Tuesday, March 2, 2021

సన్యాస జీవితము

సన్యాస జీవితమునకు భారత జీవన  విధానంలో ఒక గుర్తింపు ఉంది. మానవ జీవితంలో జీవితపు చివరి దశలో పాటించే ధర్మంగా సన్యాస స్వీకరణను చెప్తారు. 

వివాహ జీవితంలో తను గడిపిన సుఖజీవితం చివరిదశలో తృప్తి పడి కలిగించిన వైరాగ్యముపై నిర్ణయమునకు గుర్తుగా వానప్రస్థము బదులు సన్యాసము స్వీకరిస్తారని చెప్పుకుంటారు. పేరుకు తేడా ఉన్నా వానప్రస్థమునకు, సన్యాసమునకు పోలికలు ఉంటాయి. సన్యాసులను యతీశ్వరుడుగా పిల్చుకొని వారిని దైవ సమానులుగా చూస్తాము. పురాతన కాలంలో కాషాయ రంగు వస్త్రం ధరించిన వారికి ఇచ్చే మర్యాద విలువ కట్టలేనిది. కాలం మారి గౌరవములో కూడా మార్పులు వచ్చినవి. సన్యాసమునకు దారితీసే వైరాగ్యమునకు శని, కేతు ప్రభావం ఉంటుంది.

శైవధర్మంలో బ్రహ్మచారిగా ఉండి సన్యాసము స్వీకరిస్తే, కొన్ని ఇతర ధర్మములలో పెళ్ళి అయ్యి భార్య పిల్లలు కలిగిన తరువాత సుఖములు అనుభవించి, ధర్మము, సంస్కృతిని రక్షించుటలో భాగముగా, భార్య అనుమతితో సన్యాసం స్వీకరించుట కనిపిస్తుంది. పెళ్ళి కానివారు తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించుట ఒక ఆచారమై కఠిన నిర్ణయం అయినది. సన్యాసం స్వీకరించినవారు ఎక్కువగా స్పందించని జీవితం గడుపుట, శరీరముపై మరియు బంధువులపై మమకారం తగ్గుట సన్యాసి కనీస ధర్మముగా చెప్పబడినా, తోటి మానవులకు విపత్తులు కలిగినప్పుడు, సహాయం అవసరమైనప్పుడు స్పందించుట, ఈ భూమి మీద ఉన్నంతకాలము తోటి మానవ సేవలో పాల్గొనుట మానవ జీవిత ధర్మం. దీనిని పాటించినవారు కొందరు సేవా కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంటారు. 

కొన్ని ఆశ్రమముల ద్వారా నడిచే విద్యాలయాలు, శిథిల దేవాలయముల జీర్ణోద్ధరణ, ఆస్పత్రులు, అనాధుల సేవ వంటి సమాజమునకు అవసరమైన కొన్ని ప్రయోజనములను వాటిలో చెప్పుకోవచ్చు. ఇవి అందరికీ ప్రయోజనకరమైనవని నిస్సందేహంగా చెప్పవచ్చు. విలాసవంతమైన ఆశ్రమములు, ప్రపంచ సౌఖ్యములపై ఆశ శరీర సౌఖ్యములో భాగంగా  విదేశీ వ్యాయామ ఉపకరణముల వాడకం కొందరి మనసులలో వ్యతిరేక భావము నింపినా, మొత్తం మీద సన్యాసుల జీవన విధానము లేక పనితీరు మనుషులపై పెద్ద వ్యతిరేక ప్రభావం చూపదు. అందరు సన్యాసులు సర్వసంగపరిత్యాగులు కారు. సన్యాసి జీవితము ప్రపంచ వాతావరణమునకు దూరంగా ఉండవలసి ఉన్నా,  వారి జీవితానికి సంఘములో ఒక గౌరవ స్థానం ఉన్నప్పటికీ, వారిని ప్రపంచ వ్యామోహములకు అతీతులని భావించరాదు.

కొందరు సన్యాసులు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులతో అధికార ప్రాప్తక ఆసక్తితో రాజకీయ భావములు కలిగి అధికారం ఉన్నవారి చుట్టూ తిరుగుట జరుగుతున్నది. ఈ ప్రాపకమునకై చేయు ప్రయత్నములు ప్రభుత్వ నాయకత్వం మారిన తరువాత వ్యతిరేక ఫలితములు వచ్చుట మనము చూస్తున్నాము. ఈమధ్య  పేపర్లో చదివిన ఒక వార్త - వ్యామోహం పూర్తిగా వదలని నడివయసులో ఉన్న దిగంబర సన్యాసిని, శిష్యురాలి ప్రియునిపై మోజుపడి అతని చంపించిన వైనము ఆమెను శిక్షార్హురాలిని చేసింది. ఆమె పరమపదించినట్లు తెలుస్తున్నది. 

అన్ని మతములలో సన్యాస ఆశ్రమ స్వీకరణ పద్ధతులు ఉండి వాటిని అమలు చేస్తున్నారు. సన్యాస ఆశ్రమ ధర్మమములో  సమాజమునకు అవసరమైన జ్ఞానం పంచుట, సమాజమును సన్మార్గంలో నడుపుటై ఉన్నది. సన్యాసి ధనము కొరకు ఆశపడుట నిషిద్ధము. ఈనాడు ప్రతిదీ ధనముతో ముడిపడి ఉన్నది. కాషాయ వస్త్ర ధారణ వైరాగ్యముకు ప్రతీకగా నిలిచి వారిని సంఘములో గుర్తించుట సులభం చేసినది. కాషాయము ధరించిన ప్రతివారు సన్యాసి కాడని, వైరాగ్యవంతుడు కాదని మనం గ్రహించాలి. కాషాయ రంగుకి గల ప్రత్యేక ఆకర్షణ దానివైపు మనసును మరల్చినా, అందరూ పరిపూర్ణ సన్యాసులు కాలేరు.

సాయిబాబా జీవిత చరిత్రలో విజయానంద స్వామి తల్లిపై మమకారం వీడనందున అతనిని సాయిబాబా మందలించారని తెలుస్తున్నది. జన సామాన్యమునకు దూరంగా, ఆశ్రమాలు నిర్మించుకుని తమ కార్యకలాపములు నిర్వహించుటకు అవసరమైన దానము వారి సంపన్నులైన స్త్రీ పురుష శిష్యుల ద్వారా సమకూరుతుంది. సన్యాసులు వారి ఆశ్రమములో  సంవత్సరంలో 8 నెలలు ఉండి మిగిలిన నాలుగు నెలల కాలము చాతుర్మాస దీక్షగా జనం మధ్యలో ఉండి వారి ఉనికిని, జ్ఞానమును ప్రజలకు తెలియజేయు విధానమై, అందరు సన్యాసులు పాటించవలసిన నియమము. రాజకుమారుడై అందుబాటులో గల సౌఖ్యములను విడచి సర్వసంగ పరిత్యాగుడైన బుద్ధుని జీవితము మానవాళికి ఆదర్శము.                                          (సశేషం)

No comments:

Post a Comment

నేను ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను - 2

ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంలో చేరాను. జీవితంలో పొదుపు, జీతములో మదుపు చేయగలిగిన వారు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు.