Wednesday, February 24, 2021

గురువు

మానవునికి ప్రథమ దశలో తల్లి, తండ్రి, గురువు స్థానంలో ఉంటారు. తరువాత విద్యాభ్యాస సమయంలో విద్య నేర్పినవారు గురువులవుతారు. 

తరువాత జీవితంలో మనకు మంచి సలహాలు చెప్పినవారిని గురువుగా అనుకుంటే తప్పు లేదు. కొందరు ఈ విధముగా అనుకోవచ్చు. వెనుకటి రోజులలో మన దగ్గరనుండి ఏమీ ఆర్థిక సహాయం ఆశించకుండా తరువాత జీవితంలో మనకు మంచి సలహాలు చెప్పిన వారిని గురువుగా అనుకుంటే తప్పు లేదు.  రాజులు జమీందార్ల పోషణతో నడిచే గురుకులము లేక ఆశ్రమంలో చేరి విద్యాభ్యాసం చేసేవారి పూర్తి బాధ్యతను గురువు స్వీకరించి జ్ఞానము నేర్పి మనని తీర్చిదిద్దేవారు. ఈకాలం పరిస్థితులలో వేలకు వేలు ఫీజులు కట్టి, విద్యను నేర్చుకుంటున్నాము. ఇంకొంత ముందుకు పోయేవారు విద్య కొంటున్నాము, వారు గురువులు ఏంటి? వారికి మామూలు మానవ గౌరవము ఇస్తే చాలు, ప్రత్యేక గౌరవం అక్కర్లేదు అని అనుకోవచ్చు. వారు సరదాగా అనుకున్నా, నిజముగా అనుకున్నా, జ్ఞానము నేర్పినవారు మనకు మంచి, చెడు నేర్పినవారిని గురువులు లేక గురు సమానులుగా భావించడంలో తప్పులేదు. 

వెనుకటి రోజులలో గురుస్థానము చాలా గొప్పది. వారు తమ సామర్థ్యంతో శిష్యులు లేదా తమను ఆపదలో అభ్యర్థించినవారికి దైవ సంబంధమైన మహిమల ద్వారా మేలు చేసినట్లు పురాణ కథల ద్వారా తెలుసుకున్నాము. అలానే కొందరు శిష్యులు తమ గురువులకు గురుదక్షిణగా మేలు చేసినట్లు చదువుకున్నాము. అలాంటిదే కుచేలుడు, కృష్ణుడు సాందీప మహాముని వద్ద శిష్యరికం చేసి గురుదక్షిణగా సాందీపమునికి జరిగిన కష్టములు తెలుసుకుని,  చక్కదిద్దినట్లు చదివాము. అలానే కృష్ణుడు కుచేలునికి చదువుకునే కాలంలో, స్వార్ధంగా ప్రవర్తించినా అతను తెచ్చిన కొద్ది  అటుకులు స్వీకరించి, అతని దారిద్ర్యం తొలగించి, ఐశ్వర్యం అనుగ్రహించినట్లు తెలుసుకున్నాము. విద్యా కాలములో స్నేహబంధము మరియు కుచేలుని భగవద్భక్తి దీనికి కారణంగా చెప్పవచ్చు. భక్తుడి కన్నా దైవం మిన్న, దైవము కన్నా గురువు మిన్న అను భావముననుసరించి ఈశ్లోకము ఒకమారు చెప్పుకుందాము.

గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీగురవే నమః

ఈ సందర్భంలో ఒక చిన్న కథ మనము చెప్పుకుందాం.

గురుసాక్షాత్ భగవంతుని దర్శించినవారు. కనుక మనకు సరైన గురువు లభించిన దైవమార్గములో ఆయన మనను మార్గదర్శనం చేయగలరని భక్తి మార్గంలో ఉన్నవారు నమ్ముతారు. అయితే చాలామందికి సరైన గురువు లభిస్తాడో, లభించడో అని సందేహం ఉంటుంది. అలాంటివారికి సాయిబాబానే అండ. ఆయనను గురువుగా భావించి తరించినవారు ఎందరో ఉన్నారు.

గురు సేవలో పెద్దలు చెప్పిన మాటలు మననం చేసుకుందాం. వేదధర్ముడు అనే ముని తన శిష్యులతో నా కర్మ శేషము అనుభవించక తపశ్శక్తితో పోగొట్టుకుంటే మోక్షమునకు విఘ్నమని తీవ్రరోగములు ఆకర్షించుకుని, 21 సంవత్సరములు కాశీలో అనుభవిస్తానని నాకు సేవ చేయగల శిష్యులు ఎవరు అని అడగగా దీపకుడు అనే శిష్యుడు అంగీకరించాడు. వారు కాశీలో నివాసం ఏర్పాటు చేసుకుని గురువు నుండి అనేక పరీక్షలు కల్పించబడినా, వినయముతో గురువు అనుగ్రహం పొందాడు. అతని గురుభక్తికి మెచ్చి, శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమంటే, గురువు అనుమతి లేనిది కోరుకోను అని చెప్పి, గురువు అనుమతి ఇవ్వనందున శివుడు వెళ్ళిపోతాడు. ఈ విషయం శివుడి ద్వారా తెలిసిన విష్ణువు దీపకుడికి దర్శనమిచ్చినప్పుడు, నేను మిమ్మల్ని సేవించలేదు కదా! నాకు ఎందుకు దర్శనమిచ్చారు? అని అడుగగా ఆతర్వాత జరిగిన సంభాషణలో శిష్యుని గురుభక్తి సంతోషించి వరము అనుగ్రహించాడు. గురువు కూడా అతని గురుభక్తికి మెచ్చి వరమిచ్చాడు.

దౌమ్యుడనే మునికి అరుణి, బైదుడు, ఉపమన్యువు అనే శిష్యుల గురుభక్తి వివరములు పొలానికి నీరు పెట్టడానికి వెళ్ళిన అరుణి నీరు పెట్టుటలో గండి పడిన పొలమునకు అడ్డంగా పడుకొని గురువుగారు చెప్పిన పని మీద ధ్యాస ఉంచి, పని చేసినాడు. అది గమనించిన గురువు అతనిని సంపూర్ణ విద్యాపారంగతునిగా చేసినాడు. బైదుడు గురువు ఆజ్ఞ ప్రకారము పొలము నుండి పంట తీసుకొనివచ్చుటకు దున్నపోతుల బండికి ఒకటే దున్నపోతు ఉన్నందున, కాడికి రెండోవైపు తన భుజానికి వేసుకుని వచ్చు మార్గంలో బురదలో నుండి బండి లాగలేక, కళ్ళు తిరిగి పడిపోయినాడు. ఇది గమనించిన గురువు అతని సేవాదీక్షకు మెచ్చి అనుగ్రహించాడు.

భోజన ప్రియుడైన ఉపమన్యువు గోవులను మేపుతూ, గురువు ఆజ్ఞ ప్రకారము అన్ని ఆహారములు మాని చివరకు జిల్లేడు పాలు తాగు సందర్భంలో కళ్ళు పోయి బావిలో పడ్డాడు. అతని గురుభక్తికి మెచ్చి గురువు అతనికి కళ్ళు అనుగ్రహించాడు ఈ విషయంలో పురాణంలో చెప్పిన వ్యాఖ్యలు జ్ఞాపకం చేసుకుందాం. గురువే తల్లి, తండ్రి, బ్రహ్మ, విష్ణువుల ప్రత్యక్ష రూపం. ఆయనే మేలు చేయగలరు. శ్రద్ధ, భక్తులతో, పట్టుదలతో గురువుని సేవించాలి. సాయి సద్గురు మహారాజ్ కి జై.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.