిషికి ఎంతో అవసరమైనది నిద్ర. 

ఈసమయంలో తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. పసి పిల్లలను నిద్రపుచ్చటం ఒక కళగా పేర్కొంటారు. వాహనములు నడుపునప్పుడు నిద్రపోరాదు. నిద్ర వస్తున్నప్పుడు వాహనములు నడపరాదు. నిద్రావస్థలో వాహనములు నడిపినచో అనేక ప్రమాదాలు జరుగుతాయి.

తాత్కాలిక నిద్రను నిద్రగా, శాశ్వత నిద్రను చనిపోవడంగా పేర్కొంటారు. రాత్రిపూట విశ్రాంతి కొరకు తీసుకునే నిద్ర ఆరోగ్యకరమైతే, పగటి నిద్రను సోమరితనంకు చిహ్నంగా భావిస్తారు. నిద్ర మనిషికి భగవంతుడు ఇచ్చిన వరమైతే, నిద్ర పట్టకపోవడం శాపము. కళ్ళు మూసుకుని నిద్ర పోవటం సహజం. అయితే కళ్ళు తెరిచి నిద్ర పోవడం అసహజమైన జీవితమునకు చరమాంకముగా భావిస్తారు. నిద్రకు పరాకాష్టగా కుంభకర్ణుని నిద్రతో పోలుస్తారు.

కుంభకర్ణుడు రాక్షసుడు, రావణుడి సోదరుడు. కుంభకర్ణుడు తీవ్రమైన తపస్సుతో నిర్దయ, నిర్దయ అని అనుకుంటూ సరస్వతి దేవి శాపంతో నిద్రగా మారి బ్రహ్మదేవుని వద్ద వరముగా పొందినట్లు ఆరు నెలల నిద్ర, ఆరు నెలల ఆకలి ఉండేటట్లు, పురాణ కథల ద్వారా తెలుస్తున్నది. ఈనాటికీ అతి ఆకలిని కుంభకర్ణుని ఆకలిగానూ, అతి నిద్రను కుంభ కర్ణుని నిద్రగానూ వ్యవహరిస్తారు. కోమాలో ఉన్నవారిని తాత్కాలిక, శాశ్వత నిద్రల మధ్య స్థితిలో ఉన్నట్లు భావిస్తారు.

నిద్ర విశ్రాంతిలో ఒక భాగమై రాత్రిపూట జరుగుతుంది. పగలంతా అనేక వ్యాపకములచే కష్టపడిన వారు రాత్రిపూట తీసుకునే విశ్రాంతి నిద్రగా మానవుని దినచర్యలో ఒక భాగమైంది. సరైన కాలము అనగా ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోకపోతే రోగముల పాలవుతారని వైద్య శాస్త్ర ప్రవచనము. వైద్యపరంగా జరిగే శస్త్రచికిత్సలో, మత్తు ప్రయోగం కూడా నిద్రలో భాగమే. దీనివల్ల మత్తు ప్రభావం ఉన్నంత వరకూ స్పర్శ జ్ఞానము ఉండదు. రాత్రి నిద్రకు కేటాయించినందున వెనకటి రోజులలో రాత్రి యుద్ధం నిషేధము.

నిద్రలో భాగముగా నిద్రించుటకు అనేక సౌకర్యములు అమరినవి. నేలపడకకు ఆధ్యాత్మిక సంబంధము ఉన్నది. నిద్ర సుఖమెరుగదు అని సామెత. అయితే ఎక్కువమంది మంచంపై నిద్రించుటకు ప్రాధాన్యం ఇస్తారు. మంచములకు తోడుగా వాటిపై వేసుకునే పరుపులు ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి రెండు వేల నుండి కొన్ని లక్షల వరకు వైద్య పరమైనవి కూడా ఉన్నాయి. కొందరు సర్దుకుపోయేవారు కూర్చుని నిద్రపోవడం చూడవచ్చు.  ప్రయాణంలో వివిధ వాహములలో ఉన్నవారు తమదైన భంగిమలో నిద్రపోతూ, అలసట లేకుండా చూసుకుంటారు.

వివిధ వైద్యములలో మాత్రలు, యోగ విద్యలు కలవు. యోగనిద్ర ఆధ్యాత్మిక నిద్రగా భావించబడి భగవంతునితో అనుసంధానమునకు మార్గముగా చెప్పబడింది. నిద్రపై వివిధ పుస్తకములు, పాటలు మనల్ని రంజింపజేస్తాయి. మనకు గిట్టని వారిని ఏమి నిద్ర పోతున్నావా అని అనటం సర్వసాధారణం. నిద్రను నిద్రాదేవిగా పోలుస్తారు. తరతమ భేదం లేని నిద్రాదేవతకు నమస్కరిద్దాం.

రాత్రి నిద్ర ముద్దు, పగటినిద్ర వద్దు. జై నిద్ర అని విశ్రాంతిగా నిద్రపోదాం. రోజంతా పనిచేసి అలసిపోయిన వారిని సుఖనిద్రా ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిద్దాం.

No comments:

Post a Comment

శబ్ద తరంగములు

మన జీవితంలో శబ్ద తరంగములకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్రలేచినది మొదలు రకరకాల శబ్ద తరంగములతో మన జీవితం గడుస్తుంది. చాలా సందర్భములలో శబ్ద తరంగాల...