Wednesday, April 20, 2022

ప్రియ సంభాషణము

మనని ఒక సమూహంలో గుర్తించే స్థానము పొందే అవకాశం మనకు సంభాషణా చాతుర్యం కలిగిస్తుంది. సంభాషణలు నవ్వు ముఖముతో కనపడుతుండగా మనకు నలుగురిలో గుర్తింపు తెస్తుంది. 

సంభాషణలో ప్రవర్తన కూడా ముఖ్యమే. వెకిలి మాటలు గౌరవమును పెంచవు. ఒక విదేశీయుడు అయిన డేల్కార్నెజీ పుస్తకం ద్వారా నలుగురితో ఎలా మెలగాలి, విజయం లేక అభిమానం సంపాదించుటకు మనము ఏమిచేయాలి, అవతల వారి స్నేహం సంపాదించుటకు ఫలించిన వ్యూహం వంటి అనేక విషయములపై రాసిన పుస్తకములు పుస్తక ప్రచురణలో అనేక ముద్రణలు పొంది పుస్తక రంగంలో ప్రత్యేక స్థానం పొందినది. ఇంకా ప్రవర్తన శాస్త్రము అనబడే బిహేవియర్ సైన్స్ పై అనేక రచయితలు రాసిన పుస్తకములు, ఉద్యోగ శిక్షణ తరగతుల కోర్సునందు విరివిగా వాడబడుతున్నాయి. విసుక్కొనుటలో మన ప్రమేయం తక్కువ అని, దానికి మనం పడే పని ఒత్తిడే కారణమని భావిస్తే విసుక్కోబడే వారు బాధపడతారనే నిజము గ్రహించకపోతే, విసుక్కోబడినవారు అధికార బలవంతులయితే వారి నుండి రిటర్న్ గిఫ్ట్ లు అందుకుంటారు.

మనం వాడే భాష మనకు శత్రువులను, మిత్రులను ఏర్పరుస్తుందని ఒప్పుకోవాలి. సంభాషణలో ఎక్కువ నిజములు  బయటకు రావటం ఎక్కువ మంది శ్రోతలు హర్షిస్తారో, లేదో  తెలియని సందేహం. రాజకీయ నాయకులు అధికారం కొరకు చేసే వాగ్దానములు  లేదా అధికార వాగ్దానములు ఉద్రేకం, ఉత్సాహం కలిగించేవి అయి ఉండి శ్రోతలను ఆకట్టుకుంటాయి. వారు చేసిన వాగ్దానాలు అమలు జరగవని శ్రోతలకు తెలిస్తే, తర్వాత జరిగే పరిణామాలు వాగ్దాన దాతలకు కూడా తెలుసు. ఉదాహరణకు ఒక సినిమాలో ఒక రాజకీయ నాయకుడి వాగ్దాన ప్రసంగం సరదాగా జ్ఞాపకం చేసుకుందాము. ఏ మాత్రం సముద్రం వసతి లేని ఒక రాష్ట్రమునకు ఓడరేవు తెచ్చుట, దానివల్ల పెరిగే ఉద్యోగ అవకాశములు వంటి  విషయములపై జరిగిన వాగ్దాన ప్రసంగంలోని నిజము శ్రోతలు గ్రహిస్తే వారికి ఆశాభంగం కలుగుతుంది.

సంభాషణలకు, నిజము పలుకుటకు దగ్గరి సంబంధం ఉంది. పొగడ్తలలో నిజం తక్కువ, అతిశయోక్తులు ఎక్కువ. సంభాషణలో నిజము ఎక్కువగా ఉన్నప్పుడు, వినేవారికి కొన్ని ఆశాభంగములు తప్పవు. కాశీ నగరం వేదికగా జరిగిన సత్య హరిశ్చంద్రుని కథ, సత్య భంగమునకు సిద్ధపడని విశ్వామిత్ర సత్య హరిశ్చంద్రుల సంవాదముల ఇతి వృత్తము భారతదేశ ఇతిహాస చరిత్రలో గుర్తింపు పొందినది. సత్య సంధతకు కట్టుబడి, అనేక కష్టములు తానూ, తన కుటుంబ సభ్యులు పడిన ఉదంతం చదివిన, విన్న పాఠకులు, శ్రోతలు చలించి కన్నీరు పెట్టిన వైనం అపూర్వము. అలా అని కొన్ని నిజాలు చెబితే తమ వృత్తి ధర్మమునకు హాని జరుగుట ఖాయము.

ఉదాహరణకు కక్షిదారులకు  న్యాయ సేవలు అందించే వృత్తిలో ఉన్న న్యాయవాది తన వద్దకు వచ్చిన కక్షిదారునికి సంబంధించిన వ్యవహారంలో విజయమునకు అవకాశము బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా కేసు విజయం నిర్ణయించేది న్యాయాధికారి. కనుక కేసుకు సంబంధించిన విషయంగా మానసిక ధైర్యం కలుగజేయు ప్రయత్నం చేయును. కాని  అసలు నిజం చెప్పులేని పరిస్థితి. అదే విధముగా ఒక వైద్యుడు తన వద్దకు వచ్చిన తీవ్ర రోగికి, మానసిక ధైర్యం చెప్పి అందుబాటులో ఉన్న వైద్యం చేయుట అతని ముఖ్య కర్తవ్యమై ఉన్నది. రోగ తీవ్రత అంచనా అతను గ్రహించినా రోగికి నిజం చెప్పలేని స్థితి. అతను ఆయుర్దాయము చెప్పగలిగిన భవిష్యత్ సూచకుడు కాదు. మనకు తెలిసినంత వరకు ఈ రెండు సంఘటనలలో నిజం చెప్తే, వృత్తి ధర్మమునకు ఆటంకం కలుగుతుంది. ఇలాంటివి చూసిన తర్వాత నిజం దాచకపోతే, అనేక వృత్తి ఉద్యోగ ధర్మముల వారికి ఆటంకం కలగవచ్చు. నిజము చెప్పుట కంటే దాచుట మేలన్న భావన వస్తే నిజము కనుమరుగు కావాలనే అభిప్రాయం బలపడవచ్చు.

పనిలో పనిగా తెలుగు నాట మనకు అందుబాటులో ఉన్న అనేక శతకములు చెప్పిన నిజము ప్రియ సంభాషణలు. ఈ తరానికి ఎంతవరకు ఉపయోగపడతాయో అని సందేహం కలుగుతుంది. నిజం చెప్పు విషయము ఊహలలో ఒకటి ఆలోచిద్దాం.  మన సమాజంలో అనేక నేరస్తులు తాము చేసిన పనికి పశ్చాత్తాపపడి నేరం ఒప్పుకొని నిజము బయటికి వస్తే అనేక మందికి పని తగ్గుతుందనే ఊహ, చాలామందికి చేతినిండా పని ఉండదని అర్థమయ్యే నిజము. ప్రియమైన సంభాషణ ఆకర్షణీయం. కొన్ని ఉద్యోగాలకు ప్రియ సంభాషణలు ముఖ్యము. ఈ సందర్భములో రిసెప్షనిస్ట్ ఉద్యోగం గురించి చెప్పుకోవాలి. వారు అందముగా ఉన్నా, లేకపోయినా మంచి వస్త్రధారణతో ముఖమున చెక్కుచెదరని చిరునవ్వుతో విసుగు కనబడకుండా వారిని ప్రశ్నించిన వారికి ఇచ్చే సమాధానం తప్పక సంతోషం కలిగిస్తుంది. 

రెండు ఉదాహరణలు చెప్తాను.  కొన్ని ఏళ్ళ క్రితం ఒక నగరంలోని బస్టాండ్ లో గల ఎంక్వైరీ కౌంటర్ నందు ఉన్న యువతి ప్రయాణికుల సందేహమునకు ఇచ్చిన సమాధానం ప్రయాణికులకు సంతోషం కలిగించింది. అలానే ఒక కళ్ళజోడు షాపునందు ఉన్న యువతి ఇచ్చిన చిరునవ్వుతో కూడిన సమాధానంపై ఇప్పటికీ మంచి అభిప్రాయం ఉంది. దీనిని బట్టి నేను గ్రహించిన నిజము ఏమిటంటే, కౌంటర్లో సందేహం తీర్చు సంస్థ ఉద్యోగులు తప్పక ఆసంస్థ ప్రతిష్టను పెంచుతారని గమనించాను. కొందరు వ్యక్తులు సమ్మోహనకరముగా మంద్రస్వరముతో మాట్లాడి శ్రోతలను ఆకట్టుకుని నాయకులుగా ఎదుగుతారు. అలాంటి వారు  నాయకులైతే  కార్యకర్తలను, కళాకారులైతే అభిమానులను, ఆధ్యాత్మికవేత్తలయితే శిష్యులను ఏర్పర్చుకుని సంఘములో గుర్తింపు పొందుతారు. ఇలాంటివారు మాటలే పెట్టుబడిగా నడిచే మార్కెటింగ్ రంగంలో నిలదొక్కుకుంటారు. ఇలాంటి వారు తప్పు మార్గంలో నడిచి నమ్మకం చెడగొట్టుకుంటే ఓటమి వీరిని వరించి పేరు చెడగొడుతుంది. కొందరు వయసులో ఉన్న యువతీ యువకులు వారి సమ్మోహనకరమైన నవ్వుతో అవతలి వారిని ఆకట్టుకుని తమ మాట నెగ్గించుకుంటారు. కొందరి స్వామీజీల మాటలు, ఆకర్షణీయ ప్రసంగములు ఎక్కువమంది భక్తులను ఆకర్షించుట కూడ భక్తుల వశీకరణగా కొందరు భావిస్తారు. 

చిరునవ్వులు ప్రియ సంభాషణలలో ఒక భాగముగా భావించి ఒక చిన్న స్వానుభవము పంచుకుంటాను. నా తోటి ఉద్యోగి ఒకరు అవతలివారు ఏమి చెప్పినా చిరునవ్వే అతని సమాధానం అవుతుంది. అటువంటప్పుడు, అవతలవారు పోట్లాడుటకాని, తప్పు బట్టని విధముగా ఉండి తప్పక వారిని మంచి మిత్రులుగా చూస్తారు. మెరుగైన ప్రవర్తన గల ఉద్యోగి శిక్షణా తరగతులలో పాల్గొన్నప్పుడు దాని ప్రభావం చేత ఉత్పత్తి పెరిగి దేశాభివృద్ధి జరుగుతుంది. సరసమైన ధరలతో పాటు ఉత్పత్తుల నాణ్యత కూడా ముఖ్యము. ఉదాహరణగా చిన్న విషయము. కొన్ని ఏళ్ల క్రితం ఒక ప్రముఖ బ్రాండ్ షేవింగ్ బ్లేడ్ కొన్నప్పుడు,  అంచున పదునులేని బ్లేడు వచ్చి, దానిని డస్ట్ బిన్ లో వెయ్యక కంపెనీ అడ్రస్ కు పోస్టులో పంపాను. కంపెనీ వారు దానిని డస్ట్ బిన్లో పడవేసారో, సారు లేక అంచు పదును పెట్టి తిరిగి వాడారో నాకు తెలియదు. కుండబద్దలు కొట్టి నిజం చెప్పేవారి కంటే లౌక్యముగా మాట్లాడి పనులు చక్క బెట్టుకునే వారిని లౌక్యం కవచంలా కాపాడుతుంది.

నీతి: ప్రియ సంభాషణ మనసుకు ప్రియము. ఆహ్లాదము.

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.